April 10, 2020

Breaking News

విద్వేష రాజనీతి కుట్ర

విద్వేష రాజనీతి కుట్ర

ఒకవైపు ఇరాక్,ఆఫ్ఘనిస్తాన్,లిబియా వల్లకాళ్ళు అయ్యాయి. మరో వైపు సిరియా, గాజా, పాలస్తీనాల నుండి కాశ్మీరు లోయ వరకు నిరంతరం నెత్తురోడుస్తున్నాయి.మరీ ముఖ0గా ప్రపంచ దేశాల అభిమాతానికి విరుద్ధంగా ఈమధ్యే జెరూసలేం లో అమెరికా తన రాయబార కార్యాలయాన్ని ఓపెన్ చేసింది. కన్నీటి పాలస్తీనా జాతి బాధలో ఉంది. గాజా వెస్ట్ బాంక్ లలో రంజాన్ మాసంలో కూడా కర్ఫ్యూ తొలగి లేదు.ఇస్లామ్ పుట్టిన దేశాలలో నేడు ప్రశాంతత లేదు. మక్కా, మదీనా వంటి పవిత్ర నగరాలతో కూడిన సౌదీ అరేబియా దుస్థితి విషాధకరం. అమెరికా వత్తాసు తో అత్యవసర పాలనతో నేడు అదొక ఘోర నిర్బంధ శిబిరంగా మారింది. కర్బలా,నజాఫ్, నజీరియా, బస్రా వంటి పవిత్ర ఇస్లామ్ నగరాలతో కూడిన ఇరాక్ నేడు పర పాలనలో మగ్గుతున్నది. బాంబింగ్ దాడుల మధ్య ఆయా ఇస్లామ్ దేశాల ప్రజలు నేడురంజాన్ ని సంతోషం గా చేసుకోలేని దుస్థితి ఉంది. పురాతన నాగరికతా కేందాలైన బాబిలోనియా, బాగ్దాడ్, డమాస్కస్, జెరూసలేం వంటి చారిత్రిక ప్రదేశాలు మరుభూములు గా మారాయ్.ఈ నేపధ్యం లో ఆధునిక కుహనా నాగరిక సంపన్న రాజ్యాలు నేడు రంజాన్ ని ఇస్లామ్ ప్రజలకి విషాద భరిత సంఘటనగా మార్చాయి. ఈ కుహనా నాగరిక సంపన్న రాజ్యాలు ఇలాంటి దురవస్థకి గురి చేయడం విషాధకారమైనది. వాటి నేపద్యంలోకి వెళ్తే ప్రధాన ఇస్లామ్ దేశాల మనుగడకి చమురు సంపద ఓ పెను ముప్పుగా మారిందని చరిత్ర మనకి బోధిస్తుంది. నిజానికి అది తొలుత ఎడారి నేల! కుహనా ఆధునిక యుగం లో అడుగు పెట్టక ముందు అట్టి ఎడారిదేశాల దుర్భర దుస్థితి వర్ణించ లేనిది. అవి ఆనాడు మిగిలిన ప్రపంచ దేశాల కంటే సాపేక్షికంగా అత్యధిక దారిద్ర్యాన్ని అనుభవించాయి. ఎడారి లో అపారమైన చమురు నిల్వలు కనుగొనక ముందు ఇస్లాంకి జన్మనిచ్చిన నేలతో సహా ప్రధాన ఇస్లాందేశాల దుర్భర స్థితి అది. సంపద కి మారు పేరైన చమురుని కనుగొన్న తర్వాత నిజానికి అవి సంపన్న రాజ్యాలుగా మారాలి. కానీ అవి అలా మార లేదు.పైగా సంపన్న రాజ్యాల చే దురాక్రమనల కి గురయ్యాయి. ఎడారినేల మీద మండే ఎండల వల్ల ఆ ప్రజల శరీరాలు నాడు కడు అధికంగా చెమట కారిస్తే, నేడు సైనిక దురాక్రమనల చేత కాల్వలుగా రక్తాన్ని కార్చాల్సి వస్తుంది.నిజం చెప్పాలంటే, చమురు దేశాల మనుగడకి “ఆధునికత” ఒక ఉరిత్రాడు గా మారింది. ఎంగెల్స్ చెప్పిన “అసలు నాగరికత అనేది ఒక వర్గాన్ని మరో వర్గం దోచుకోవడం అనే పద్దతిమీద ప్రారంభమైనది” అను సూక్తి ఇస్లామిక్ దేశాలకి అక్షర సత్యంగా వర్తిస్తుంది. నిజానికి నేటి కుహనా ఆధునికత కంటే ముందు,ముఖ్యంగా ప్రాచీన కాలంలో ఆ ఎడారి నేల మీదే తొలి రసాయన, ఖగోళ, భూగోళ,వైద్య విజ్ఞానాలతో పాటు తొలి లిపి కూడా వెలిసింది. ప్రాచీన నాగరికత వర్ధిల్లిన దేశాల జాబితాలో అవి కూడా ఉన్నాయి. కుహనా ఆధునిక నాగరికత దశ లో అడుగు పెట్టె సరికి పరిస్థితి తారు మారు అయ్యుంది. చమురు దేశాల చరిత్ర గమనాన్ని “ఆధునిక యుగం” వెనక్కి తిప్పింది. చరిత్ర నిర్మాణం లో “చమురు” ఆవిష్కరణ ఓ మైలురాయి అనేది తెలిసిందే! అప్పుటికే ఉనికిలోకి వస్తున్న ఆవిరి ఇంధన ఆధారిత నూతన ఆవిష్కరణలని “చమురు” వెనక్కి నెట్టింది. చమురు కనుగొన్నాక ప్రపంచ పారిశ్రామిక గమనంలో మౌలికమైన మార్పులు వచ్చాయి.అది ఆధునిక విద్యా విజ్ఞానాలని అంద జేసింది.ఐతే అట్టి ఆధునిక ఫలాలు ఇస్లామ్ దేశాల ప్రజలకి అందలేదు. ఈ కుహనా ఆధునికతే ప్రధాన ఇస్లాం దేశాల మనుగడకి నేడు ఒక గుదిబండగా మారింది. చమురు కోసం సంపన్న రాజ్యాలు చేసే యుద్ధం వల్ల నేడు ఇరాక్, లిబియా, ఆఫ్ఘనిస్తాన్, సిరియా వంటి కొన్ని ఇస్లాం దేశాలు శ్మశాన భూములు గా మారాయ్. గాజా నుండి కాశ్మీరు లోయ వరకూ నడుస్తున్న విషాద భరిత మైన రక్తస్రావాల చరిత్రే! ఎన్నెన్నో ఇస్లాం దేశాల ప్రజలకి తమ స్వ0త చమురు సంపద “బిడ్డకి దొరకని స్తన్యం” గా మారింది.కన్నదూడకి సైతం పాలు దొరక్కుండా చమురు ని పితుక్కు పోయే లూటీ రాజ్య పాలన అక్కడ నేడు సాగుతున్నది. అక్కడ ఒక డాలర్ ఇచ్చి తెచ్చిన చౌక చమురుని ఇక్కడ అధిక పన్నులతో బారెడు ధరకు అమ్మి సొమ్ము చేస్తున్న హిందుత్వ సర్కార్ నాటకం కూడాతెలిసిందే!ఆవుదూడ కి ఆవు తల్లి ఐనట్లే, ఆయా చమురు దేశాల ప్రజలకి చమురుతో కూడిన తమ మాతృ భూములు కూడా అట్టి తల్లి వంటివే. అట్టి నేలతల్లి అందించే చమురు సంపద మీద ఆ బిడ్డలకు నేడు హక్కులేదు. చమురు దేశాల బడా సుల్తానులూ, షేకులూ, నవ్వాబుల సర్కారులూ,& సంపన్న రాజ్యాల చమురు కార్పొరేటు కంపెనీలూ చమురుతో అధికంగా లాభపడుతున్నాయి. తమ జాతిజనులకి మాత్రమే చమురు సంపద దక్కాలన్న పాపానికి సద్దాం, గడ్డాఫీ దేశభక్తియుత సర్కాలని కూల్చి వేయడం తెలిసిందే. నేడు ప్రధానంగా ఇస్లామ్ దేశాలలో దొరికే చమురుని జానెడు ధరకు కొని తెచ్చి, ప్రధానంగా హిందుజనం నివసించే భారత్ లో దాని మీద హిందూత్వ సర్కారు మూరెడు పన్నులు వేసి బారెడు ధరతో తమ “ప్రియ హిందూ దేశ” ప్రజలకు అమ్మడం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ రంజాన్ పండుగ వచ్చింది. అది ఇచ్చే సందేశం ఏమిటి? అన్ని మతాల, దేశాల సామాన్య ప్రజలూ పెట్రో యుద్ద బాధితులే! అన్ని మతాల పేరిట పాలించే వివిధ సర్కార్లూ ప్రజా వ్యతిరేకమైనవే! రంజాన్ ని ముస్లిం ప్రజలకి ప్రపంచ వ్యాపితంగా విషాదదినంగా మార్చిన ప్రపంచ కార్పొరేట్ వ్యవస్థపై సకల మతాల ప్రజలు ఐక్య పోరు సాగించే లక్ష్యం నేడు ముఖ్యమైనది. అందుకోసం దీక్ష వహిద్దాం. వివిధ దేవుళ్ళు, మతాల పేరిట నేడు అధికారం చేలాయించే సర్కార్లు అన్నీ తెర వెనుక ఒకే ద్రవ్య పెట్టుబడిదారీ వ్యవస్థకు కొమ్ము కాస్తున్నాయి. ఇప్పుడు వివిధ దేశాలు, మతాలు, జాతులు, కులాలు, తెగలకి చెందిన సకల ప్రజలు కూడా ఒకటి కావాలి.ముఖ0గా ఒకవైపు అక్కడి ఇస్లామ్ ప్రజలని “స్తన్యం దక్కని లేగ దూడలు” గా మార్చి; ఇక్కడి హిందూ జనులకి జానెడు అసలు ధరపై మూరెడు పన్ను పోట్లతో బారెడు ధరకు అమ్ముతున్న “పెట్రో లూటీ” తెలిసిందే! ఈ నేపథ్యంలో ఈ రంజాన్ ని సకల మతాల ప్రజల మధ్య ఐక్యత కి ప్రతిరూపంగా, ప్రతీకగా భావిద్దాం. హిందు, ముస్లిం విద్వేషాలు, కులవిద్వేషాల ప్రాతిపడికతో పాలించే కుట్రల ఓటమి కోసం “పెట్రో లూటీ” (petro robbery) పై “పెట్రో ఐక్యత”( petro unity)సరికొత్త ఆయుదం. తాము పవిత్రంగా పూజించే మక్కా, మదీనా, కర్బలా, నజాఫ్, జెరూసలేం లని శ్మశాన భూములుగా మార్చిన దురాక్రమణ శక్తులపై ప్రపంచ ముస్లిం ప్రజలలోని కసి, ద్వేషాలని పక్కదారి పట్టించే కుట్రలని చిత్తు చేయాలంటే; వాటిని సరైన దారిలో పదును పెట్టాలంటే; భారత దేశ0లో సామాన్య హిందు ప్రజల అసంతృప్తి, అభద్రతా భావనలనిమత విద్వేషాలు గా మార్చ జూస్తున్న కుట్రలని ఓడించాలంటే పెట్రో పోరు వంటి పోరాటాలు చక్కని సాధనాలుగా ఉపయోగ పడతాయి. వివిధ సర్కార్లు ఇస్లామ్ ప్రజలకి అందించిన విషాదాన్ని మరిపించి, ఆత్మ విశ్వాసాన్ని వారికి అందించే బాధ్యత మతాతీత ప్రాతి పడిక పై ప్రజలందరి మీద ఉంటుంది.లౌకికపునాడుల పై అట్టి ప్రజా ఐక్యతని రూపొందాల్సి ఉంది. ప్రజల మీద అధికార “సుస్థిరత” కోసం; రాజ్య పటిష్టత కోసం; లక్షల కోట్ల పన్నుల రాబడి సర్కార్లకు అవసరం. ఈ డబ్బు రాబడి కోసం చమురు ఒక గొప్ప వనరు అయ్యుంది. ఈ డబ్బుతో కొనే ఆయుధాలు అన్ని మతాల ప్రజల అణచి వేత కోసం అవసరం. ఇలా అన్ని మతాల ప్రజల నుండి గోళ్ళూడగొట్టిన పన్నుల సొమ్ముతో మనుగడ సాగించే రాజ్యం ఎంత ఎక్కువ బలపడితే, వివిధ మతాల ప్రజల మధ్య చిచ్చు పెట్టె విద్వేష రాజనీతి కుట్రలకు కూడా అంత ఎక్కువ బలం చేకూరుతుంది. అందుకే పెట్రో లూటీ ని పెట్రో యూనిటీ గా మారుస్తామని  దీక్ష వహిద్దాం.

 

Related posts