February 26, 2020

మ‌స‌క‌బారుతున్న మోడీ ఆక‌ర్ష‌ణ‌

మ‌స‌క‌బారుతున్న మోడీ ఆక‌ర్ష‌ణ‌

మోదీ ఆకర్షణ ఆరు నెలల్లోనే మసకబారింది. బీజేపీపై జార్ఖండ్‌ ప్రజల ఆగ్రహం ఏ స్థాయికి వెళ్లిందంటే రాష్ట్రమిచ్చిన బీజేపీని తోసిరాజని రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన కాంగ్రెస్‌, ఆర్జేడీలను ఆదరించారు.

సరిగ్గా ఏడాది కిందట రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టా ల్లో ఇటీవల మహారాష్ట్ర, ఇప్పుడు జార్ఖండ్‌లో వరుసగా అధికారాన్ని బీజేపీకి దూరం చేస్తున్న ప్రజల విలక్షణమైన తీర్పులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కేం ద్రంలో రెండోసారి స్పష్టమైన ఆధిక్యంతో అధికారానికి వచ్చిన మోదీ పరివారానికి 370 రద్దు, జాతీయ పౌరపట్టిక, పౌరసత్వ చట్ట సవరణ, అయో ధ్య తీర్పు అచ్చిరాలేదేమో. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ అది గుంజుకున్నదే తప్ప గెలుచుకున్నది కాదన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా వ్యక్తమైంది. హర్యానాలో కూడా అధికారంలోకి రావడానికి ఒక చిన్న ప్రాంతీయపార్టీని బీజేపీ అతిరథ మహారథులు ఆశ్రయించిన ఉదంతాన్ని దేశ ప్రజలింకా మరిచిపోలేదు. చిన్నచిన్న ఈశాన్య రాష్ర్టాలు, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌ తప్పా మిగతా రాష్ర్టాలలో కమలం వాడిపోయింది. పశ్చిమబెంగాల్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణ, కేరళ రాష్ర్టాలలో ఉనికి చాటుకోవడానికే ఆపసోపాలు పడుతున్నది.

బీజేపీ చిరకాల మిత్రులు ఒక్కరొక్కరే ఆ పార్టీకి దూరమవుతున్నారు. మైత్రి నెరుపుతున్న బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ సైతం ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, బీజూ జనతాదళ్‌, అసోం గణపరిషత్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ వం టి బలమైన ప్రాంతీయపార్టీలు ఒకప్పుడు బీజేపీతో కలిసి నడిచినవే. ఇక అంతుబట్టని ప్రజల తీర్పులు బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేసి కుదురుకోనీయ డం లేదు. గోరుచుట్టుపై రోకటి పోటులాగా మిత్రభేదాలు బీజేపీని పాలుపోనీయడం లేదు. ఇవాళ జార్ఖండ్‌లో దుస్థితికి ఒకప్పటి మిత్రులైన జార్ఖం డ్‌ ముక్తిమోర్చా, ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌, జార్ఖండ్‌ విముక్తి మోర్చాలే కారణం. ఇంతటితో అయిపోతుందని అనుకోలేం. కర్ణాటకలో లాగా రకరకాల ఎత్తులతో అధికారంలోకి రావ చ్చు. అరుణాచల్‌ప్రదేశ్‌లో లాగా పార్టీలకు పార్టీలనే విలీనం చేసుకొని ‘వాతాపి జీర్ణం’ అనవచ్చు. మెజారిటీ లేకపోయినా అతిపెద్ద పార్టీ మాదేనని దబాయించి అధికారంలోకి రావడానికి గవర్నర్‌ను ఆశ్రయించవచ్చు. విలువల కోసం నిలబడటానికి ఇది ఒకప్పటి బీజేపీ కాదు.

జార్ఖండ్‌ విషయానికొస్తే అపారమైన సహజవనరులున్నప్పటికీ అది అత్యంత వెనుకబడిన రాష్ట్రం. బీహార్‌ నుంచి 19 ఏండ్ల కిందట విడివడి కొత్తగా ఏర్పడిన జార్ఖండ్‌లో మూడుసార్లు రాష్ట్రపతి పాలన, పదిసార్లు ముఖ్యమంత్రుల మార్పు, వెరసి విపరీతమైన రాజకీయ అస్థిరత కొనసా గింది. ఒక రఘువర్‌దాస్‌ (2014-19) తప్ప, అర్జున్‌ముండా (బీజేపీ) శిబూసోరెన్‌ (జేఎంఎం) మూడేసి మార్లు బాబులాల్‌ మరాండి (బీజేపీ), హేమంత్‌సోరెన్‌ (జేఎంఎం), మధుకోడా (స్వతంత్ర) పూర్తికాలం ముఖ్యమంత్రులుగా కొనసాగలేదు. జార్ఖండ్‌లోని మొత్తం 81 సీట్లలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 37, మిత్రపక్షమైన ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ 5 స్థానాల్లో విజయం సాధించాయి. రఘువర్‌దాస్‌ పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజా విశ్వాసాన్ని పొం దలేకపోయారు.

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్పష్టమైన ఆధిక్యత సాధిస్తామని బీజేపీ నేతలు లెక్కలు వేసుకున్నారు. ‘అబ్‌ కీ బార్‌-పైంసట్‌ పార్‌’ (ఈసారి 65) నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 14 స్థానాల్లో 11 స్థానాలను బీజేపీ గెలుచుకోగా మరోస్థానాన్ని మిత్రపక్షమైన ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్‌ యూనియన్‌ గెలుచుకుంది. బీజేపీ సొంతంగా 52 శాతం ఓట్లు సాధించింది. ఈ లెక్కన గెలుపు ధీమా తో మిత్రపక్షాన్ని పక్కనపెట్టి ఒంటరిగా బరిలోకి దిగి బొక్కబోర్లా పడింది. మరోవైపు విపక్షాలైన జార్ఖండ్‌ ముక్తి మోర్చా, కాంగ్రెస్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ ఐక్యంగా పోటీచేసి సఫలీకృతమయ్యాయి. గిరిజన నేత, రాష్ర్టాన్ని సాధించిన పార్టీకి అధినేత అయిన హేమంత్‌ సోరెన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుగానే ప్రకటించడం ఈ సంకీర్ణానికి కలిసి వచ్చింది.

మరోవైపు బీజేపీ, ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ను దూరం చేసుకోవడం వల్ల 11 శాతం ఉన్న కుర్మీలకు దూరమైంది. ఎన్నికలను శాసించగలిగే స్థాయిలో ఉన్న 30 శాతం ఎస్టీ లు బీజేపీకి దూరమైన జేఎంఎం, జేవీఎంల వైపు మోహరించారు. గిరిజనుల అటవీ హక్కులకు తూట్లుపొడిచే చట్టం వల్ల ఆయావర్గాలలో ఆందోళన అనుమానం పెరిగింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఒక ఓబీసీ నేతను రఘువర్‌దాస్‌ను ముఖ్యమంత్రిని చేసినప్పటికీ బీజేపీకి ఫలితం దక్కలేదు. మైనారిటీలు యథావిధిగా దూరంగానే ఉన్నారు. రైతులకు, గిరిజనులకు వివిధ ఉపశమన పథకాలు ప్రకటించినప్పటికీ అప్పటికే జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. మోదీ ఆకర్షణ ఆరు నెలల్లోనే మసకబారింది. బీజేపీపై జార్ఖండ్‌ ప్రజల ఆగ్రహం ఏ స్థాయికి వెళ్లిందంటే రాష్ట్రమిచ్చిన బీజేపీని తోసిరాజని రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన కాంగ్రెస్‌, ఆర్జేడీలను ఆదరించారు.

Related posts