April 05, 2020

Breaking News

రక్షణ నిధులపై పర్యవేక్షణ ఏదీ?

రక్షణ నిధులపై పర్యవేక్షణ ఏదీ?

భారత్‌ ఇప్పటికైనా మేల్కోవాలి. రక్షణ రంగానికి నిధులు పెంచడమేకాదు, అవి కొత్త కుంభకోణాలకు దారితీయకుండా జాగ్రత్తవహించాలి. రక్షణ పరిశోధన అభివృద్ధి రంగాన్ని పూర్తిగా ప్రక్షాళించి, ప్రోత్సహించి, పరిపుష్టం చేస్తేనే సైనికోత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధ్యం. ప్రైవేట్‌ రంగంలో రక్షణ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకంటూ 2001లో ఒక విధానం తీసుకొచ్చిన భారత్‌, ఈ 14 ఏళ్ళలో 50 లక్షల డాలర్లకు మించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షించలేకపోయింది. చైనా 1998 వరకు భారత్‌ తరహా విధానాలనే అనుసరించింది. ఆ కాలంలో అది విదేశీ ఆయుధాల మీద అధికంగా ఆధారపడవలసి వచ్చేది. అదెంత ప్రమాదకరమో అర్థమయ్యాక, విస్తృతస్థాయి రక్షణ పారిశ్రామిక వ్యవస్థ (డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ బేస్‌) ఏర్పాటు చేసుకొని దేశీయంగానే భారీఎత్తున ఆయుధాల తయారీ చేపట్టింది. ఆ దేశరక్షణ పరిశ్రమ కలిగిఉన్న పేటెంట్లు 1998లో 313. ఆ సంఖ్య 2010 నాటికి 15,000 దాటింది. సొంతంగా ఆయుధ వ్యవస్థల రూపకల్పనలో చైనా ఎంతవేగంతో దూసుకెళుతోందో దీన్నిబట్టి స్పష్టమవుతోంది. మన రక్షణ దళాల పటిష్టీకరణ, దేశంలోనే రక్షణోత్పత్తుల మీద ఇప్పుడిక శ్రద్ధ పెట్టాల్సిఉంది. రక్షణ దళాలకు కావలసిన ఆయుధాలు, సాధన సామాగ్రిని సాధ్యమైనంతవరకు సమకూరుస్తాం! ఇది ఃఫారెన్‌ అఫైర్స్‌ః 1963 ఏప్రిల్‌ సంచికలో రాసిన వ్యాసంలో ప్రథమ ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఇచ్చిన భరోసా. భారతదేశానికి ఇప్పుడు కావలసింది మానవ శక్తికాదు, ఆయుధాలు, ఇతర సైనిక సామాగ్రి అవసరం. తాత్కాలికంగా వాటిని ఇతర చోట్ల నుంచి సమకూర్చుకొన్నా, దీర్ఘకాలంలో సొంతంగా తయారు చేసుకోవాలి అని ఆయన ఆనాడే స్పష్టీకరించారు. ఐదు దశాబ్దాల తరువాత ఈ నాటికీ పరిస్థితిలో పెద్దగా మార్పురాలేదంటే రక్షణ రంగానికి మన ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం ఏపాటిదో సులభంగా అర్థం చేసుకోవచ్చు. 1924లో అమెరికా సైనిక పారిశ్రామిక కళాశాల ఏర్పాటు చేసింది. ఆయుధ సమీకరణ, ఉత్పత్తిని పెంపొందించడం ఎలాగన్న దానిపై అధ్యయనం జరిపి నిర్దిష్ట కార్యాచరణ రూపొందించడం దానికి అప్పగించిన లక్ష్యం. తరవాత ప్రైవేట్‌ రంగంలోని సమర్ధులకే ఆయుధ ఉత్పత్తి అప్పగించింది. వాటిమీద సమగ్ర పర్యవేక్షణ, నియంత్రణ కొనసాగించింది. 1945లో రెండో ప్రపంచయుద్ధం ముగిసే సమయానికి అమెరికా గొప్ప ఆయుధ తయారీదారుగా ఎదిగింది. ప్రపంచంలో సగం ఆయుధాలు సొంతంగా తయారుచేసే స్థాయికి చేరింది. ఇప్పుడు యావత్‌ ప్రపంచాన్నే శాసించగలుగుతోంది. ప్రథమ (1917) ప్రపంచ సంగ్రామంలో అమెరికా కాస్త ఆలస్యంగా చేరింది. అప్పటికి అమెరికన్ల వద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో ఆయుధాలు లేవు. బ్రిటిష్‌వారి యూనిఫారాలు, ఫ్రాన్స్‌ అందజేసిన ఫిరంగులతోనే వారు రంగంలోకి దూకారు. అక్కడి ఆయుధ కర్మాగారాలు కొంతవరకు ఆయుధాలు తయారుచేసినప్పటికీ, అట్లాంటిక్‌ మహాసముద్రం మీదుగా వాటిని తరలించడానికి అవసరమైన నౌకలను అమెరికా నౌకా నిర్మాణ కేంద్రాలు సిద్ధపరచలేకపోయాయి. ఆ వైఫల్యం నుంచి అనతికాలంలోనే పాఠాలు నేర్చుకొన్న అమెరికా, వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. చైనా కొన్నేళ్ళ క్రితం దాకా ఆయుధాల దిగుమతి మీదే ప్రధానంగా ఆధారపడిన ఆ దేశం, ఇప్పుడు యునైటెడ్‌ కింగ్డమ్‌ (యుకె)ను వెనక్కు నెట్టి ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆయుధ సరఫరా దారు స్థాయికి ఎదిగింది. చైనాకన్నా ముందే స్వాతంత్య్రం పొందిన భారత్‌, రక్షణ రంగంలో మాత్రం నేటికీ సంకెళ్ళు తెంచుకోనేలేదు. ఇండియాకు ప్రధాన ఆయుధ ఎగుమతిదారుగా దశాబ్దాల ఆధిపత్యాన్ని రష్యా నిలబెట్టుకుంది. 2009 -13 మధ్యకాలంలో దేశం రష్యానుంచి 75 శాతం, అమెరికా నుంచి ఏడు శాతం వరకు ఆయుధాలు దిగుమతి చేసుకొంది. విదేశాలు ఆయుధాలు అందజేస్తే తప్ప దేశాన్ని రక్షించుకోలేని ఈ దురవస్థ ఎన్నాళ్ళు రక్షణమంత్రి ఏ.కే.ఆంటోనీ గత నెలలో ఢిల్లీలో రక్షణోత్పత్తుల ప్రదర్శన (డిఫెన్స్‌ పో -2014) ప్రారంభిస్తూ, దేశ భద్రతకేమీ ఢోకాలేదని అభయమిచ్చారు. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాలకు ఎలాంటి సవాలు ఎదురైనా సమర్థంగా తిప్పికొడతామన్నారు. అత్యుత్తమ స్థాయి ఆయుధ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానాలు సమకూర్చి రక్షణ దళాలను ఆధునికంగా తీర్చిదిద్దుతామన్న ఆయన, దేశీయ రక్షణ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తామనీ నొక్కిచెప్పారు. వాస్తవం అందుకు విరుద్దంగా ఉంది. స్టాక్‌హోమ్‌లోని అంతర్జాతీయ శాంతిపరిశోధన సంస్థ (సిప్రీ) తాజా గణాంక వివరాల ప్రకారం పదేళ్ళకాలంలో భారత్‌ ఆయుధ దిగుమతులు 111 శాతం పెరిగాయి. అంతర్జాతీయ ఆయుధ దిగుమతుల్లో తన వాటాను ఏడుశాతం నుంచి 14 శాతానికి పెంచుకొని భారత్‌ వరసగా మూడో ఏడాదీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకొంది. దేశంలో తొమ్మిది ప్రభుత్వరంగ రక్షణ సంస్థలు, 41 ఆర్డినెన్స్‌ కర్మాగారాలు, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ) లాబొరేటరీలు ఉన్నాయి. వాటిలో మొత్తం 15 లక్షల దాకా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్క డిఆర్‌డిఓ లోనే 7,000 మంది శాస్త్రవేత్తలు సహా మొత్తం 30,000 మంది ఉద్యోగులు ఉన్నారు, అయినప్పటికీ అది నేటిదాకా ఒక్కటంటే ఒక్క అత్యాధునిక ఆయుధ వ్యవస్థనూ తెరమీదకు తేలేకపోయింది. జవాబుదారీతనం నిర్దిష్ట కార్యాచరణ, శాస్త్రీయ దృక్పథం కొరవడిన పర్యవసానమే ఈ దుస్థితి. రక్షణ నిధుల్లో అమెరికా 70 శాతం, చైనా 20 శాతం దాకా పరిశోధన అభివృద్ధి కోసమే వ్యయం చేస్తుంటే భారత్‌లో అది నాలుగైదు శాతాన్ని మించడంలేదు. ఫలితంగానే భారత రక్షణ పరిశోధన సంస్థలు దారుణ దురవస్థను ఎదుర్కొంటున్నాయి. దిగుమతులనే నమ్ముకొని, దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా వ్యూహాత్మక ప్రణాళికలను రూపొందించుకొని ఫలితంగా భారత సాయుధ దళాలు నేటికీ ఆధునికీకరణకు దూరంగానే ఉండిపోయాయి. యుద్ధ విమానాలు, అంతర్గాములు, హెలికాఫ్టర్లు, హోవిట్జర్‌ శతఘ్నులు, రాత్రిపూట పోరాటానికి ఉపయోగపడే సాధనాలు తగినన్ని లేక, భారత రక్షణ దళాలు ఇప్పటికే సతమతమవుతున్నాయి. వీటి సరఫరాలో విదేశాల అసాధారణ జాప్యం దేశ రక్షణ రంగాన్నే నీరుగారుస్తోంది. ట్యాంకు, వైమానిక రక్షణ వ్యవస్థలు ఫిరంగిదళాలు కాల్బలాలూ కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయని, ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయి యుద్ధం అనివార్యమైతే, భారత్‌ వద్ద ఉన్న మందుగుండు సామగ్రి 20 రోజులకు సైతం సరిపోదన్న వార్తలు మరింత ఆందోళన కలిగించేవే. సైన్యం వద్ద కనీసం 40 రోజులకు సరిపడా మందుగుండు సామాగ్రి నిల్వఉండాలి. ప్రస్తుతం అందులో సగమన్నా లేదు. అమెరికా ఏటా 50,000 కోట్ల డాలర్లు (రూ.30 లక్షల కోట్లు), చైనా 13,200 కోట్లు డాలర్ల (రూ.7.92 లక్షల కోట్లు)కు పైగా రక్షణ కోసం వ్యయం చేస్తున్నాయి. భారత రక్షణ బడ్జెట్‌ చైనాలో మూడోవంతైనా లేదు. 1987లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లో 3.16 శాతంగా ఉన్న దేశరక్షణ బడ్జెట్‌, ప్రస్తుతం 1.74 శాతానికి దిగజారింది. రక్షణపై ప్రభుత్వ వ్యయం 1999లో 15.79 శాతం నుంచి నిరుడు 12.23 శాతానికి తగ్గింది. రక్షణకు కేటాయిస్తున్న అరకొర నిధులైనా సక్రమంగా వ్యయమవుతున్నాయా అంటే, అదీ లేదు. పరిశోధన అభివృద్ధికి ఊతమిచ్చి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన అవసరాన్నే ప్రభుత్వం విస్మరించింది. భారత సైనిక దళాలది ప్రపంచంలో మూడోస్థానం. రక్షణ రంగం మీద అత్యధికంగా వ్యయం చేస్తున్న ఎనిమిదో దేశం ఇండియా. కానీ గడిచిన పదేళ్ళుగా దేశంలో రక్షణ వ్యయం క్రమేపీ తగ్గుతోంది. చైనా, రష్యా, సౌదీ అరేబియా వంటి దేశాలు ముందుకు దూసుకెళుతుంటే, భారత్‌ వెనకబడిపోయింది. మరికొన్ని కీలక పరికరాలు బ్రిటన్‌, కెనడా నిర్మించి ఇచ్చా యి. మొత్తంమీద ఃతేజస్‌ఃలో ఉపయోగించిన దేశీయ సామాగ్రి 60 శాతమే. ఃఅర్జున్‌ః ట్యాంకులదీ అదే తరహా. దాని నిర్మాణానికి వాడిన పరికరాల్లో 55 శాతం దిగుమతి చేసుకున్నవే. రష్యానుంచి 1200 కోట్ల డాలర్లతో 272 సుఖోయ్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు భారత్‌ ఒప్పందం కుదుర్చుకొంది. అందులో దాదాపు 200 సుఖోయ్‌లను ఇప్పటికే సైన్యంలో చేర్చుకొన్నారు. ప్రపంచాధిపత్యం కోసం వెంపర్లాడుతున్న చైనా, ప్రాంతీయంగా తనకు పోటీ వస్తుందనుకొంటున్న భారత్‌ను అన్నివైపులనుంచీ కట్టడి చేయడానికి తీవ్రం గా ప్రయత్నిస్తోంది. మరోవైపు పాకిస్తాన్‌ పక్కలో బల్లెంలా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సైనిక దళాలను ఆధునిక ఆయుధ వ్యవస్థలతో పరిపుష్టం చేసేందు కు నడుంకట్టాల్సిన ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా వ్యవహరించింది.

Related posts