April 10, 2020

Breaking News

తెలంగాణ రాజకీయం

తెలంగాణ రాజకీయం

తెలంగాణలో రాజకీయాలు పలు మలుపులు తిరగుతున్నాయి.ముఖ్యమంత్రి కెసిఆర్ కు వ్యతిరేకంగా వివిధ వర్గాలను సమీకరణ చేసే పనిలో ప్రదాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పని పడింది.అంతేకాక తెలంగాణలో సామాజికవర్గాల సమీకరణ కూడా జరగడానికి ఆయా పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.టిడిపికి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఈ పరిణామ క్రమం మరింత వేగం పుంజుకుందనుకోవాలి.తెలంగాణలో కొద్దో,గొప్పో ఉన్న టిడిపి ముఖ్యనేతలు పలువురిని రేవంత్ తనతో పాటు కాంగ్రెస్ లోకి తీసుకు వెళ్లగలిగారు.వారిలో ఎందరికి టిక్కెట్లు వస్తాయ?ఎందరికి రావన్నది వేరే విషయం.వర్తమాన రాజకీయాలలో ఎవరి వెనుక ఎంత మంది ఉన్నారన్నది కూడా ముఖ్యమే.పైగా రేవంత్ కు కాంగ్రెస్ లో విశేష ప్రాధాన్యమే లభించిందని చెప్పాలి. రేవంత్ తన ఇంటిలో సమావేశం ఏర్పాటు చేసుకుంటే కాంగ్రెస్ హై కమాండ్ పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డిని,ఉపాధ్యక్షుడు మల్లు రవిని అక్కడకు పంపించి స్వాగతం చెప్పాలని సూచించిందంటేనే ఆ విషయం అర్దం అవుతుంది.గతంలో ఎన్నడూ ఇలా ఒకరి వద్దకు పిసిసి అద్యక్షుడు స్వాగతం చెప్పిన సందర్భం చూడలేదు.తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి టిడిపి బృందం ఉపయోగపడుతుందని రాహుల్ గాందీ విశ్వసించినట్లు కనబడుతుంది. టిడిపి నుంచి చేరిన వారిలో ఆ పార్టీ అదినేత చంద్రబాబుకు నమ్మినబంట్ల మాదిరి వ్యవహరించినవారు కూడా ఉన్నారు.వారికి టిడిపి ని వీడడం అంత ఇష్టం లేదు. కాని వారికి అంతకన్నా గత్యంతరం లేదు.ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ప్రధాన వ్యూహం కెసిఆర్ కుటుంబపాలనను టార్గెట్ గా చేసినట్లు కనిపిస్తుంది.తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ కుంతియా మొదలు కిందస్థాయి పార్టీ నేత వరకు ఇదే నినాదం పట్టుకుంంటున్నారు. రేవంత్ అయితే ఈ విషయంలో మరీ దూకుడుగా మాట్లాడగలిగే శక్తి ఉన్నవాడు.అదే సమయంలో తెలంగాణలో రెడ్లకు అవమానం జరిగిందన్న ప్రచారం కూడా పెంచారు. ఇది వెలమ, రెడ్డిపోరుగా కొందరు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు.కెసిఆర్ కూడా అనూహ్యంగా ఆ ట్రాప్ లో పడ్డట్లు కనిపిస్తుంది. ఒక మీడియా సమావేశంలో ఆయన ప్రత్యక్షంగానో,పరోక్షంగానో ప్రస్తావించడం ద్వారా ఆ కోణంలోకి వెళ్లారు. నిజానికి కెసిఆర్ ఇది ఊహించనిది ఏమీకాదు.అందుకే ఆయన తెలంగాణలో ఉన్న ఆయా బిసి వర్గాలను ఆకట్టుకునే పనిలో ఏడాదిగా చేస్తున్నారు.మత్స్యకారులకు చేపపిల్లల పంపిణీ, కురుమ,యాదవులకు గొర్రొల పంపిణీ,మహిళలకు కెసిఆర్ కిట్లు, ఇవి కాక రైతులకు ఎకరాకు నాలుగువేల రూపాయల చొప్పున వచ్చే ఏడాది నుంచి ఇస్తామని ప్రకటించడం వంటివన్ని ఎన్నికల వ్యూహంలో భాగంగానే చూడవచ్చు.అలాగే అనంతపురం లో మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ వివాహానికి వెళ్లినప్పుడు జరిగిన ఘటనలు,తద్వారా కనీసం పదిహేను,ఇరవై సీట్లలో ప్రభావం చూపే అవకాశం ఉన్న కమ్మ సామాజికవర్గాన్ని ఆకర్షించడం తదితర వ్యూహాలన్నీ కెసిఆర్ అమలు చేశారంటే ఆయన అది ముందు చూపు కావచ్చు.భవిష్యత్తులో టిఆర్ఎస్,బిజెపి,టిడిపి పొత్తు పెట్టుకునే అవకాశం కూడా లేకపోలేదన్న వాదన ఉంది.తెలంగాణలో బిజెపి మొదట జోరు చేసి టిడిపితో పొత్తు లేదని ప్రకటించినా,ఆ తర్వాత పరిస్థితి అర్దం చేసుకుని మళ్లీ టిడిపితో స్నేహానికి సిద్దమవుతున్నట్లుగా ఉంది. తెలంగాణలో టిఆర్ఎస్ నేరుగా పొత్తు పెట్టుకోకపోయినా, బిజెపి, టిడిపి కలిసి పోటీ చేసినా తమకు ఉపయోగమేనని కెసిఆర్ భావిస్తున్నారు.ఒక రకంగా అది కూడా పొత్తే అవుతుంది.ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్ఱదానంగా రెడ్లను సమీకృతం చేయడానికి రేవంత్ రెడ్డిని వాడుకోవచ్చు.అదే సమయంలో ఆయా వర్గాలను కూడా ఆకట్టుకోవడానికి సభలు ఏర్పాటుచేసే పనిలో పడింది.కాకపోతే కాంగ్రెస్ లో సి.ఎమ్.క్యాండిడేట్ ఎవరన్న చర్చ రావచ్చు.అదంతా ఎన్నికల తర్వాతేనని అదిష్టానం చెబుతుంది.అయితే ఎన్నికల లో కాంగ్రెస్ ను గెలిపించే బాహుబలి ఎవరన్నది కీలకం అవుతుంది.పలువురు అబ్యర్ధులకు ఆర్దిక వనరులు సమకూర్చడం, ఇతరత్రా హంగులు ఏర్పాటు చేయడం, ప్రచారంలో దూసుకు వెళ్లడం వంటివి ఎవరు చేస్తే వారే బాహుబలి అవుతారు. ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి తొందరపడకపోయినా,ఆ రేసులో తాను ఉన్నానని చెప్పగలరు.కెసిఆర్ కుటుంబ పాలన అన్నది ప్రధాన అస్త్రంగా వెళ్లాలని కాంగ్రెస్ వ్యూహం గా కనిపిస్తుంది.కెసిఆర్ కూడా ఆ విమర్శకు ఆస్కారం ఇస్తున్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మద్య పోటీగా ఉండడం వల్ల కెసిఆర్ విజయం సాధించడం తేలిక అయింది.అయినా బొటాబొటి మెజార్టీతోనే గెలిచారు.కాని ఈసారి సామాజిక కోణం కూడా ముందుకు వచ్చింది.పైకి చూస్తే అది కెసిఆర్ కు ఇబ్బందా అన్న అబిప్రాయం కలుగుతుంది.కాని ఇతరత్రా అన్ని కులాలను తన వెంట తిప్పుకోగలుగుతారా?లేదా అన్నది కూడా చర్చనీయాంశమే.మొత్తం మీద ఈసారి టిఆర్ఎస్ ,కాంగ్రెస్ ల మద్య పోరు సామాజికవర్గాల మధ్య పోరుగా మారితే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రమే మారిపోయే అవకాశం ఉంటుంది.ఇప్పటికైతే కెసిఆర్ కు ప్రజాదరణ అంత తగ్గినట్లు కనబడదు.కాని ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందన్న అబిప్రాయం ఉంది.అందువల్ల వచ్చే ఎన్నికలలో కెసిఆర్ ను తెలంగాణ ఉద్యమ నేతగా చూస్తారా?ప్రజాదరణ కలిగిన నేతగా చూస్తారా?లేక ఒక సామాజికవర్గం ప్రతినిదిగా చూస్తారా అన్నదానిపై టిఆర్ఎస్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.కాంగ్రెస్ కూడా రాజకీయం, సామాజికం కలగలిపి ఎంతవరకు వ్యూహాలకు పదును పెడుతుందన్నదానిపై ఆ పార్టీ భవిష్యత్తు ఆదారపడి ఉంటుంది.వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ కు,టిఆరెస్ కు మధ్య జరిగే అత్యంత ప్రతిష్టాత్మకం ఎన్నికలు అవుతాయి.

Related posts