February 26, 2020

ముస్లిం ప్రజల్లో భయాందోళనలు?

ముస్లిం ప్రజల్లో భయాందోళనలు?

భారతీయ జనతా పార్టీ అధికారం లోకి వచ్చినప్పటి నుండి ముస్లింలను లక్ష్యంగా పెట్టుకొని వారిపై విద్వేషాన్ని చిమ్మడమే పనిగా పెట్టుకున్నది. మతపరమైన విభజన ద్వారా ముస్లిం ప్రజానీకంపై పెరిగే విద్వేషాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది బిజెపి పన్నాగం. తద్వారా హిందూ ఓట్లను సమీకరించుకొని అధికారాన్ని పదిలం చేసుకోవాలన్నది బిజెపి కుటిల రాజకీయం. అందులో భాగంగానే దేశంలో మత విద్వేషాలు, మతోన్మాద శక్తుల స్వైర విహారం సాగుతున్నది. మైనారిటీలు భయాందోళనలతో జీవించాల్సి వచ్చింది.
2014 తరువాత ‘లవ్‌ జిహాద్‌, ఘర్‌ వాపసీ’ లాంటి నినాదాలతో అనునిత్యం ముస్లిం ప్రజలకు వ్యతిరేకంగా సంఘ పరివార్‌ శక్తులు ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించాయి. ఆ తరువాత గోరక్షణ పేరుతో సంఘ పరివార్‌కు చెందిన ప్రయివేటు సైన్యం మైనారిటీ వర్గాలపై, దళితులపై మూక హత్యలతో దాడులను సాగించాయి. నోయిడాకు సమీపం లోని దాడి గ్రామంలో బక్రీద్‌ పండుగ సందర్భంగా మహ్మద్‌ అఖ్లాక్‌ సామూహిక హత్యతో ప్రారంభమై జార్ఖండ్‌ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అన్సారీ హత్య వరకు సుమారు 50 మందికి పైగా ముస్లిం యువకులు మూక హత్యలకు గురయ్యారు. అలాగే దళిత సామాజిక వర్గానికి చెందిన అనేక మంది రాజస్థాన్‌, గుజరాత్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ తదితర రాష్ట్రాలలో గోరక్షక దళాల చేతిలో హత్యలకు, దౌర్జన్యాలకు గురయ్యారు. గోరక్షణ పవిత్రమైన కర్తవ్యమని అందుకోసం ఎవరినైనా చంపడం హిందువుల పవిత్ర కర్తవ్యమని ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు బహిరంగంగా చేస్తున్న ప్రకటనలు ఈ హింసాకాండను మరింత పెంచుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఈ దాడులకు తెగబడేలా ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఫ్‌ు చాలక్‌ బహిరంగంగా ప్రకటించడం మనం చూశాం. భారతీయ ప్రజల్లో ఒక భాగంగా వున్న దళిత, మైనారిటీలపై వారిలో ఎంత క్రౌర్యం దాగి వుందో అర్థమవుతుంది.
2019లో బిజెపి రెండవ సారి అధికారం లోకి వచ్చిన తరువాత వారి దూకుడు బాగా పెరిగింది. ఈ దేశంలో ముస్లిం ప్రజలు మెజారిటీగా ఉన్న ఏకైక రాష్ట్రం జమ్మూ కాశ్మీర్‌ను రాష్ట్ర హోదా నుండి తొలగించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీసి అధికారాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకొని సైన్యం చేత తుపాకీ నీడన ప్రజల్ని పాలిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కాశ్మీర్‌ ప్రజలకు ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తున్న 370 అధికరణాన్ని రాజ్యాంగం నుండి తొలగించి ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను నిర్దాక్షిణ్యంగా అమలు జరుపుతున్న స్థితిని చూస్తున్నాం. ఎమర్జెన్సీ కాలం కంటే దారుణంగా పౌర హక్కుల్ని కాలరాసి చీకటి రాజ్యాన్ని అమలు జరుపుతున్న తీరు బిజెపికి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న చులకన భావాన్ని తెలుపుతుంది.
దేశంలో ముస్లిం ప్రజలపై ‘ట్రిపుల్‌ తలాక్‌’ వ్యతిరేక చట్టాన్ని రుద్దారు. వివాహం, విడాకులు, ఆస్థి పంపకాలు సివిల్‌ అంశాలుగా మన న్యాయ చట్టాలు భావిస్తున్నాయి. అయితే ఇతర ఏ మతానికి సంబంధించిన వివాహం, విడాకులు లాంటి విషయా లను పట్టించుకోకుండా….కేవలం ‘ముస్లిం పర్సనల్‌ లా’ లో మాత్రమే జోక్యం చేసుకొని, ట్రిపుల్‌ తలాక్‌ను నిషేధిస్తూ చట్టం చేశారు. ఎవరైతే ముమ్మారు తలాక్‌ చెప్పడం ద్వారా విడాకులు ఇస్తారో వారిని క్రిమినల్‌ నేరస్థుడిగా భావించి 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ పైచట్టాన్ని తెచ్చారు. చట్టం నిషేధం విధించడంతో…విడాకులు చెల్లకుండా పోతున్న ప్పుడు…ఆ విడాకులిచ్చా రనే నెపంతో 3 సంవత్సరాలు జైలుకు పంపడం ముస్లిం ప్రజల పట్ల బిజెపికి ఉన్న ద్వేషాన్ని మనం గమనించవచ్చు. ఈ చట్టం సుప్రీంకోర్టు ఆదేశాలతో చేశామని పైకి చెబుతున్నారు. అయితే సివిల్‌ చట్టాన్ని క్రమినల్‌ చట్టంగా మార్చడంలో సుప్రీంకోర్టుకు ఎలాంటి సంబంధం లేదు. ముస్లింలపై పగ సాధింపే ఇందులో వ్యక్తమవుతున్నది. అలాగే ‘రామజన్మ భూమి-బాబ్రీ మసీదు’ కేసు తీర్పుపై కూడా కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఉన్నదని అనుమానాలు ముస్లిం ప్రజల్లో బలంగా వున్నాయి.
ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం తెచ్చారు. బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ల నుండి వచ్చిన ముస్లిమేతరులందరికీ పౌరసత్వాన్ని మంజూరు చేసి… ముస్లింలను మాత్రమే దేశం నుండి వెళ్ళగొడతామని కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతాయుత స్థానాల్లో వున్నవారు ప్రచారం చేయడం ముస్లింలకు వ్యతిరేకంగా ఒక వాతావరణాన్ని సృష్టించడానికే అన్నది వాస్తవం. మానవత్వంతో స్పందించి పైన పేర్కొన్న దేశాల్లో మెజారిటీ మతస్థుల కారణంగా ఇబ్బందులు పడుతున్న హిందూ ప్రజానీకానికి రక్షణ కల్పించడం కోసం ఈ చట్టం చేశామని చెబుతున్నారు. అయితే ముస్లింలు తప్ప మిగతా మతాలకు చెందిన వారందరికీ పౌరసత్వాన్ని మంజూరు చేసి, ముస్లింలకు మాత్రమే చేయమని చెప్పడం భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడమే. భూటాన్‌, బర్మా, శ్రీలంక దేశాల్లోని మైనారిటీలకు కూడా ఈ హక్కును ఇవ్వాలని ప్రతిపక్షాలు చేసిన సూచనను ప్రభుత్వం నిరాకరిం చింది. భారతీయ ముస్లిం ప్రజలకు ఈ సి.ఎ.ఎ వల్ల ఎటువంటి ప్రమాదం వుండదని పదే పదే చెప్పడం కేవలం కంటి తుడుపు చర్యే. వాస్తవ అనుభవం అందుకు భిన్నంగా వున్నది.
అసోంలో జాతీయ పౌరుల రిజిష్టర్‌ (ఎన్‌.ఆర్‌.సి) తయారీలో జరిగిన అవకతవకల వల్ల సుమారు 19 లక్షల మంది ఈ దేశ పౌరులు కాదని నిర్ధారించారు. ఇందులో సుమారు 15 లక్షల మంది ముస్లిమేతరులు. వారందరికీ పౌరసత్వం ఇచ్చి మిగతావారికి మాత్రమే బయటికి పంపుతామనడం వివక్షత చూపడం కాదా? దీనికి జవాబు లేదు. ఈ 19 లక్షల మందిలో అత్యధికులు భారతీయులేనని అయితే వారి వద్ద తగిన ఆధారాలు లేని కారణంగా పౌరుల జాబితాలో చోటు పొందలేకపోయారని అనేక పత్రికలు రాశాయి. ఎన్‌.ఆర్‌.సి నిబంధనలను మనం గమనిస్తే పౌరుడిగా నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రజల పైనే నెట్టివేశారు. అధికారులు కోరిన ఆధారాలు చూపని వారందరూ విదేశీయులే అవుతారని ఆ నిబంధనలు చెబుతు న్నాయి. ఉదాహరణకు అసోంలో 1971 ముందు నివాసం ఉండేవారు తమ నివాస ఆధారాల్ని చూపాలి. దేశంలోనే పుట్టినట్లుగా సర్టిఫికెట్లు చూపాలి. రెవెన్యూ అధికారులిచ్చే జనన సర్టిఫికెట్‌ చెల్లదు. వైద్య, ఆరోగ్య శాఖ మాత్రమే ఈ సర్టిఫికెట్‌ ఇవ్వాలి. పుట్టిన తరువాత ఒక సంవత్సరం లోగా రిజిష్టర్‌ చేసి ఉండాలి. ఆ తరువాత చేసినవారిని కూడా భారతీయులుగా పరిగణించరు. ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు, ఓటర్‌ గుర్తింపు కార్డులు ఎన్‌ఆర్‌సి పరిగణలో రావు. భారతీయులలో ఇప్పటికీ సగం జనాభా నిరక్షరాస్యులు. వీరిలో అత్యధికులు భూమిగానీ, ఇల్లుగానీ లేని పేదలు. పనులు ఎక్కడ దొరికితే అక్కడికి వలసలు పోయి బతికేటటువంటి కష్టజీవులు, పేదలు అత్యధికం. వీరికి ఆధారాలు లేవనే పేరుతో విదేశీయులుగా ముద్ర వేయడం దేశభక్తి అవుతుందా? మన పౌరుల్లో ఒక వర్గాన్ని మతం పేరుతో వేరు చేసి వారిపై పగ సాధించడం హిట్లర్‌ వారసత్వాన్ని పుచ్చుకోవడం కాదా?
అసోం ఎన్‌.ఆర్‌.సిలో విదేశీయులుగా ముద్ర పడిన వారిలో భారతదేశ సైన్యంలో చేరి అనేక సంవత్సరాలు దేశానికి సేవ చేసి కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న వీర జవాన్లు సైతం ఉన్నారు. భారత రాష్ట్రపతిగా పనిచేసిన ఫకృద్ధీన్‌ అలీ అహ్మద్‌ కుటుంబీకులు కూడా భారతీయులు కాదని ఎన్‌.ఆర్‌.సి చెప్పడాన్ని బట్టి ఆ జాబితాను ఎంత అన్యాjంగా తయారు చేశారో అర్థం చేసుకోవచ్చు. అన్నదమ్ముల్లో ఒకరిని భారతీయ పౌరుడిగా నమోదు చేసి, అతని సొంత సోదరుడిని విదేశీయుడిగా డిటెన్షన్‌ క్యాంపులకు తరలించడాన్ని బట్టే ఇదెంత తప్పుల తడకగా వుందో అర్థం చేసుకోవచ్చు. అసోంలో లక్షలాది మంది డిటెన్షన్‌ క్యాంపులకు తరలించాల్సిన పరిస్థితికి కారణమైన ఈ తప్పుల తడక ఎన్‌ఆర్‌సిని ఇప్పుడు దేశానికంతా వర్తింప జేస్తామని అమిత్‌షా మాటి మాటికి బెదిరించడం చూస్తున్నాం. భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలని, ఈ దేశంలో హిందువులు మాత్రమే పౌరులుగా ఉండాలని, మిగతావారు రెండవ తరగతి పౌరులుగా ఏ హక్కులు లేని జీవనం గడపాలనే ఆర్‌.ఎస్‌.ఎస్‌ ఎజెండాను అమలు చేసే ప్రయత్నమే అమిత్‌షా మాటల్లో దాగి వున్నది. ఎన్‌.ఆర్‌.సి దేశమంతటా అమలు చేసి లక్షలాది మంది ముస్లింలను డిటెన్షన్‌ క్యాంపులకు తరలిస్తారనే భయాందోళనలు ముస్లిం ప్రజానీకంలో వ్యాపించి వున్నాయి. ఈ దేశంలో రాజ్యాంగం హామీ ఇచ్చిన కుల, మత, ప్రాంతాలతో నిమిత్తం లేని సమానత్వం ఆచరణలో కాలరాయ బడుతుంది. చట్టం ముందు అందరూ సమానులే అన్న రాజ్యాంగ సూత్రం ఆర్‌.ఎస్‌.ఎస్‌ భావజాలంతో ఉన్న మతోన్మాద శక్తుల పదఘట్టనలో నలిగిపోతున్నది. మైనారిటీ ప్రజలకు ఇవ్వబడిన సమానత్వం, భాష, సంస్కృతుల పరిరక్షణ ఆచరణలో అణచివేతకు గురవు తున్నాయి. నేడు మోడీ, అమిత్‌షా ద్వయం తమపై గుజరాత్‌ తరహాలో దాడులు చేయిస్తారనే భయం కూడా మైనారిటీల్లో పనిచేస్తున్నది. కర్నాటక బిజెపి మంత్రి ఈ విషయాన్ని దాచుకోకుండా బహిరంగంగానే చెప్పారు. గోద్రా తరహా వాతావరణం తయారై వుందని గుజరాత్‌ లాగా గుణపాఠం చెబుతామని దీన్ని ఇంతవరకూ బిజెపి నాయకత్వం ఖండించలేదు.
ముస్లిం మైనారిటీ ప్రజల్లో నేడు వ్యక్తమవుతున్న భయాందోళనలకు బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలే కారణం. దురదృష్టమేమంటే మన రాష్ట్రంలో వామపక్షాలు మినహా మిగతా లౌకిక పార్టీలు ఈ ప్రమాదాన్ని గుర్తించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మైనారిటీ ఓట్లతో అత్యధిక స్థానాల్లో నెగ్గిన వైఎస్సార్‌ పార్టీ బి.జె.పికి అంటకాగుతూ ఈ చట్టాన్ని బలపర్చింది. ఎన్నికల ముందు బి.జె.పిపై రంకెలు వేసిన టి.డి.పి నేడు వారి మద్దతుదారుగా వ్యవహరిస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో వామపక్షా లతో పాటు మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికతత్వాన్ని నమ్మేవారు చొరవతో ముందుకు రావాలి. అన్ని ప్రజా సంఘాలు కూడా బి.జె.పి మతోన్మాదానికి వ్యతిరేకంగా చురుకుగా ప్రజల్ని సమీకరించి దేశ సమైక్యతను కాపాడడానికి బి.జె.పి విసిరిన సవాల్‌ను అందుకోవడానికి సిద్ధం కావాలి. సమైక్య ఆందోళన ద్వారా ఈ సవాల్‌ను ఎదుర్కోలేక పోతే రాబోయే కాలంలో భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం యొక్క మౌలిక విలువలు మరింత సంక్షోభంలోకి వెళ్తాయి. ఏ విలువలతోనైతే జాతీయోద్యమం దేశానికి స్ఫూర్తినిచ్చిందో ఆ విలువల పరిరక్షణకు అందరూ సమైక్యంగా ఉద్యమించడం నేటి అవసరం.

– యం.ఏ గఫూర్‌

Related posts