February 26, 2020

మోషా ఆశీర్వాదాలతోనే రాజధాని విశాఖకు

మోషా ఆశీర్వాదాలతోనే రాజధాని విశాఖకు

ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాల ఆశీర్వాదాలతోనే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి  రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారని ప్రముఖ ఇంగ్లీషు పత్రిక ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఫ్రంట్‌ పేజీలో వార్త ఇచ్చింది. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అమరావతి నుంచి రాజధానిని వేరే ప్రాంతానికి తరలించే విషయంపై పలుసార్లు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాకు చెప్పారని ఆ వార్తలో పేర్కొన్నారు.

దీనికి వారిద్దరి సానుకూలంగా ఉన్నారని, రాజధాని వికేంద్రీకరణకు వారు అనుకూలమని ఆ కథనంలో పేర్కొన్నారు. ప్రధాని మోడీ,హోంమంత్రి షాతో పాటు బిజెపి సీనియర్‌ నేతలు రామ్‌మాధవ్‌, జి.వి.ఎల్‌. నర్సింహ్మారావులకు ఈ విషయం తెలుసనని కూడా వారు ఆ వార్తలో చెప్పారు. అసెంబ్లీలో జగన్‌ మూడు రాజధానుల విషయం ప్రస్తావించినప్పుడు బిజెపి రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్‌.నర్సింహ్మారావు స్పందిస్తూ రాజధాని విషయం కేంద్ర పరిథిలోకి రాదని, అది రాష్ట్ర అంశమన్న విషయాన్నిఆ పత్రిక గుర్తు చేసింది.

మొదటి నుంచి బిజెపి రాజధాని విషయంలో దాగుడుమూతలు ఆడుతూనే ఉంది. ముందు రాజధాని తరలింపును తాము స్వాగతిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుకన్నా లక్ష్మీనారాయణ ప్రకటించి తరువాత మళ్లీ తాము రాజధాని తరలింపుకు వ్యతిరేకమని పేర్కొన్నారు.

తాజాగా జనసేన అధ్యక్షుడుపవన్‌కళ్యాణ్‌ ఢిల్లీలోని బిజెపి పెద్దలను కలిసిన తరువాత రాజధాని విషయంలో వారు జోక్యం చేసుకుంటారని చెప్పినా ఢిల్లీ నుంచి వచ్చిన తరువాతరాజధానివిషయంలో మౌనం దాల్చడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బిజెపి, వైకాపా పార్టీలు స్పష్టమైన అవగాహనతో, ఒప్పందాలతోనే రాజధానిని తరలిస్తున్నారనే మాట సర్వత్రా వ్యక్తం అవుతోంది.

 

Related posts