April 05, 2020

Breaking News

భయం గుప్పిట్లో సరిహద్దు గ్రామాలు

భయం గుప్పిట్లో సరిహద్దు గ్రామాలు

1 కొనసాగుతున్న పాక్‌ కాల్పులు
ఇటు కాల్పులు… అటు ఐరాసకు ఫిర్యాదు
40 బీఎస్‌ఎఫ్‌ అవుట్‌ పోస్టులు ధ్వంసం 56 మందికి గాయాలు
భారత్‌లో చొరబడేందుకు సిద్ధంగా 2000 మంది ఉగ్రవాదులు
భారత్‌ మీద కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్‌, తగుదునమ్మా అని ఐక్యరాజ్య సమితి దరిచేరింది. నియంత్రణరేఖ వెంబడి హింసపై ఫిర్యాదు చేసింది. ఇస్లామాబాద్‌లోని యునైటెడ్‌ నేషన్స్‌ మిలిటరీ అబ్జర్వర్‌ గ్రూప్‌ ఇన్‌ ఇండియా అండ్‌ పాకిస్థాన్‌ (యూఎన్‌ఎంఓజీఐపీ)తో సరిహద్దుల్లో కాల్పులపై నిరసన వ్యక్తం చేసింది. 1949లో కరాచీ ఒప్పందానికి లోబడి ఏర్పాటైన ఈ గ్రూపును సిమ్లా ఒప్పందం తరువాత భారత్‌ గుర్తించడం లేదు.
అయితే.. తాజాగా పాక్‌ ఈ గ్రూపును మధ్యలోకి లాగడంతో వివాదం ముదిరే అవకాశం ఉంది. అందుకు తగినట్లుగానే, భారత్‌ తన సైనిక దళాలను నియంత్రించలేకపోతోందంటూ పాకిస్థాన్‌ ప్రధాని సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ మంగళవారం ఇస్లామాబాద్‌లో విమర్శించారు. తక్షణమే కాల్పులు నిలిపివేసి, శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిందిగా తాము భారత్‌కు విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే.. ఈ దీనివెనుక అసలు విషయం సరిహద్దుల్లో 2000 మంది తీవ్రవాదులు భారత్‌లో ప్రవేశించడానికి సిద్ధంగా ఉండటమేనని తెలుస్తోంది. వీరిని భారత్‌లో ప్రవేశపెట్టడం కోసమే, పాకిస్థాన్‌ కాల్పులకు తెగబడుతోందని సమాచారం. పాక్‌ కాల్పులను భారత్‌ దీటుగా తిప్పికొట్టడమే కాక ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశం ఇవ్వకపోవడంతో, పాక్‌ మరింత తెగబడుతోంది. ఎలా గైనా బీఎస్‌ఎఫ్‌ కళ్లు గప్పి ఉగ్రవాదులను ప్రవేశపెట్టాలని పాక్‌ జరుపుతున్న కాల్పులకు భయపడి కశ్మీర్‌ సరిహద్దుల్లో భారత్‌వైపు వేలాదిగా ప్రజలు వలస పోతున్నారు. మరోవైపు భారత్‌ కాల్పులవల్ల తమ పౌరులు మరణించారంటూ, పాకిస్థాన్‌ కపట నాటకమాడుతోంది. వాస్తవానికి భారత్‌వైపుసరిహద్దు గ్రామాల్లోని కశ్మీరీలే తట్టాబుట్టాసర్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. పగలూ, రాత్రి తేడాలేకుండా పాక్‌ రేంజర్లు 25 సరిహద్దు గ్రామాలపై గుండ్లవర్షం కురిపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఆరుగురు భారత పౌరులు మరణించగా, 56మంది గాయపడ్డారు. తాజాగా మంగళవారం సాయంత్రం 4:25 గంటల ప్రాంతంలో పాక్‌ మరోసారి చిన్నపాటి ఆయుధాలు, మోర్టార్లతో దాడులు చేసింది. దీంతో మరో 12 మంది గాయపడ్డారని రక్షణశాఖ అధికార ప్రతినిధి మనీష్‌ మెహతా చెప్పారు.
దీంతో ప్రజలు ప్రాణాలరచేత పట్టుకుని బస్సులు, ట్రాక్టర్‌ ట్రాలీలు, లారీలు, చివరకు ఎడ్లబండ్లపై మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోతున్నారు. ‘‘రెండు రోజులుగా పాక్‌ సైనికులు మా ఊరిపై అనేకసార్లు కాల్పులు జరిపినా నిస్సహాయ పరిస్థితిలో ఉండిపో యాం’’ అని రైతు గురుశరణ్‌ భార్య సవితాదేవి చెప్పింది. పాక్‌ కాల్పుల ధాటికి పట్టణా లూ బెదిరిపోతున్నాయి. ఆర్నియా పట్టణంలో పెద్ద సంఖ్యలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. షాపులు మూతపడి పట్టణం వెలవెలబోయింది. ఆదివారం రాత్రంతా అర్నియాపై ఫిరంగులతో గుండ్లవర్షం కురిపించిన పాక్‌ దళాలు పూంచ్‌ జిల్లాలోని 40 సరిహద్దు అవుట్‌పోస్ట్‌లపై దాడులుచేశాయి. మంగళవారం ఒక్కరోజే నాలుగుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. జమ్మూ సెక్టర్‌లోని 25 సరిహద్దు గ్రామాలు ఈ మోర్టార్‌ దాడులతో అతలాకుతలమయ్యాయి. పాక్‌ మోర్టార్‌ దాడుల్లో అంతర్జాతీయ సరిహద్దులోని 40 పోస్ట్‌లు ధ్వంసమై నట్లు బీఎస్‌ఎఫ్‌ అధికార ప్రతినిధి వినోద్‌ యాదవ్‌ ధ్రువీకరించారు. పాక్‌ తెగబడితే తగిన జవాబు చెబుతామని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ హెచ్చరించారు. కాగా, నియంత్రణ రేఖవద్ద ఉద్రిక్తతపై అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది. సమస్యలను చర్చలద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.

Related posts