April 05, 2020

Breaking News

దోషులకు డెత్ వారంట్

దోషులకు డెత్ వారంట్

దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్16,2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ఇన్నాళ్ల నిరీక్షణ తర్వాత మిగిలిన నలుగురు దోషులకు డెత్ వారంట్ జారీ అయింది. ఢిల్లీలోని పటియాలా కోర్టు మంగళవారం నిర్భయ దోషులకు మరణ దండన విధించేందుకు 2020 జనవరి, 22వ తేదీని ఖరారు చేసింది.2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది.

ఈ కేసులో మొత్తం ఆరుగురిలో ఒకడు జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరొకరు మైనర్ కావడంతో జువైనల్ చట్టం ప్రకారం.. మూడేళ్ల శిక్షా కాలం ముగిసాక విడుదల అయ్యాడు. మిగిలిన నలుగురిలో పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌ లకు ఉరిశిక్ష విధించాలని ఎప్పటినుంచో నిర్భయ తల్లిదండ్రులు పోరాటం చేస్తున్నారు. ఎట్టకేలకు ఇన్ని ఏళ్ల తర్వాత నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ అయింది.

ఉరితీసే తేదీ :
ఢిల్లీలోని పటియాలా కోర్టు మంగళవారం నిర్భయ దోషులకు మరణ శిక్ష విధించేందుకు 2020 జనవరి, 22వ తేదీని ఖరారు చేసింది. కోర్టు జారీ చేసిన ‘ బ్లాక్ వారెంట్ ‘ లేదా చట్టబద్ధంగా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో ఉన్న ఫారం 42 ప్రకారం.. ఉరితీయవలసిన వ్యక్తి పేరు, ఉరితీసే తేదీ ఉరితీసిన సమయాన్ని ఉదయం 7 గంటలుగా తెలియజేస్తోంది. బ్లాక్ వారెంట్ ఒక ఎరుపు రంగు కవర్లో ‘డెత్ వారెంట్’ అనే పదాలతో ఉంది.

ఇది ఫైనల్? అవుతుందా? :
అంటే.. లేదనే చెప్పాలి. నలుగురు దోషులకు ఇంకా ఆప్షన్ ఉంది. 14 రోజులలోపు అంటే.. జనవరి 21 వరకు సుప్రీంకోర్టు (SC)లో వారు క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. దోషుల తరపు న్యాయవాది ప్రకారం.. వారు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయాలని అనుకుంటున్నారు. ఆ తరువాత కూడా సుప్రీం కోర్టు వారి పిటిషన్ కొట్టివేస్తుంది. మరణశిక్షను తిరిగి ధృవీకరిస్తుంది. ఈ నలుగురికి భారత రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా ఉంది.

ఉరి ఆలస్యం అయ్యేనా? :
అంటే.. అవును అనే చెప్పాలి. ఎందుకంటే.. మోడల్ ప్రిజన్ మాన్యువల్ 2016 ప్రకారం.. మరణశిక్ష విధించిన దోషులకు ఉన్న అన్ని అవకాశాలు అయిపోయేంత వరకు వారిని ఉరి తీయలేరు. ఇందులో సుప్రీంకోర్టుకు క్యూరేటీవ్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. అంతేకాక, రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ కూడా అప్పీల్ చేసుకోవచ్చు. ఈ రెండింటిలో సుప్రీం.. దోషుల క్యూరేటీవ్ పిటిషన్ కొట్టివేస్తే.. వారు రాష్ట్రపతిని క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

డెత్ వారెంట్.. తొందరపాటా? :
నిర్భయ తల్లిదండ్రుల కోణం నుంచి చూస్తే కాదనే చెప్పాలి. అయితే, 2015లో, సుప్రీంకోర్టు షబ్నం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో దోషులు అన్ని చట్టపరమైన పరిష్కారాలను ఉపయోగించుకునే వరకు డెత్ వారెంట్ జారీ చేయవద్దని ట్రయల్ కోర్టులను ఆదేశించింది.

నిర్భయ కేసులో కూడా.. డెత్ వారెంట్ జారీ చేసిన పాటియాలా హౌస్ కోర్టు గత నెలలో కేసును వాయిదా వేసింది. దోషులలో ఒకరు దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్ నిర్ణయం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ తరువాత దోషుల్లో ఒకరు.. అది తన సమ్మతి లేకుండా పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొనడంతో ఆ పిటిషన్ విత్ డ్రా చేసుకోవడం జరిగింది.

Related posts