February 26, 2020

తవ్వకాల్లో 16వ శతాబ్దం నాటి నాణేలు

తవ్వకాల్లో 16వ శతాబ్దం నాటి నాణేలు

ఇప్పటికే పురాతన కట్టడాల ఆనవాళ్లు లభ్యం
నయాఖిలాలోకి పర్యాటకులకు అనుమతి నిరాకరణ
ఏఎ్‌సఐ తీరుపై చరిత్రకారుల అభ్యంతరం
హైదరాబాద్‌: గోల్కొండలోని నయాఖిలాలో కొనసాగుతున్న తవ్వకాల్లో శుక్ర, శనివారాల్లో అత్యంత అరుదైన, విలువైన పురాతన నాణేలు బయటపడ్డాయి. ఇవి 16వ శతాబ్దంలో చలామణి అయినవని తెలుస్తోంది. నయాఖిలాలో పురావస్తు శాఖకు (ఏఎ్‌సఐ) చెందిన 40 ఎకరాల స్థలం ఉంది. గోల్ఫ్‌ కోర్టు విస్తరణకు దానిని అప్పగించాలని గోల్ఫ్‌ క్లబ్‌ కోరుతోంది. స్థలాన్ని అప్పగించాలంటే ఏఎ్‌సఐ ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి సైంటిఫిక్‌ క్లియరెన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో 20 రోజులుగా తవ్వకాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో 15వ శతాబ్దం నాటి రాతి కట్టడాలను పోలిన శకలాలు వెలుగుచూశాయి. ఈ విషయాలను ఏఎ్‌సఐ అత్యంత గోప్యంగా ఉంచుతోంది. సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని ఏఎ్‌సఐ ఉన్నతాధికారి ఒకరు సిబ్బందిని ఆదేశించారు. నయాఖిలాలోకి స్థానికులతో పాటు పర్యాటకులనూ అనుమతించకూడదని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.

పారదర్శకత లేదు

తవ్వకాల విషయంలో ఏఎ్‌సఐ పారదర్శకత పాటించడం లేదని చరిత్రకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పురాతన కట్టడాల శిథిలాలు బయటపడటంతో భూగర్భంలో భారీ నిర్మాణాలు ఉండే అవకాశాలున్నాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెలుగుచూసిన శిథిలాలు, నాణేల వివరాలను బహిర్గతం చేయాలని హెరిటేజ్‌ ట్రస్టు అధ్యక్షుడు అఫ్జల్‌ డిమాండ్‌ చేశారు. చారిత్రక నేపథ్యం ఉన్న భూములను గోల్ఫ్‌క్లబ్‌కు కట్టబెట్టాలన్న లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

ఇంతకుముందూ బయటపడ్డాయి

గతంలో గోల్ఫ్‌క్లబ్‌కు అప్పగించిన స్థలంలో నిర్మాణ పనులు జరుగుతుండగా ఇలాగే పెద్దఎత్తున నాణేలు బయటపడ్డాయి. బంగారు, వెండి వస్తువులు దొరికినట్లు ప్రచారం జరిగింది. విషయం బయటకు తెలియడంతో కొన్ని నాణేలను హైదరాబాద్‌లోని స్టేట్‌ మ్యూజియంలో భద్రపరిచారు.

Related posts