February 23, 2020

సౌదీ సంక్షోభం ఉపాధిపై ప్ర‌భావం

సౌదీ సంక్షోభం ఉపాధిపై ప్ర‌భావం

4గ‌ల్ఫ్ ఉపాధిపై తీవ్ర‌ప్ర‌భావం చూపుతోంది సౌదీ సంక్షోభం. సౌదీ అరేబియాలో దశాబ్ద కాలంగా ఆర్థిక సంక్షోభం సుడులు తిరుగుతున్నది. ఈ సంక్షోభం పెను తుఫానుగా దేశ దేశాలను అతలాకుతలం చేస్తున్నది. ఈ నేపథ్యంలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చేపడుతున్న సౌదీకరణ, దానిలో భాగంగా తీసుకుంటున్న సంస్కరణలతో అనేక దేశాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. సౌదీ ప్రభుత్వం చేపట్టిన పొదుపు చర్యల్లో భాగంగా నిర్మాణ రంగంలో పెట్టుబడులకు కోత విధించటంతో ఒక్క సారిగా లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో భారతీయ సమాజమూ, తెలంగాణ కూడా ఆ సంక్షోభం తాకిడికి విలవిల్లాడుతున్నది. సౌదీలో వేలాదిగా ఉన్న భారతీయ కార్మికులు ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది.

ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలనూ ఇంతగా ప్రభావితం చేస్తున్న ఈ సంస్కరణలు సౌదీ అరేబియాకు మోదం కలిగించేవైతే, ఇతర దేశాలకు ఖేదం మిగిలిస్తున్నాయి. మిగతా అరబ్ దేశాల కన్నా సౌదీ అరేబియా అన్నింటి కన్నా ఎక్కువగా ముడి చమురు ఎగుమతులపై ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థ. బడ్టెట్‌లో 70శాతానికి పైగా నిధులకు చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడి ఉంటున్నది. అయితే కొంత కాలంగా చమురు ఉత్పత్తి దేశాల్లో కొరవడిన ఐక్యత, నియంత్రణలేని ఉత్పత్తి, పోటీ ఫలితంగా సౌదీ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీతంగా పడిపోవడం ఈ సంక్షోభానికి దారి తీసింది.

ప్రపంచ చమురు ఎగుమతుల్లో సౌదీ వాటా 1990 దశకంలో 25 శాతం ఉంటే, 2014 నాటికి 15.7 శాతానికి పడిపోయింది. అలాగే 2014లో బ్యారెల్ చమురు ధర అంతర్జాతీయ మార్కె ట్‌లో వంద డాలర్లు ఉంటే, గత డిసెంబర్‌నాటికి 26 డాలర్లకు పడిపోయింది. దీంతో పెట్రో డాలర్లతో వెలిగిపోయిన సౌదీ అరేబియా లోటు బడ్జెట్లతో నకనకలాడుతున్నది. 2014 బడ్జెట్ లోటు 3.4 శాతం ఉంటే, 2015 నాటికి అది 16.3 శాతానికి పెరిగిపోయింది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడం కోసం సౌదీ ప్రభుత్వం కాయకల్ప చికిత్సకు పూనుకున్నది. నీరు, విద్యుత్తుపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను ఎత్తి వేసింది. వీటన్నింటితో పాటు యువరాజు ఆహార పదార్థాల దిగు మతులను తగ్గించాడు.

పాలు, పాల ఉత్పత్తుల దిగుమతులు తగ్గించుకోవడమే కాదు, స్వయం సమృద్ధిని సాధించేం దుకు ఏకంగా లక్షా 80వేల ఆవులను పోషిస్తున్నా రు. అర్జెంటీనా నుంచి బల వర్ధకమైన పశుగ్రాసాన్ని తెప్పించి వాటి ఆకలి తీరుస్తున్నారు. ఆర్థిక మాంద్యం, లోటు బడ్జెట్లు ఏర్పడగానే విదేశీ రుణాలకోసం వెంపర్లాడటం కాకుండా దిగుమతులను తగ్గించుకుని స్వయం సమృద్ధిని సాధించడానికి సౌదీ తీసుకుంటున్న చర్యలు ఆదర్శం, అనుసరణీయం. ఇలాంటి నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సౌదీ పాలకులు అమెరికా కనుసన్నల్లో రక్షణ బడ్జెట్లకోసం అతిభారీగా నిధులు కేటాయించటం మానుకుంటే మంచిది. అమెరికా, రష్యా, చైనా తర్వాత అతి పెద్ద రక్షణ బడ్జెట్ కలిగి ఉండటంలో సౌదీ అవసరం కన్నా అమెరికా ప్రయోజనాలే ఇమిడి ఉన్నాయన్నది తెలిసిందే.

సౌదీ అరేబియాలో నిర్మాణ రంగం అతిపెద్ద వ్యవస్థ. ఈ రంగంలోనే లక్షలాది మంది ఆసియా దేశాల కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. ఎనభయవ దశకంలో పదిలక్షల మంది విదేశీ కార్మికులు ఉంటే, నేడు కోటి మందికి పైగా ఉన్నారు. లక్షలాది మందికి జీవనోపాధినిస్తున్న నిర్మాణ రంగంలో నిధుల కోత పెను మార్పులకు హేతువు అవుతున్నది. ముఖ్యంగా వృద్ధిరేటుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. కార్మికులంతా రోడ్డున పడి కొనుగోలు శక్తి కోల్పోవటం తో వస్తు వినియోగ, సేవా రంగాలతోపాటు, మార్కెట్‌రంగం కూడా తీవ్రంగా దెబ్బతింటున్నది. అందుకే విదేశీ కార్మికుల స్థానంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనుకుంటున్నది. ఈ నేపథ్యంలో అతి ఎక్కువగా ప్రభావితమైన వారు భారతీయ కార్మికులు. వేలాది మంది జీవనోపాధిని కోల్పోయి రోడ్లపై ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే స్వయంగా ఆహార కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కార్మికులకు రావాల్సిన జీత భత్యాలను భారత ప్రభుత్వం చొరవ తీసుకుని ఇప్పించగలిగితే బాగుండేది. కానీ ఆ దిశగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సౌదీ ప్రభుత్వం కూడా కంపెనీల జీత భత్యాల విషయంలో పెద్దగా స్పందించక పోవడం విషాదం. గత రెండు మూడు దశాబ్దాలుగా కరువు కాటకాల్లో జీవనోపాధినిచ్చి నిలువ నీడ నిచ్చిన సౌదీ అరేబియా సంక్షోభంలో కూరుకు పోవడం భారతీయ కార్మికులకు అశనిపాతమనే చెప్పవచ్చు. కానీ సౌదీ పాలకులు తమ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు, స్వయం సమృద్ధికి తీసుకుంటున్న చర్యలను తప్పు పట్టలేం. సౌదీ అరేబియాలో ఉపాధి అవకాశాలు ఇకముందైనా లభించే అవకాశం ఉన్నదా? ఇతర గల్ఫ్‌దేశాలలో ఉపాధి పరిస్థితులు ఏమిటి? గల్ఫ్‌లోని కార్మికులు తిరిగి వస్తే వారికి స్థానికంగా ఉపాధి కల్పించడం ఎట్లా మొదలైన కోణాలలో భారత ప్రభుత్వం చర్చించి సత్వర చర్యలు తీసుకోవాలె.

Related posts