February 23, 2020

ఫాసిజం దిశగా అమెరికా

ఫాసిజం దిశగా అమెరికా

               అమెరికాలో ఫాసిస్టు శక్తులు తలలు ఎగురవేస్తున్నాయి. అలాంటి శక్తుల పట్ల అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాడనే వాస్తవం ఇటీవల చోటుచేసుకున్న అనేక ఘటనల్లో వెల్లడైంది. ఆగస్టు 12వ తేదీన వర్జీనియాలోని చార్‌లోట్‌ విల్లేలో ఫాసిస్టులకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ఫాసిస్టులు దాడి చేశారు. ఒక వ్యక్తి వారి మీదికి ట్రక్కు నడపడంతో పౌరహక్కుల క్రియాశీల కార్యకర్త హీథర్‌ హేయర్‌ చనిపోయింది. ఆ సంఘటనలో కనీసం 19 మంది గాయపడ్డారు. ఆఫ్రో-అమెరికన్‌ ఉపాధ్యాయురాలు డి ఆండ్రే హేరిస్‌ను… చార్లోట్‌విల్లే పోలీసు ప్రధాన కేంద్రానికి అతి సమీపంలో ఇనుప రాడ్‌తో నిర్దాక్షిణ్యంగా కొట్టారు. ట్రంప్‌ వెంటనే శ్వేత జాతి దురహంకారుల చర్యను సూటిగా ఖండించకుండా తప్పించు కున్నాడు. అధ్యక్షుడి అరకొర ప్రతిస్పందనను ప్రజలు నిరసించిన రెండు రోజుల తరువాత ఆయన శ్వేతజాతి దురహంకారుల చర్యను ఖండించారు. అయితే ఆ తరువాత ‘ఇద్దరిదీ తప్పు ఉంది’ అన్నారు. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డ ఆరిజోనా పోలీసు అధికారికి శిక్ష పడకుండా ఆగస్టు 25న డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుని హోదాలో క్షమాబిక్ష ప్రసాదించారు. పైగా ఆయనను ‘అమెరికా దేశభక్తుడు’ అని కీర్తించారు. ఈ ‘దేశభక్తుడు’ లాటిన్‌ అమెరికన్లను బంధించి ఫీనిక్స్‌ లోని ఆరుబయట జైలులో అత్యంత అమానవీయ పరిస్థితుల మధ్య ఉంచుతున్నాడు. ఈ జాతి దురహంకారికి అధ్యక్షుడు క్షమాబిక్ష ప్రసాదించటమంటే…ఆయన శ్వేత జాతి దురహంకారులతోను, నియో నాజీలతోను కలిసి ప్రయాణిస్తున్నాడని అర్థం.
ఇలా జరగటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే అమెరికా స్పష్టంగా ఫాసిజం దిశగా ప్రయాణిస్తున్నది. ప్రపంచీకరణ వల్ల శ్వేత జాతి కార్మికులకు అనేక కష్టాలు వచ్చి పడ్డాయి. దీనికి తోడు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలోని సంక్షోభం వారి కష్టాలను మరింత తీవ్రతరం చేసింది. సగటు అమెరికా కార్మికుడు 2011లో తీసుకున్న వాస్తవ వేతనం 1968లో అతనికి అందిన వేతనం కంటే కూడా తక్కువగా ఉందని ఆర్థికవేత్త జోసెఫ్‌ స్టిగ్లిట్జ్‌ వివరించాడు. ప్రస్తుత శ్వేత జాతి కార్మికుడి జీవన ప్రమాణం సోవియట్‌ పతనం తరువాత రష్యాలో నెలకొన్న పరిస్థితిని పోలి ఉందని ఆర్థికవేత్త అన్‌గస్‌ డీటన్‌ విశ్లేషించాడు. శాంతి నెలకొన్న ఆధునిక కాలంలో ఇది ఒక రికార్డు. ఒకవైపు ఈ వాస్తవాలను హిల్లరీ క్లింటన్‌ వంటి లిబరల్‌ బూర్జువా రాజకీయ నాయకులు అంగీకరించటానికి సుముఖంగా లేకపోవటం, మరోవైపు తనకు ప్రగతిశీల భావాలుగల ప్రత్యర్థి (బెర్నీ శాండర్స్‌ పోటీ నుంచి విరమించుకున్నాడు) లేనందున తమ పరిస్థితిని ట్రంప్‌ కనీసం గమనించినందుకు కార్మికులు కూడా కొంతవరకు ఆయనకు అనుకూలంగా మారారు. వారి మద్దతుతోనే ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడయ్యాడు. అయితే వారి దయనీయ స్థితికి ఆయన చూపించిన కారణం నయా వుదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ కాదు. వలస వచ్చిన వారు, ముస్లింలు, నల్లజాతి వారు, విదేశీయులను కారణంగా చూపాడు. అమెరికా ద్రవ్య పెట్టుబడిదారీ వర్గం ఆయనను ‘తమ వాడు’ అనుకోవటంలో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు. నూతన అధ్యక్షుడు ‘అరాచకాన్ని’ నియంత్రిస్తాడనీ, ప్రజల మనిషిగా వుంటూ ద్రవ్య పెట్టుబడి ఎజెండాను ముందుకు తీసుకెళ్తాడనీ భావించింది. అందుకు ప్రతిగా ట్రంప్‌ కార్పొరేట్‌ కంపెనీల అధిపతులకు అనేక పదవులను పందేరం చేశాడు. కార్పొరేట్‌ పన్నును 35 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాడు. ఒక ఆర్థికవేత్తను తన ఆర్థిక సలహా మండలి అధ్యక్షుడిగా నియమించవలసి వుండగా ‘గోల్డ్‌మన్‌ సాక్స్‌’ కంపెనీ అధికారి గ్యారీ కోన్‌ను ఆ స్థానంలో నియమించాడు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమంటే శ్వేత జాతి దురహంకారులపై అధ్యక్షుడు తగిన చర్యలు తీసుకోకపోవడంతో… ట్రంప్‌ నియమించిన అనేకమంది అధికారులు ఆర్థిక సలహా మండలి నుంచి నిష్క్రమించారు. నిజానికి భారత పరిశీలకులు పలువురు ఈ రాజీనామాల పరంపర పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గోరక్షణ పేరుతో జరుగుతున్న అరాచకాలను మోడీ కట్టడి చేయకపోవడం పట్ల భారత దేశంలోని కార్పొరేట్లు మౌనం దాల్చటంతో పోల్చినప్పుడు… అమెరికాలో పరిస్థితి మెరుగ్గా ఉన్నదని వారు భావిస్తున్నారు.
అయితే ఈ పరిణామంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. అమెరికా శాసన సభలలో శ్వేత జాతి దురహంకారులకు గానీ, నియో నాజీ గ్రూపులకు గానీ ఎటువంటి పలుకుబడి లేదు. ఒకవేళ కార్పొరేట్‌ అనుకూల చట్టాలను చేయాలన్నా, కార్పొరేట్‌ పన్నులను తగ్గించాలనుకున్నా ట్రంప్‌ కాంగ్రెసు లోని ఉభయ సభలపైన ఆధారపడవలసి ఉంటుంది. మితవాద పార్టీయైన తన రిపబ్లికన్‌ పార్టీ సహా ఎవరూ శ్వేత జాతి దురహంకారులకు, నియో నాజీలకు మద్దతునివ్వటానికి సిద్ధంగా లేరు. కాబట్టి కార్పొరేట్‌ అనుకూల చట్టాలను తీసుకు రావాలంటే రెండు సభలలోని శాసన సభ్యులను ట్రంప్‌ మచ్చిక చేసుకోవాలి. అలా చేయాలంటే ఆయన తన మద్దతుదారులైన శ్వేత జాతి దురహంకారులకు, నియో నాజీ గ్రూపులకు ఎంతో కొంత దూరం జరగాలి. అంతకు ముందున్న అధ్యక్షుడు ప్రవేశ పెట్టిన ‘ఒబామా కేర్‌’ పథకాన్ని రద్దు చేయలని చూసినప్పుడు రిపబ్లికన్‌ నాయకుడు జాన్‌ మెకైన్‌ వ్యతిరేకించగా ఆ ప్రయత్నం విఫలమవటం ట్రంప్‌కు అనుభవమే. మెకైన్‌తో పాటు ఇతర రిపబ్లికన్‌ పార్టీ నాయకులు కూడా ఫాసిస్టుల పట్ల ట్రంప్‌ మెతక వైఖరిని ఆమోదించటం లేదు. రిపబ్లికన్‌ పార్టీ నాయకులకు అలాంటి దృక్పథం ఉండటం ట్రంప్‌ ఫాసిస్టు అనుకూల వైఖరిని తీసుకోవటానికి ప్రతిబంధకంగా ఉంది. ఈ వైఖరిని కనిపించకుండా చేయటంపైనే ట్రంప్‌ కార్పొరేట్‌ అనుకూల ఎజెండా ముందుకు సాగుతుంది.
ఇంకా చెప్పాలంటే… ట్రంప్‌ వైఖరిలో వైరుధ్యం ఉంది. ఆయనకు ఫాసిస్టు దృక్పథం ఉన్నప్పటికీ, ఫాసిస్టు శక్తులతో సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పటికీ ఆయన ఒక ఫాసిస్టు పార్టీ అభ్యర్థిగా ఎన్నిక కాలేదు. అనేక మంది ఫాసిస్టులు సభ్యులుగా వుండే అవకాశం వున్న మితవాద రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా ఆయన ఎన్నికయ్యాడు. కాబట్టి ఆయన కార్పొరేట్‌ అనుకూల ఎజెండా అమలు చేయాలంటే తన ఫాసిస్టు పునాదికి ఎంతో కొంత దూరం జరగాలి. అలా ట్రంప్‌ను ఫాసిస్టు శక్తుల నుంచి దూరంగా ఉంచటానికి ఆయన సలహా మండలి నుంచి అనేకమంది ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామాలు చేశారు.
ట్రంప్‌ను సమర్థించే కార్పొరేట్‌ శక్తులు ఆయన పట్ల ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయి. వారిలో కొందరు సలహా మండలి నుంచి రాజీనామా చేయగా, మరికొందరు దానిలో కొనసాగుతున్నారు. అలా కొనసాగుతున్నవారికి రాజీనామా చేసిన వారు తమ మద్దతిస్తున్నారు. ఆవిధంగా తాను కూడా రాజీనామా చేస్తానని ప్రకటించిన గ్యారీ కోన్‌ ‘దేశ సేవ’ చేయటానికి కొనసాగాలని అనుకున్నాడు. ట్రంప్‌ ఫాసిస్టు శక్తుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నాడని రాజీనామాలు చేసినవారిలో చాలా మంది తనను రాజీనామా చేయకుండా ఆపారని ఆయన చెప్పాడు. మరోలా చెప్పాలంటే ట్రంప్‌ కార్పొరేట్‌ ఎజెండాను అమలు చేసేందుకు వత్తిడి చేయటానికి కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామాలు చేయగా, మరికొంత మంది రాజీనామాలు చేయకుండా కార్పొరేట్‌ అనుకూల ఎజెండా అమలును సుసాధ్యం చేయటానికి తమ పదవులలో కొనసాగుతున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ట్రంప్‌కు, బడా కార్పొరేట్లకు మధ్య సంక్లిష్టమైన చర్చలు జరగటాన్ని మనం చూస్తున్నాం. ప్రముఖ పోలిష్‌ మార్క్సిస్టు ఆర్థికవేత్త మైఖేల్‌ కాలెస్కీ ఫాసిజం గురించి ఇలా చెప్పాడు. ‘చెడి బతికిన ఫాసిస్టులు, బడా బూర్జువాల ప్రత్యక్ష నియంత్రణలో రాజ్య యంత్రాంగం ఉండటం ఫాసిజం లక్షణం’. అయితే ఫాసిస్టు రాజ్యం ఆవిర్భవించిన తరువాత పరిస్థితి గురించి కాలెస్కీ చెప్పాడు. కానీ ఫాసిజం దిశగా పయనిస్తున్న అమెరికా లాంటి దేశాలలో ఫాసిస్టు రాజ్యం ఆవిర్భవించడానికి చాలా కాలం పడుతుంది. చెడి బతికిన ఫాసిస్టులు, బడా బూర్జువాల భాగస్వామ్యం ఇంకా రూపొందే దశ లోనే ఉంది. ఈ భాగస్వామ్యం రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం కను చూపు మేరలో ఇంకా కనిపించటం లేదు. క్లుప్తంగా చెప్పాలంటే ఇంకా ఆవిర్భవించని ఫాసిస్టు బూర్జువా రాజ్యం చట్రంలో ఈ భాగస్వామ్యం రూపొందుతున్నది. దానితో ఈ భాగస్వామ్యం రూపుదిద్దుకొనేందుకు జరుగుతున్న చర్చలు మరింత సంక్లిష్టంగా ఉన్నాయి. ట్రంప్‌ పాలనలో వివిధ పదవులలో వున్న కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌ల ప్రతిస్పందనలలోని వైవిధ్యం ఈ చర్చల సంక్లిష్ట స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నది. అమెరికా ఫాసిజం దిశ వైపు మరలిందనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ముందుగా ఒక ఫాసిస్టేతర బూర్జువా రాజ్య చట్రంలో చెడి బతికిన ఫాసిస్టులు, బడా బూర్జువాల భాగస్వామ్యం రూపుదిద్దుకునే ప్రక్రియ లోని సంక్లిష్టత, ఫాసిజం దిశగా అమెరికా మరలటంతో ముడిబడిన వైరుధ్యాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి.

Related posts