April 05, 2020

Breaking News

వలస పక్షులు

వలస పక్షులు

ఈ సృష్టిలో పక్షులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తమ ఆహారం.. ఆవాసం.. సంతానోత్పత్తి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేస్తుంటాయి. సీతాకోక చిలుకలు, క్రిమికీటకాదులు, జంతువులు కూడా వలస వెళ్తుంటాయి. కొన్ని సముద్ర జీవజాతులు సైతం ప్రతిరోజూ వేరే ప్రాంతాలకు వలసవెళ్ళి సాయంత్రానికి తిరిగి తమ నివాస ప్రాంతానికి చేరుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ఇలా వలసలు పోవడం అనాదిగా మనుషుల్లోనూ వుంది. మనిషి తన మనుగడ సాగించేందుకు నిరంతర ప్రయాణం సాగించేవాడు. ఈ ప్రయాణంలో వేటలుండేవి, కొట్లాటలుండేవి, నిరంతర యుద్ధాలుండేవి. ఈ ప్రయాణమంతా మనిషి తన సుస్థిర జీవనం కోసం సాగించిన పోరాటమే. ‘కాళరాత్రి జీవితయాత్ర/ ప్రొద్దు పొడవదు, కూచునేందికి వీలులేదు/ ఒంటరిగా ఒంటరిగా మంటల్లో మాటల్లో/ పయనిస్తున్నాడు నరుడు/ తా నెరుగని దిక్కుకేసి’ అంటాడు బైరాగి. దేశం, ప్రపంచం ఇంత నాగరికత నేర్చినా, అభివృద్ధి చెందినా…ఇంకా తానెరుగని దిక్కుకేసి ప్రయాణం సాగిస్తూనే వున్నాడు. ఒకప్పుడు తన కోసం ప్రయాణిస్తే, ఇప్పుడు మరొకడు తరుముతుంటే ప్రయాణిస్తున్నాడు. ఒకప్పుడు ఆకలితో ప్రయాణిస్తే, ఇప్పుడు ప్రాణభయంతో ప్రయాణిస్తున్నాడు. అయితే, ఇప్పటి కొట్లాటలు అధికారం కోసం, మనుషుల్ని వేటాడటం కోసం సాగుతున్నాయి. వీరి ఆక్రందనలు ఎవరికీ వినిపించవు, వీరి కన్నీళ్లు ఎవరికీ కనిపించవు. మతం పేరుతోనో, జాతి పేరుతోనో జరిగే మారణహోమంలో బంధాలను కోల్పోయేవాళ్లు, ప్రాణాలను కోల్పోయేవాళ్లు, ఒంటరిగా మారి, తమ జీవితాలను కోల్పోయేవారు ఎందరో. వీరినెవరూ పట్టించుకోరు. ఈ దారుణ మారణకాండను తట్టుకోలేక ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు అరచేతే పట్టుకుని వలస బాట పడుతున్నారు. అందుకే అంటాడు మహాకవి శ్రీశ్రీ- ‘ఏ దేశచరిత్ర చూచినా/ ఏమున్నది గర్వకారణం?/ నరజాతి చరిత్ర సమస్తం/ పరపీడన పరాయణత్వం’ అని.
‘శరణార్థులు…కాందిశీకులు…వలసదారులు…’పేరేదైతేనేం? జన్మభూమిలో కొనసాగుతున్న నిరంతర ఘర్షణలు, యుద్ధ వాతావరణం, ఉగ్రదాడులు, మతపరమైన వేధింపులు, కరువు పరిస్థితుల వంటి కారణాలతో పొట్టచేత పట్టుకుని స్వదేశాన్ని విడిచి తమ కుటుంబాలను కాపాడుకోవడానికి వలసబాట పట్టినవారే. తమ ఆస్తులతోపాటు సొంత అస్తిత్వాన్నీ కోల్పోయి దినదిన గండంగా చస్తూ బతుకుతూ జీవిస్తున్నవారే. వారి పరిస్థితి ‘వనమిడిసిన కోతి, ఊరిడిసిన మనిషి ఒక్కటే’ అన్నచందంగా మారింది. యుద్ధాలు, హింస, విద్వేషపూరిత ఘటనలతో ప్రపంచ వ్యాప్తంగా 7.1 కోట్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ ఇటీవల ప్రకటించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా 27.2 కోట్ల మంది ప్రజలు వివిధ దేశాల్లో వలస జీవనం సాగిస్తోంటే, ఒక్క భారత దేశంలోనే అత్యధికంగా 1.75 కోట్ల మంది ప్రజలు ప్రవాస జీవితం గడుపుతున్నారని ఇంటర్నేషనల్‌ మైగ్రెంట్‌ స్టాక్‌ 2019 వెల్లడించింది. అనునిత్యం మానవహక్కుల జపం చేసే అమెరికా-అక్రమ వలసదారులన్న పేరుతో అమానవీయ చర్యలకు పాల్పడుతోంది. అమెరికా అక్కడ చేస్తున్న పనే… మనదేశంలో బిజెపి ప్రభుత్వం చేస్తోంది. శరణార్థుల లెక్కింపు పేరుతో ఈశాన్య రాష్ట్రాల మెడపై కత్తిపెట్టింది. దేశమంతటా ఎన్‌ఆర్‌సి అమలు చేస్తానంటోంది. తాజాగా పౌరసత్వ సవరణ బిల్లును తీసుకురావడం, త్వరలో జాతీయ జనాభా నమోదు ప్రక్రియ చేపడతామనడం ప్రజలను తీవ్ర అభద్రతలో ముంచెత్తడమే. తద్వారా ప్రభుత్వం మనిషికీ మనిషికీ మధ్య బంధాలను తెంచే ప్రయత్నం చేస్తోంది.
పెట్టుబడిదారీ విధానం తెచ్చిన ఆర్థిక సంక్షోభం, కరువు… సామాన్య ప్రజలను అనాథలనుగా చేస్తోంది. పెట్టుబడిదారీ విధానం వారి శ్రమను దోపిడీ చేస్తోంటే, పాలకులు వారి అస్తిత్వాన్ని దోపిడీ చేస్తున్నారు. ‘వ్యక్తి స్వభావం, స్వేచ్ఛ, వికాసాలు సమాజంతో పెనవేసుకుని ఉంటాయ’ని మార్క్స్‌ చెప్పినట్లుగా- వ్యక్తి యొక్క ఆర్థిక ప్రయోజనాలూ, ఆ వ్యక్తి ఒక వర్గానికి చెంది ఉండడమనే అంశాలు మానవుల లక్షణాలనూ, ప్రవర్తననూ నిర్దేశిస్తాయి. ఇప్పుడు దోపిడీకి గురవుతున్నది శారీరక శ్రమ మాత్రమే కాదు, మానసిక శ్రమ, తమ అస్తిత్వం కూడా. మన అస్తిత్వాన్ని మతం నిర్ణయించకూడదు. ఈ దేశం అందరిదీ. ఇదే మతం ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజల అస్తిత్వాన్ని, పౌరసత్వాన్ని నిర్ణయించేపనిలో పడింది. ‘బలవంతులు దుర్బల జాతిని/ బానిసలను కావించారు/ నరహంతలు ధరాధిపతులై/ చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి’ అన్నట్లుగా కర్రపెత్తనం చేస్తున్నారు. దేశం ఏదైనా, ప్రాంతం ఎక్కడైనా-శరణార్థులు… కాందిశీకులు… వలసదారులు- పేరేదైనా.. వారికి రక్షణ, కనీస అవసరాలు కల్పించడంతో పాటు మానసిక స్థైర్యాన్ని అందించటం ‘అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం’ సందర్భంగా తీసుకోవాల్సిన తక్షణ కర్తవ్యం. లేదంటే-మహాభారతంలో చెప్పినట్లుగా…’ప్రజల వాంఛను ఏ రాజైనా, ప్రభుత్వమైనా వ్యతిరేకిస్తే తిరుగుబాటును ఎదుర్కోవలసి వస్తుంది’ అని చెప్పక తప్పదు.

Related posts