April 02, 2020

Breaking News

భైంసా అల్లర్ల వెనుక మ‌జ్లిస్ కుట్ర‌?

భైంసా అల్లర్ల వెనుక మ‌జ్లిస్ కుట్ర‌?

మజ్లీస్ కుట్రలో భాగంగానే భైంసాలో అల్లర్లు జరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో చేసినట్లుగానే ఇక్కడా చేస్తున్నారని ధ్వజమెత్తారు. మజ్లీస్ అనే పాముకు పాలు పోస్తే ఆఖరికి అది పాలుపోసిన వారినే కాటేస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్.. ఒవైసీని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడని, కాంగ్రెస్‌కు పట్టిన గతే టీఆర్ఎస్ పార్టీకి పడుతుందని అన్నారు. స్థానిక మంత్రి ఒక వర్గానికే కొమ్ము కాశారని ఆరోపించారు. భైంసాలో అల్లర్లను అడ్డుకున్న అమాయక యువకులపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ఇంత జరిగినా కేసీఆర్ కనీసం పరామర్శకు రాకపోవడం దారుణం అన్నారు. తమను కూడా రాకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.

భైంసా అల్లర్లకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది, టీఆర్ఎస్ పార్టీదే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. భైంసా అల్లర్లలో పోలీసులు అమాయకులను అరెస్ట్ చేశారని ఆరోపించారు. భద్రత కల్పించాల్సిన పోలిసులే నిర్లక్ష్యంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఆదివారం నాడు ఆయన భైంసాలో అల్లర్లు జరిగిన కొర్భా ప్రాంతాన్ని పరిశిలించారు. అల్లర్లలో నష్టపోయిన బాధితులను పరామర్శించారు. 

భైంసా అల్లర్ల ఘటనలో ఎంఐఎం నేత జాబీర్ అహ్మద్ పాత్ర ఉందని, అల్లర్లపై జ్యూడిషియల్ విచారణ జరిపించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం న్యాయ విచారణకు ముందుకు రాకపోతే సీబీఐ విచారణకు సిద్ధంగా ఉండాలని లక్ష్మణ్ హెచ్చరించారు. భైంసా ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. ఇళ్లు తగులబడ్డ బాధితులను, నిందితులను పోలీసులు ఒకే విధంగా చూస్తున్నారని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవుచెప్పారు.

Related posts