April 05, 2020

Breaking News

సౌదీ, ఇరాన్‌, యెమెన్‌లో సంక్షోభం

సౌదీ, ఇరాన్‌, యెమెన్‌లో సంక్షోభం

సంక్లిష్టంగా, కనుచూపు మేరలో పరిష్కారం కనిపించని రీతిలో పరిణామాలు మారుతున్న ప్రాంతం- అరేబియా ద్వీపకల్పం!  సౌదీ అరేబియా కేంద్రంగా అనూహ్య రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. అవినీతి ఆరోపణల పేరిట 11 మంది యువరాజులు, నలుగురు ప్రస్తుత మంత్రులు, 10 మంది మాజీ మంత్రులపై వేటు పడింది. ఆ మరుసటి రోజే- వారిలో కీలక యువరాజు మన్సుర్‌ బిన్‌ ముక్రిన్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో అసువులు బాశారు. ఆ నేపథ్యంలోనే రియాద్‌ విమానాశ్రయంపై యెమెన్‌ నుంచి జరిగిన క్షిపణి దాడిని సౌదీ అరేబియా పేట్రియాట్‌ రక్షణ వ్యవస్థ సకాలంలో స్పందించి కూల్చివేసింది. అరేబియా ప్రాంతంలో సమస్యలకు, యెమెన్‌లో సంక్షోభం ముదరడానికి ఇరాన్‌ వైఖరే కారణమని సౌదీ అరేబియా విమర్శలు గుప్పిస్తోంది. సౌదీ అరేబియా, యెమెన్‌, ఇరాన్‌లతో ముడివడి విస్తరిస్తున్న సంక్షోభం; సౌదీలో అంతర్గత కలహాలు అంతర్జాతీయ సమాజంపై పెను ప్రభావం కనబరుస్తాయనడంలో సందేహం లేదు.
సౌదీలో పెను మార్పులు
సౌదీ భావి చక్రవర్తి 32 ఏళ్ల మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ సారథ్యంలో అవినీతి నిరోధక కమిషన్‌ ఏర్పాటైన మరుసటి రోజే- ఆయన సంచలనం సృష్టించారు. యువరాజులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు; ప్రస్తుత, మాజీ మంత్రులను కలిపి మొత్తంగా సుమారు 60మందిని అవినీతి ఆరోపణలపై అరెస్టు చేయించారు. సౌదీలోని ఓ అయిదు నక్షత్రాల హోటల్‌నే జైలుగా మార్చేసి వారందరినీ ఎటూ కదలకుండా బంధించారు. సౌదీ అరేబియా రాజకీయాలను భారీగా కుదిపేస్తున్న పరిణామాలివి. అరెస్టులతోపాటు దేశం వదిలి వెళ్ళకుండా ప్రయాణ ఆంక్షలు విధించి, వారందరి ఆస్తులను స్తంభింపజేస్తూ సౌదీ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం వెలువరించింది. వెల్లువెత్తిన ప్రజాందోళనల దృష్ట్యా అబ్దుల్‌ అజీజ్‌ పెద్దకొడుకును పదవీచ్యుతుణ్ని గావించి 1964లో సౌదీ అరేబియా రాజుగా ఫైజల్‌ అధికారం చేపట్టింది మొదలు ఆ దేశంలో బాధ్యతాయుత పాలన పురివిప్పింది. దేశాధికారం పూర్తిగా రాజు చేతుల్లో ఉన్నప్పటికీ- ముఖ్య నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణంలో కీలక యువరాజులందరి ఆమోదమూ తప్పనిసరి అయ్యేది. ఇప్పుడు దేశంలో ముఖ్యమైన స్థానాలను అలంకరించిన బంధువులపై వేటువేయడం ద్వారా సౌదీ భావి చక్రవర్తి మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ మున్ముందు తన అధికారానికి ఎలాంటి అడ్డంకులూ లేని వాతావరణాన్ని సృష్టించుకోవాలనుకుంటున్నట్లు వెల్లడవుతోంది. కుట్రలు, కుహకాలతో రాజును పదవినుంచి దింపేసిన ఘటనలు సౌదీ అరేబియా చరిత్ర నిండా కనిపిస్తాయి. రాజ్యంలో శక్తిమంతులనదగిన వారందరినీ తొలగిస్తే ఇక తనకు వ్యతిరేకంగా కుట్ర చేసేవారే ఉండరన్నది మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆలోచన కావచ్చు!
ఇస్లామ్‌ మతానికి చెందిన పవిత్ర క్షేత్రాలకు సౌదీ అరేబియా కేంద్ర స్థానంగా ఉంది. ఈ ఏడాది భారత్‌నుంచే లక్షా 70వేలమంది హజ్‌ యాత్రికులు సౌదీ సందర్శిస్తారని అంచనా. సంప్రదాయ వహబి వర్గం ప్రబలంగా ఉన్న సౌదీ అరేబియాలో సున్నీలదే సంపూర్ణ ఆధిపత్యం. పశ్చిమాసియా రాజకీయాల్లో సౌదీ మొదటినుంచీ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ దేశం భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. సుమారు 2,500 కోట్ల డాలర్ల విలువైన వాణిజ్యం భారత్‌, సౌదీ అరేబియాల మధ్య జరుగుతోంది. భారత్‌ దిగుమతి చేసుకుంటున్న ముడిచమురులో 19శాతం సౌదీ నుంచే వస్తోంది. మరోవంక భారత్‌ నుంచి అత్యధికంగా దిగుమతులు చేసుకుంటున్న దేశాల్లో సౌదీ ఎనిమిదో స్థానంలో ఉంది. సౌదీ అరేబియాలో తాజాగా తలెత్తిన రాజకీయ సంక్షోభానికి అరేబియా ద్వీపకల్పం పరిణామాలను ప్రభావితం చేయగల స్థాయి ఉంది. పోటీదారులెవరూ లేకుండా మహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌ రాజ కుటుంబీకులందరిపైనా వేటు వేశారు. అయితే వారి స్పందన ఎలా ఉండబోతోందన్నదే ఇప్పుడు కీలకం. రాజకీయాలనుంచి తప్పుకొని సౌదీ భావి చక్రవర్తి ఎర చూపబోయే ఆర్థిక ప్రయోజనాలకే పరిమితం కావాలని వారు నిర్ణయిస్తే సమస్యే లేదు. ఇటీవల తలెత్తిన సంక్షోభం కొన్ని వారాల వ్యవధిలోనే సమసిపోతుంది. అలాకాకుండా మహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌ మరీ కఠినంగా వ్యవహరించి రాజకుటుంబీకుల ఆస్తుల స్వాధీనానికి పూనుకొంటే మాత్రం సంఘర్షణలు చెలరేగుతాయి. సౌదీ అరేబియాలో రాజకీయ విభేదాలు మితిమీరితే హింసాత్మక పరిణామాలూ తలెత్తవచ్చు. దానివల్ల అంతర్జాతీయ వాణిజ్య విపణులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. గడచిన రెండేళ్లుగా మహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌ రాజకీయంగా ఆచితూచి అడుగులేస్తున్నారు. ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదునుపెట్టుకొంటూ ఒళ్లంతా కళ్లు చేసుకొని ప్రవర్తిస్తున్నారు. చమురు ధరల పతనంతో సౌదీ అరేబియా ఆర్థికంగా కుంగిపోయింది. కాబట్టి చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశాన్ని క్రమంగా ఇతర రంగాలవైపు మరల్చేందుకు సుల్తాన్‌ గట్టి సంకల్పంతో అడుగులేస్తున్నారు. సరికొత్త పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రత్యర్థులంతా ఒక్కతాటిపైకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను అనుకున్న విధంగా మార్చడం సుల్తాన్‌కు సాధ్యం కాకపోవచ్చు. పక్షం రోజుల క్రితం దేశంలో జరిగిన అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సులో మహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌ 2030నాటికి సౌదీ అరేబియాకు సంబంధించిన తన సమున్నత లక్ష్యాలను ఆవిష్కరించారు. ప్రపంచంలో ఏ మూలనున్న పెట్టుబడిదారులైనా తమ దేశానికి స్వేచ్ఛగా తరలివచ్చి వ్యాపారం ప్రారంభించగల అత్యాధునిక ఆర్థిక వ్యవస్థను సృష్టించనున్నట్లు, అవినీతికి తావులేని వ్యవస్థల ఏర్పాటుకు నిబద్ధమైనట్లు, మహిళలకు మరింత స్వేచ్ఛనిచ్చే సామాజిక సంస్కరణలకు సమకట్టనున్నట్లు ప్రకటించారు. ఆయన ప్రకటించిన సంస్కరణలు దేశ జనాభాలో 70శాతంగా ఉన్న యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పెద్దవయస్కులు మాత్రం సుల్తాన్‌ ప్రతిపాదనలపట్ల అనుమానాలను, అసంతృప్తిని వ్యక్తం చేశారు. వందల సంఖ్యలోని యువరాజులు, వారితో సన్నిహిత సంబంధాలున్న కొందరు సంపన్న వ్యాపారులే సౌదీ అరేబియా పరిణామాలను సాధారణంగా శాసిస్తుంటారు. ఒకరకంగా సౌదీ అరేబియాలో సాధారణ ప్రజల అభిప్రాయాలకు దేశ అధికార పీఠాలను మార్చగల శక్తి లేదనే చెప్పాలి.

భౌగోళిక బలాబలాలు

ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాలు (26,800 కోట్ల బ్యారెళ్లు) ఉన్న దేశంగా సౌదీ ప్రాధాన్యం ఎనలేనిది. ప్రపంచవ్యాప్తంగా 2016లో 3,500 కోట్ల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అయ్యింది. సౌదీ అరేబియాకు మాత్రమే ప్రతి రోజూ కోటీ పది లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. కానీ ‘ఒపెక్‌’తో ఒప్పందం మేరకు సౌదీ అరేబియా రోజూ 72 లక్షల బ్యారెళ్ల ముడిచమురు ఉత్పత్తికి పరిమితమైంది. అరబ్‌ ప్రాంతంతోపాటు పర్షియన్‌ జలసంధి, ఎర్ర సముద్ర ప్రాంతాలపైనా సౌదీ అరేబియా ప్రభావం అపారం. అత్యంత కీలకమైన సూయజ్‌ కాలువ మార్గం ఉండటంతో ఎర్ర సముద్రానికి ప్రాధాన్యం బాగా పెరిగింది. నిరుడు సూయజ్‌ కాలువ ద్వారా సుమారు 17వేల ఓడలు పది లక్షల టన్నుల సరకును రవాణా చేశాయి. ఈ మార్గం కాకుండా మరో మార్గం గుండా గమ్యం చేరాలని ప్రయత్నిస్తే కనీసం 3,300 నుంచి 7,950 మైళ్ల దూరం పెరుగుతుంది. అందుకే రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా పశ్చిమాసియా విధానం దాదాపుగా సౌదీ అరేబియా కేంద్రంగానే సాగింది. సౌదీకి అపరిమిత ప్రాధాన్యమిచ్చిన అమెరికా సూయజ్‌ ప్రాంతంలో సైనిక స్థావరాలనూ ఏర్పాటు చేసుకొంది. మరోవంక 1979నాటి ఇరాన్‌ విప్లవానంతరం ఆ దేశ ప్రాముఖ్యం అనూహ్యంగా పెరిగింది. పశ్చిమాసియాలో సౌదీ అరేబియాకు దీటైన ప్రత్యర్థిగా ఇరాన్‌ ఆవిర్భవించింది. ఇరాన్‌ షియాల ప్రాబల్యంలోని దేశం! చారిత్రకంగా సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య ఉన్న విభేదాలు క్రమంగా పెరిగి పెద్దవి కావడమే ఇప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనలోకి నెడుతున్న అంశం.
భారత్‌పైనా ఒత్తిడి
సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ దిగజారకూడదంటే బ్యారెల్‌ చమురు ధర 70 అమెరికన్‌ డాలర్లుగా ఉండాలి. దేశంలో అంతర్గతంగా ఆర్థిక పరిస్థితులు గతి తప్పుతున్న తరుణంలో సౌదీ భావి చక్రవర్తి సుల్తాన్‌- రాజకుటుంబీకులు, వారి సంబంధీకుల అవినీతిపై కొరడా ఝళిపించడం సంచలన పరిణామమే! ఒకవంక యెమెన్‌లోని షియా తిరుగుబాటుదారులనుంచి సౌదీ ప్రభుత్వం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. మరోవంక గల్ఫ్‌ సహకార మండలి (జీసీసీ)తో కలిసి కతార్‌తో సంబంధాలపై సౌదీ సర్కారు నిషేధం వేటు వేసింది. మరోవంక ఇరాన్‌తో అంతకంతకూ సమస్యలు ముమ్మరిస్తున్నాయి. రియాద్‌ విమానాశ్రయంపై దాడిని తమ దేశంపై ఇరాన్‌ ప్రకటించిన ‘యుద్ధం’గా పరిగణిస్తామని సౌదీ రాజు వ్యాఖ్యానించడం ఆ ప్రాంతంలో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయనేందుకు నిదర్శనం. ఒకప్పుడు గల్ఫ్‌ దేశాలన్నింటికీ ఇజ్రాయెల్‌ ఒక్కటే ఉమ్మడి శత్రువు. పరస్పర సహకారంతో ఇజ్రాయెల్‌పై గతంలో పోరాడిన అరబ్‌ దేశాలు, ఇప్పుడు ఒకదానితో మరొకటి కీచులాటల్లో తలమునకలుగా ఉన్నాయి. ఇరాన్‌-సౌదీల మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం అదుపుతప్పినా అవి దావానలంలా విస్తరించి ప్రపంచవ్యాప్తంగా షియా, సున్నీల మధ్య ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉంది. అత్యధిక సంఖ్యలో ముస్లిం జనాభాగల భారత్‌ను ఈ పరిణామాలు గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఆ పరిస్థితుల్లో ఏదో ఒక పక్షానికి మద్దతు పలకాలని భారత్‌పై అన్ని వైపులనుంచీ ఒత్తిడి పెరిగే అవకాశాలు కొట్టిపారేయలేనివి. ఇరాన్‌, సౌదీ అరేబియాలు రెండూ భారత్‌కు అత్యంత కీలకమైన మిత్రదేశాలు. పాకిస్థాన్‌ను మరీ హద్దుమీరకుండా అదుపు చేసే క్రమంలో భారత్‌కు సౌదీ అరేబియా అద్భుతంగా అక్కరకొస్తుంది. అయితే మధ్య ఆసియాలో ముఖ్యంగా అఫ్గానిస్థాన్‌లో భారత ప్రయోజనాలను కాపాడుకునే క్రమంలో ఇరాన్‌ బాసట చాలా అవసరం. పైపెచ్చు దీర్ఘకాలంగా భారత్‌కు ఇరాన్‌ అత్యంత నమ్మకమైన మిత్రదేశంగా కూడా ఉంది. విదేశాంగ విధానపరంగా భారత్‌ ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరముంది. ఉద్రిక్తతలు హద్దుమీరి చమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్లపైన దీర్ఘకాలం తచ్చాడితే- ఇప్పటికే మందగమనంలో సాగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ మరింత ప్రతికూల పరిస్థితుల్లోకి జారుకుంటుంది. అందువల్ల విదేశాంగ, ఆర్థిక విధానాలను మనదేశం సమీక్షించుకుని, వాటికి మరింత పదును పెట్టాలి!

Related posts