February 23, 2020

కేసీఆర్ చంద్రబాబుల వ్యూహమేంటి..?

కేసీఆర్ చంద్రబాబుల వ్యూహమేంటి..?

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ల థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ ముచ్చట ఇప్పటికైతే వెనకపడ్డట్టేనా…? నిన్న మొన్నటి వరకు భారత రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలంటూ అందుకు తొలి అడుగు వేసిన కేసీఆర్ తన ప్రయత్నాలు విరమించుకున్నారా…? కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ యేతర పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ అందుకు పలువురి అగ్రనేతలను కలిసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు..?

ఆసక్తికరం గా మారనున్న 2019 ఎన్నికలు
కొద్ది రోజుల క్రితం ఫెడరల్ ఫ్రంట్ అంటూ ముందుకొచ్చిన కేసీఆర్… ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వైపునకే ఆకర్షితుడవుతున్నట్లు సమాచారం. మరోవైపు మొన్న మార్చి వరకు బీజేపీతో మిత్రుడిగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు… బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం చేశారని ఆరోపిస్తూ ఎన్డీఏ నుంచి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో చంద్రబాబు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

పరిస్థితులను బట్టి కేసీఆర్ అడుగులు
జూన్ 15న సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. అప్పటి దాకా బీజేపీ మోడీపై నిప్పులు చెరిగిన గులాబీ బాస్… ఒక్కసారిగా మోడీపై ప్రేమ కురిపించాడు. దీంతో కమలంతో కారు పార్టీ సఖ్యతపై రాజకీయ వర్గాల్లో అనుమానాలు పెరిగిపోయాయి. ఇవి కేవలం గాలి వార్తలే అంటూ కేసీఆర్ కానీ ఆయన అనుచరులు కానీ ఖండించలేదు. ఆ తర్వాత 27 జూన్‌న మంత్రి కేటీఆర్‌కు ప్రధాని అప్పాయింట్‌మెంట్ ఇచ్చారు.

ఇదే సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌తో పాటు పలువురు టీడీపీ ముఖ్యనేతలకు కూడా ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏప్రిల్ మే వరకు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం పలువురి అగ్రనేతలను కలిశారు. ఇందులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి ఆయన కుమారుడు స్టాలిన్, మాజీ ప్రధాని దేవెగౌడా ఆయన కుమారుడు ప్రస్తుత కర్నాటక సీఎం కుమార స్వామిని కలిశారు.

ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్‌తో కూడా భేటీ అయి ఫెడరల్ ఫ్రంట్‌పై ముచ్చటించారు. అయితే స్టాలిన్‌తో భేటీ సందర్భంగా ఓ జర్నలిస్టు కేసీఆర్ ను ఇలా అడిగారు. కాంగ్రెస్‌తో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని. ఇందుకు కేసీఆర్ చాలా తెలివిగా సమాధానం చెప్పారు. కాంగ్రెస్‌తో పనిచేసేందుకు సిద్ధంగా లేనని చెబుతూనే అన్నీ సవ్యంగా సాగితే దేనికైనా సిద్ధమేనంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

చంద్రబాబు వ్యూహం ఎలా ఉంది..?
కేసీఆర్ తనదైన సమాధానంతో రాజకీయ విశ్లేషకులను కాంగ్రెస్ నేతలను ఇరకాటంలోకి నెట్టారు. ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారో చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భుజం భుజం రాసుకుంటూ కనిపించారు.

ఇదే కార్యక్రమంలో బీజేపీ యేతర నేతలంతా ఒకే వేదికపై కనిపించడం, వారితో పాటు చంద్రబాబు కరచాలనం చేస్తూ హుషారుగా కనిపించి తాను కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏతో కలిసి వెళ్లేందుకు సిద్ధమేనన్న సంకేతాలు పంపారు . కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే టీడీపీ ఆవిర్భావం జరిగిందని చెబుతున్నవారికి చంద్రబాబు కాంగ్రెస్ వారితో కలవడం షాక్‌కు గురిచేసింది.

అంతకుముందు అంటే 1998లో చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో చేరకముందు కాంగ్రెస్ బీజేపీయేతర నేతలు ప్రధానులు కావడంలో ముఖ్య భూమికను పోషించింది తానే అనేది ఇక్కడ మరవకూడదు.

చంద్రబాబుకు ఉన్న రాజకీయ అనుభవం, అతని చాకచక్యం చూసి బీజేపీ వ్యతిరేక శక్తులన్నిటినీ ఒక్క తాటిపైకి తీసుకురాగల సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందని భావిస్తున్నారు. దీంతో కేసీఆర్ ఇరుకున పడ్డారు. అయితే కేసీఆర్ దీనిపై ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు.

కేజ్రీవాల్ ఎపిసోడ్‌తో మరో మలుపు
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేస్తున్న దీక్షకు చంద్రబాబుతో పాటు మమతా బెనర్జీ, పినరాయి విజయన్‌లు మద్దతు తెలిపారు. అయితే ఇక్కడ మమతా బెనర్జీనే హైలైట్‌గా నిలవడంతో చంద్రబాబు రెండో వ్యక్తి కిందే పరిమితం అయ్యారు. అప్పటికే కేజ్రీవాల్‌ దీక్షను కాంగ్రెస్ తప్పుబట్టింది. ఇక దీంతో చంద్రబాబు కాంగ్రెస్ నీడకు చేరారనే వార్తలు గుప్పుమన్నాయి.

ఇదే సమయంలో సీఎం కేసీఆర్ కూడా నీతి ఆయోగ్ మీటింగ్ కోసం ఢిల్లీ వచ్చి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇతర ముఖ్యమంత్రుల్లా కేసీఆర కేజ్రీవాల్‌ దగ్గరకు వెళ్లలేదు దీక్షకు మద్దతు తెలపలేదు. దీంతో కేసీఆర్ బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారనే సంకేతాలు ఇవ్వకనే ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భవిష్యత్తులో ఇరునేతల వ్యూహం ఏమిటి..?
కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ భవిష్యత్తులో బీజేపీతో చేతులు కలుపుతుందా…? అంటే క్లారిటీ లేదు. ఇప్పటికే టీఆర్ఎస్‌కు మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ మద్దతు ఉంది. ఓవైసీతో స్నేహం ఎట్టి పరిస్థితుల్లో చెడగొట్టుకునేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరు. అదే సమయంలో మోడీకి వచ్చే ఎన్నికల్లో అనుకున్నంత సంఖ్యా బలం రాకుంటే…

ఎన్నికల తర్వాత మద్దతు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. లోక్ సభ ఎన్నికలు ఇప్పుడే వచ్చినా… అందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే వారి వారి పార్టీలను ప్రక్షాళన చేస్తున్నారు. కొందరిని కొత్త వారిని చేర్చుకోవడంతో పాటు పార్టీకి అవసరం లేదనుకున్న వారిని బయటకు పంపుతున్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు కూడా అదే స్థాయిలో పావులు కదుపుతున్నారు. ఏపీకి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా తాత్సారం చేస్తోందనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు… ప్రతిపక్ష నేత జగన్ బీజేపీకి కోవర్టుగా వ్యవహరిస్తున్నారన్న సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన చతురతను ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ చేస్తూనే బీజేపీ వ్యతిరేక శక్తులన్నిటినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం.

మొత్తానికి రానున్న ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలు కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ వ్యూహాలకు పదను పెడుతున్నారు.

Related posts