February 26, 2020

ప్రేమికులారా జాగ్రత్త

ప్రేమికులారా జాగ్రత్త
ప్రపంచమంతా గులాబీల గుభాలింపులు, ప్రేమతో అచ్చయిన సందేశాల సందడిలో విచ్చుకున్న హృదయాలతో ప్రేమా ప్రేమా అని కలవరించే రోజు ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే . కానీ భారతదేశంలో మాత్రం పరిస్థితి వేరేలా వుంది . మన యువతకి నవ నాగరికత ముసుగు తొడిగి , దేశ సంస్కృతీ సాంప్రదాయాలకు హాని చేసేలా ఈ రోజు వుందని కొన్ని హిందూ పరిరక్షన సంస్థల అభిప్రాయం. తమ ప్రేమని భాహాటంగా అందరికీ తెలిసేలా తిరగాల్సిన పని లేదనీ , ఇది సామాజిక హితం కాదని కొంతమంది వాదిస్తుంటే కొన్ని సంస్థలు ఒకడుగు ముందుకేసి ఫిబ్రవరి 14 కి కొత్త అర్థాలని చెప్తున్నారు
బ్లాక్ డే
స్వాతంత్ర పోరాట సమయంలో డిల్లీలోని అసెంబ్లీ హాలులోకి బాంబులు విసిరి ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించిన స్వాతంత్ర సమర యోదుడు భగత్ సింగ్ తో పాటు అతని సహచరులయిన రాజ్ గురు, సుఖ్ దేవ్ లకి 1931 ఫిబ్రవరి 14 న ఉరి శిక్ష విదించారని, అందుకే ఈ రోజుని బ్లాక్ డే గా పాటించాలని శివసేన ప్రకటించింది.  అశ్లీల్తా నహి షలీంతా (నాగరిక ప్రవర్తన అంటే అసభ్యత కాదు)  అనేది ఆ రోజు ముఖ్య లక్షణంగా వుండాలని కూడా పేర్కుంది.
అయితే చరిత్ర పేజీలు ఒకసారి తిరగేసి వాస్తవాల్లోకి వెల్తే ఫిబ్రవరి 14 న ఉరి శిక్ష విదించారనేది అవాస్తవం. శిక్ష అమలు చేసిన సూపర్నెంట్ దగ్గర వున్న రికార్డ్స్ లో  1931 మార్చ్ 23 న ఉరి శిక్ష అమలు చేసినట్లు స్పష్టంగా వుంది. కానీ శివ సేన ఇవేమి పరిగనలోకి తీసుకోలేదు. ఫిబ్రవరి 14 న దేశమంతా అమరవీరులను స్మరించుకొని నివాళులు అర్పించాల్సిందేననీ ప్రచారం చేస్తుంది. ఆమేరకు 2016 లో కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించింది.
 “భగత్ సింగ్ కి తన సహచరులకి ఫిబ్రవరి 14 న ఉరి శిక్ష విదించారనే సందేశం  సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా  ప్రచారంలో వుంది “
 లాఠీ పూజ
వాలెంటైన్స్ డే ముందు రోజు శివ సేన కార్య కర్తలు లాఠీ పూజ నిర్వహించి, ఆరొజు నగరంలోని పార్కులు, సినిమాహాలు, మల్టీప్లెక్స్ వద్ద మొహరించి, ప్రేమికులపై దాడి చేస్తున్నారు. పాశ్చాత్య సంస్కృతి సంప్రదాయాల ప్రబావంతో ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు జరుపుకునే యువతకి కర్రలతో గుణపాటం చెప్తామనీ, స్వయంగా ఆ పార్టీ నాయకుడు లోకెష్ షైనీ హెచ్చరించడం గమనార్హం. ఇలాంటి పరిస్థితులలో గులాబీలు , గ్రీటింగులు, పట్టుకొని ప్రేమికులు వీధుల్లోకి రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి.
మాతృ పితృ పూజా దినోత్సవం
 పాశ్చాత్య సాంప్రదాయ విదానాలకి మన యువతని దూరంగా జరపాలనే ఉద్దేశంతో 2007 ఫిబ్రవరి 14 న ఆశారాం బాపు  అహ్మదాబాద్ లోని గురుకుల పాటశాలలో మాతృ పితృ పూజా దినోత్సవ కార్యక్రమాలని నిర్వహించి, ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 2012 డిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత ఆశారాం బాపు అప్పటి ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి అకిలేష్ యాదవ్ కి ఈదే సలహా ఇచ్చాడు. అయితే ఆనాటి చత్తీష్ గడ్ ముఖ్యమంత్రి రమన సింగ్ , ఆయన సలహానే తీసుకొని ఫిబ్రవరి14 న మాతృ పితృ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ఆ తర్వాత భువనేశ్వర్ లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాబై వేలకి పైగా పాటశాలలు, కాలేజీలల్లో ఫిబ్రవవరి 14 ని మాతృ పితృ పూజా దినోత్సవంగా వేడుకలు  జరుపుకుంటున్నారు.
అన్నీ కలిసొస్తే పెళ్లి రోజు కూడా అవుతుంది
పెళ్లికి ముందు సహజీవనాన్నీ తీవ్రంగా వ్యతిరేకించే భజరంగ్ దళ్, ఫిబ్రవరి 14 న ఏకాంతంగా కనిపించే జంటలకు పెళ్లిల్లు చేస్తానంటుంది. దాంతో వీరి దెబ్బకు యువతీ యువకులు బయటకు రావాలంటేనే బయపడుతున్నారు.
నిజమైన ప్రేమికులకు పెళ్లంటే అభ్యంతరమెందుకుంటుంది , ప్రేమ ముసుగులో మన సంస్కృతిని ద్వంసం చేసే వాల్లకే పెళ్లంటే భయం వుంటుందనేది భజరంగ్ దళ్ చేస్తున్న వాదన. దీనికి సంభందించి గతంలో ఆ సంస్థ చేపట్టిన చాలా కార్యక్రమాలు వివాదస్పదమయ్యాయి.
 అయితే పెద్దల ఆమోదం లేని ప్రేమికులు, పెళ్లి ఖర్చు లెక్కలేసుకునే బడ్జట్ ప్రేమికులు వాలెంటైన్స్ డే రోజు నిరభ్యంతరంగా నగర సంచారం చేయొచ్చు. కాగల కార్యం గందర్వులే వచ్చి తీర్చినట్లు, రూపాయి ఖర్చు లేకుండా భజరంగ్ దళ్ మీ పెళ్లి చేసేస్తుంది.
ప్రేమకు దారేది
ప్రేమని ప్రేమగా స్వీకరించి తిరిగివ్వగలిగే స్వేచ్చా సమాజం కోసం కొంతమంది నవ యువ ప్రేమికులంతా కలిసి ధర్నాలు చేసే రోజు వస్తుందని మనం సరదాగా చెప్పుకున్నా గానీ భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఎదురయ్యే సూచికలు మాత్రం ఇప్పుడే కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని మానవహక్కుల సంఘాలు, పౌరవ హక్కుల సంఘాలు ఆందోలన బాట పడుతున్నారు.
ఒక చెట్టుకి ఎన్నో కొమ్మలు, అన్నీ ఒకేలా వుండవు. దేశం కూడా అంతే! రకరకాల ఏకాబిప్రాయాలు, బిన్నాభిప్రాయాలు కలిగినవాల్లు ఊకే చోట వుంటారు. ఇలాంటి పరిస్థితిల్లో మన యువత అందరి భావోద్వెగాలను గౌరవించుకుంటూ,అందర్నీ ప్రేమించుకుంటూ సహనంతో సానుకూల ద్రుక్పదంతో ముందుకు సాగితే అది ప్రపంచానికి గొప్ప సందేశమవుతుంది.
– Venkatesh Puvvada  9743271569

Related posts