February 23, 2020

చెరిగిపోని నెత్తుటి మరకలు

చెరిగిపోని నెత్తుటి మరకలు

ఉత్సాహంగా మొదలయ్యే ఉదయం… ఆహ్లాదాన్నిచ్చే సాయంత్రం… సినిమాలు.. షికార్లు… గోకుల్‌చాట్‌లో గప్‌చుప్‌లు… ట్యాంక్‌బండ్‌… నెక్లెస్‌రోడ్‌లో ముంతకింది పప్పు… లుంబినీ పార్కులో లేజర్‌షోలు… గమ్యస్థానాలకు చేర్చేందుకు రద్దీగా ఉండే సిటీబస్సులు… యువకులు… యువతులు.. చిన్నాపెద్దలతో సందడిగా ఉండే బస్‌స్టాప్‌లు… సేదతీరే వాతావరణాన్ని అందించే రాత్రి.. దశాబ్దాలుగా నగరంలో కొనసాగుతున్న పరిస్థితులివి… పదకొండేళ్ల క్రితం హైదరాబాద్‌ నడిబొడ్డున బేగంపేట పోలీస్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో ఒక్కసారిగా విస్ఫోటం చోటుచేసుకుంది.. నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఇంత తీవ్రంగా ఉంటాయా?.. అని జనం ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అప్పటి నుంచి అభద్రతాభావం మొదలైంది. ఒక్కసారిగా ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలకు నగరం స్థావరంగా మారింది. అప్పటి నుంచి విధ్వంసాలు మొదలయ్యాయి. ఈ ఘటన జరిగిన 19 నెలలకే మక్కామసీదులో బాంబు పేలుడు సంభవించింది. మరో మూడు నెలలకే (2007 ఆగస్టు) గోకుల్‌చాట్‌, లుంబినీపార్కులో ముష్కరులు వేర్వేరుగా విధ్వంసాలు సృష్టించారు. ఉగ్రవాదంతో ఏమాత్రం సంబంధం లేని అమాయక ప్రజలు చనిపోయారు. అప్పటి నుంచి దేశంలో ఎక్కడ పేలుళ్లు సంభవించినా కుట్ర హైదరాబాద్‌లోనే రూపుదిద్దుకుందని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. జనజీవనం సాధారణంగా ఉన్నా… ఎక్కడ బాంబు పేలుతుందో అనే భయం వెంటాడుతూనే ఉంది. సరిగ్గా 46 నెలల క్రితం దిల్‌సుఖ్‌నగర్‌లో జంటపేలుళ్లు చోటుచేసుకున్నాయి. పదకొండేళ్లు నగరంలో కొనసాగిన విధ్వంస చరిత్రలో పదుల సంఖ్యలో బాధితులు మృతి చెందారు. వారి కుటుంబాలకు నష్టపరిహారం అందినా.. కుటుంబసభ్యులకు దారీతెన్నూ తెలియకుండా పోయింది. నిందితులను గుర్తించిన పోలీసులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు దోషులను శిక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా… ఇప్పటి వరకూ విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌ జంటపేలుళ్ల ఉదంతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష పడింది. మిగిలిన మూడు విధ్వంసాల పరిస్థితిని పరిశీలిస్తే…

టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం పేలుడు
తుది దశలో విచారణ
అక్టోబరు 12, 2005.. బేగంపేటలోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం… దసరా సెలవులు కార్యాలయంలో ఉన్నతాధికారులు, సిబ్బంది లేరు. కానిస్టేబుల్‌ వెంకటరావు, హోంగార్డు సత్యనారాయణ మాత్రమే విధుల్లో ఉన్నారు. 7.30 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చి ఫలానా చిరునామా ఇదేనా అంటూ అడిగారు. తర్వాత భారీ శబ్దంతో విస్ఫోటం చోటుచేసుకుంది. విస్ఫోటానికి కారకుడైన డాలీ(బంగ్లాదేశీయుడిగా గుర్తించారు), హోంగార్డు సత్యనారాయణ అక్కడికక్కడే చనిపోయారు. కానిస్టేబుల్‌ వెంకటరావుకు తీవ్ర గాయాలయ్యాయి.
* ఉగ్రవాద సంస్థ హర్కతుల్‌ జిహాద్‌ -ఇ-ఇస్లామీ(హుజీ) సంస్థ ఈ విధ్వంసానికి తెగబడిందని పోలీసులు నిర్ధరించారు. హైదరాబాద్‌ పోలీస్‌ ప్రత్యేక పరిశోధన బృందం(సిట్‌) దర్యాప్తు చేపట్టింది.
* 20 మందిని నిందితులుగా నిర్ధరించింది. ప్రధాన నిందితుడు ముసారాంబాగ్‌లోని గులాం యాజ్దానీగా గుర్తించారు. గులాం యాజ్దానీ, మహ్మద్‌ అబ్దుల్‌ అలియాస్‌ షాహెద్‌ బిలాల్‌ సహా వారి కుటుంబసభ్యులు, బంధువులు ఈ కుట్రకు పాల్పడ్డారు.
* ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళిక రచించడం, విధ్వంసాలకు పేలుడు పదార్థాలు సమకూర్చారన్న ఆరోపణలతో దిల్లీ పోలీసులు గులాం యాజ్దానీని దిల్లీ పోలీసులు 2006 మార్చిలో ఎన్‌కౌంటర్‌ చేశారు. ఇదే సంవత్సరం సిట్‌ పోలీసులు నిందితులపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేశారు.
* ప్రధాన నిందితుల్లో ఒకరైన షాహెద్‌ బిలాల్‌, అతడి తమ్ముడు పాకిస్థాన్‌కు వెళ్లారు. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐ ఏజెంట్లు వీరిద్దరినీ 2007లో కాల్చారని వార్తలొచ్చాయి. అధికారికంగా ధ్రువీకరణ కాకపోవడంతో సిట్‌ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
* సిట్‌ అధికారులు మహ్మద్‌ అబ్దుల్‌ జాహెద్‌, అబ్దుల్‌ కలీమ్‌, షకీల్‌, హాజీ, అజ్మల్‌, అజ్మత్‌, మహ్మద్‌ అబ్దుల్‌ఖాజా, మహ్మద్‌ బారూద్‌వాలా, అంజద్‌లను అరెస్ట్‌ చేశారు. అనంతరం 2010లో దక్షిణ భారతదేశంలో హుజీ తరఫున ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళిక నిర్వహించిన అంజాద్‌ను అరెస్ట్‌ చేశారు.
* టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం కేసుకు సంబంధించిన విచారణ తుదిదశకు చేరుకుంది. నిందితులు చర్లపల్లి, చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉంటున్నారు.
మక్కామసీద్‌ విధ్వంసం
ముందు ఒకరు.. తర్వాత మరొకరు…

హైదరాబాద్‌ చరిత్రలో రెండో ఉగ్ర సంతకం మక్కామసీద్‌లో పేలుడు. మే 18, 2007న శుక్రవారం ప్రార్థనలు పూర్తయ్యాక ఒక్కసారిగా పేలుడు సంభవించింది. 400 ఏళ్ల క్రితం తెప్పించిన రాతిఫలకం కింద ఉగ్రవాదులు బాంబును అమర్చారు. ప్రార్థనల సమయంలో ఉన్నవారిలో తొమ్మిది మంది మృతి చెందారు. 58 మంది గాయపడ్డారు. అప్పటికే హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు వూపందుకోవడంతో పాక్‌ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, హుజిలు ఈ పనికి పాల్పడి ఉంటాయని పోలీసులు భావించారు. ఆయా సంస్థల ఉగ్రవాద సానుభూతి పరులను అరెస్ట్‌చేసి జైలుకు పంపించారు. అభియోగ పత్రాలూ దాఖలు చేశారు. నిందితుల్లో కొందరు అన్యాయంగా తమను జైలుకు పంపించారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వీరికి సంబంధం లేదని న్యాయస్థానం తేల్చింది. నిందితులను పట్టుకునేందుకు వీలుగా కేంద్ర దర్యాప్తు సంస్థకు బాధ్యతలు అప్పగించింది. అనంతరం మళ్లీ జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు.
* మక్కామసీదులో బాంబు పేలుడు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల పనేనని స్థానిక పోలీసులు నిర్ధరించారు. వారు కాదని తేలడంతో సీబీఐ పరిశోధన బాధ్యతను తలకెత్తుకుంది.
* రెండేళ్లపాటు(2009లో) పరిశోధించాక ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తును అటకెక్కించింది. సరిగ్గా ఈ సమయంలోనే మహారాష్ట్రకు చెందిన ఉగ్రవాద నిర్మూలన సంస్థ… మక్కామసీదులో బాంబు పేలుడు వెనుక అభినవ్‌భారత్‌ అనే సంస్థ ఉందని నిగ్గుతేల్చింది. దీంతో సీబీఐ మళ్లీ దర్యాప్తును మొదలు పెట్టింది.
* అభినవ్‌ భారత్‌ సంస్థ ప్రతినిధులు లోకేష్‌శర్మ, దేవేంద్రగుప్తా, స్వామి అసిమానందలు మాలేగావ్‌లో పేలుళ్లకు సూత్రధారులని, వీరు మక్కామసీదులో బాంబు ఉంచారని అభియోగాలు మోపింది.
* 2010 డిసెంబరులో సీబీఐ అధికారులు దేవేంద్రగుప్తా, లోకేష్‌శర్మలపై అభియోగాలు నమోదు చేశారు.
* 2011, మేనెలలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు నాబకుమార్‌ సర్కార్‌ అలియాస్‌ స్వామి అసిమానందపై అభియోగపత్రాలు సమర్పించారు.ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.
లుంబినిపార్కు… గోకుల్‌చాట్‌ పేలుళ్లు
ఇండియన్‌ ముజాహిదీన్‌ తొలి పంజా

పాక్‌ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఐఎస్‌ఐ.. లష్కరేతోయిబా, హుజీలు దేశంలోని ప్రముఖ పట్టణాలు, మెట్రో నగరాల్లో బాంబుపేలుళ్లతో భయాందోళనలు సృష్టిస్తుండగా… ఉగ్రవాద భావజాలాన్ని నరనరాన నింపుకొన్న భత్కల్‌ సోదరులు ఉగ్రశిక్షణలో రాటుదేలాక తొలిసారిగా హైదరాబాద్‌పై పంజా విసిరారు. మూడునెలల పాటు ఉప్పల్‌లో నివాసముండి విధ్వంస రచనకు పథకం రచించారు. లుంబినీపార్కు, గోకుల్‌చాట్‌లను ఎంచుకున్నారు. ఆగస్టు 25, 2007న బృందాలుగా విడిపోయి రెండుచోట్లా అమర్చారు. మూడు నిమిషాల తేడాలో రెండుచోట్లా బాంబులు పేలాయి. 44 మంది మృతి చెందారు. ఉగ్రవాది రియాజ్‌ భత్కల్‌ గోకుల్‌చాట్‌లో స్వయంగా బాంబు అమర్చాడు. కొద్దినెలల క్రితమే కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు నిందితులపై అభియోగపత్రాలు న్యాయస్థానంలో సమర్పించారు. విచారణ త్వరలో ప్రారంభమవుతుందని పోలీస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

కానరాని పశ్చాత్తాపం
చర్లపల్లి, కాప్రా: చర్లపల్లి కేంద్ర కారాగారంలో దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసు తుది తీర్పు నేపథ్యంలో ఉగ్రవాదుల్లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. సోమవారం ఉదయం 10.30 గంటలకు విచారణ ప్రారంభం కాగా.. జాతీయ దర్యాప్తు సంస్థ పోలీసులు గంట ఆలస్యంగా దోషుల్ని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సురేందర్‌ తన వాదనల్ని వినిపించారు. అనంతరం సరిగ్గా 4.45 గంటల సమయంలో వారికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆ సమయంలో నిందితుల్లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని సురేందర్‌ మీడియాకు తెలిపారు. తీర్పు వెల్లడైన వెంటనే జైలు వద్ద రాచకొండ పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జైలు వద్ద ఉదయం నుంచి మీడియా కోలాహలం కనిపించింది.
18 ప్రాణాలు.. రూ.1.91 లక్షలు
దిల్‌సుఖ్‌నగర్‌ బాంబుపేలుళ్ల కోసం పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాది రియాజ్‌భత్కల్‌ రూ.1.91 లక్షల్ని పంపించాడు. 18 మంది ప్రాణాల్ని హరించిన ఈ కుట్రను అమలు చేసేందుకు హవాలా, వెస్ట్రన్‌ యూనియన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ మార్గాలను రియాజ్‌ ఎన్నుకున్నాడు. తొలుత హవాలా ద్వారా రూ.లక్ష, అనంతరం మనీ ట్రాన్స్‌ఫర్‌ మార్గంలో మూడుసార్లు రూ.25 వేల చొప్పున, మరోసారి రూ.16 వేల చొప్పున పంపించాడు.
తీర్పు ప్రత్యేకం
దర్యాప్తు… విచారణ తీరు బహిర్గతం కాకుండా ఆంక్షలు
దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసులో తొలగిన ఉత్కంఠ
ఈనాడు, హైదరాబాద్‌-న్యూస్‌టుడే, రంగారెడ్డి జిల్లా కోర్టులు

దిల్‌సుఖ్‌నగర్‌ జంటబాంబు పేలుళ్ల ఘటనలో న్యాయవిచారణ ప్రక్రియ వేగంగా పూర్తికావాలన్న లక్ష్యంతో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటును ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ.. నిఘా విభాగం ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండటంతో మార్చి, 2013లో మొదలైన పరిశోధన.. నిందితుల అరెస్ట్‌… దర్యాప్తు.. అభియోగపత్రాల సమర్పణ… క్రమపద్ధతిలో కొనసాగాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కావడంతో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు విచారణ ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టింది. దీంతోపాటు తీర్పు నిందితులున్న చర్లపల్లి జైల్లోనే ప్రకటించి ప్రత్యేకతను నిరూపించుకుంది.
నాంపల్లి క్రిమినల్‌ కోర్టు… రంగారెడ్డి జిల్లాకోర్టులు
దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు విచారణ కొద్దినెలల పాటు నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో కొనసాగింది. క్రిమినల్‌కోర్టులో ఎక్కువమంది కక్షిదారులు వస్తుండటం భద్రతపరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి రావడం, వీటితో పాటు ఉగ్రవాద సంబంధ కేసుల విచారణ కొనసాగుతుండటంతో కేసు విచారణను ఎల్బీనగర్‌లోని రంగారెడ్డిజిల్లా కోర్టులకు బదిలీ చేశారు. జంటపేలుళ్ల విచారణకు హాజరయ్యేందుకు రంగారెడ్డిజిల్లా కోర్టుకు వస్తున్న సమయంలో నిందితులు మీడియా దృష్టిని ఆకర్షించడానికి వివిధ రకాల హడావుడి చేసేవారు. ఒక రోజు కాగితంపై ఏదో రాసి విలేకరులపై విసరడం, మరో వాయిదా రోజు ఓ పువ్వు పట్టుకొని మీడియా వైపు గాలిలో చూపడం, ఇంకో రోజు చేతిలో పుస్తకం చూపిస్తూ మీడియా వారిని ఆకర్షించే ప్రయత్నం చేసేవారు. ఇలా కోర్టు పరిసరాల్లో మీడియా కనిపిస్తే చాలు ఏదో ఒక వింత చేష్టలతో హల్‌చల్‌ సృష్టించేవారు. నిందితులను జైలు నుంచి ఎల్బీనగర్‌ కోర్టుకు తరలించేటప్పుడు భద్రతపరంగా సమస్యలు తలెత్తున్నాయంటూ సైబరాబాద్‌ పోలీసుల కోర్టును అభ్యర్థించారు. ఫలితంగా ప్రత్యేక కోర్టు హైకోర్టు అనుమతితో చర్లపల్లి కారాగారంలోనే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. 2015 ఆగస్టు 24 నుంచి తుదితీర్పు ప్రకటించే వరకూ.. ప్రతి సోమ, మంగళ, బుధవారాలలో న్యాయమూర్తి డాక్టర్‌ టి.శ్రీనివాస్‌రావు జైలులోనే కేసును విచారించారు.
స్కైప్‌ ద్వారా…
నిందితుల తరఫు వాదనలు వినిపించే సమయంలో విచారణ కొన్ని మార్లు కారాగారంలో కాకుండా ఎల్బీనగర్‌లోని జిల్లా కోర్టులో స్కైప్‌(వీడియో కెమెరా) ద్వారా కొనసాగింది. జిల్లా కోర్టులో జరిగిన వాదనలు జైలులో ఉన్న నిందితులు వీక్షించడానికి స్కైప్‌ ద్వారా ఏర్పాటు చేశారు. నిందితులు దీనికి అభ్యంతరం చెప్పడంతో అనంతర వాదనలు జైలులోని కోర్టులోనే కొనసాగాయి.
విచారణ ఆలస్యానికీ యత్నం
ప్రత్యేక కోర్టులో కేసు విచారణలో జాప్యమయ్యేందుకు నిందితులు ప్రయత్నాలు చేశారు. తుది వాదనలు చేయాల్సిన సమయంలో కేసు విచారణ రంగారెడ్డిజిల్లా కోర్టుల పరిధిలోకి రాదంటూ నిందితులు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దాన్ని హైకోర్టు కొట్టివేసింది. అనంతరం ప్రాసిక్యూషన్‌ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపించారు. నిందితుల తరఫున వాదనలు వినిపించాల్సిన న్యాయవాది కొన్ని వాయిదాలు కోర్టుకు హాజరు కాలేదు. జిల్లా కోర్టులో ఏదైనా సంచలన కేసులో తీర్పు వెలువడుతుందంటే కోర్టు పరిసరాలు మీడియాతో కిక్కిరిసిపోతుంటాయి. జంట బాంబు పేలుళ్ల కేసు తీర్పు జైలులో ఉండటంతో జిల్లా కోర్టు ప్రాంగణంలో సోమవారం ఎలాంటి హడావుడి లేకుండా నిశ్శబ్దంగా ఉంది. పోలీసు బందోబస్తూ తక్కువగానే ఉంది.

Related posts