December 11, 2019

Breaking News

కవిత, కన్నీరు తప్ప, ఏమీ చేయలేదు!!

కవిత, కన్నీరు తప్ప, ఏమీ చేయలేదు!!

“కవితలు రాయడం – కన్నీరు కార్చడం తప్ప, ఏమీ చేయలేని ప్రధాని” – ఇది 2003లో, అప్పటి ప్రముఖ దినపత్రికల్లో ఒకటైన ‘వార్త ‘ పేపర్ లో ప్రచురితమైన వ్యాసం.

15 ఏళ్ళ తర్వాత కూడా, ఆ వ్యాసంలోని ప్రతివాక్యం ఇంకా గుర్తుంది.

అట్లే బిల్కిస్ బానో కూడా గుర్తుంది. – అల్లరి మూక బారి నుండీ కాపాడుకునేందుకు ఓ కుటుంబం మొత్తం ట్రక్కులో పారిపోతుంటే, దానిని అటకాయించి ఆమె తల్లిని, 2 సంవత్సరాల వయసున్న కూతుర్ని, ఇంకో 15 మంది కుటుంబ సభ్యుల్ని ఆమె కళ్ళముందే చంపేసి, ఆమెను గ్యాంగ్ రేప్ చేసి, చనిపోయిందనుకుని వదిలేశారు. అప్పటికి ఆమె 5 నెలల గర్భవతి.
జహీరా షేక్- ఈమె ఇంటిపై దాడి చేసి మొత్తం 14 మంది కుటుంబ సభ్యుల్ని సజీవ దహనం చేశారు.
ఎహ్సాన్ జాఫ్రీ కూడా గుర్తున్నాడు- ఈయన కాంగ్రెస్ యం.పీ. తన ఇంట్లో ఆశ్రయం పొందుతున్న అమాయక ముస్లింలను ఏమీ చేయొద్దని వేడుకున్నందుకు, అల్లరి మూకలు ఆయన కాళ్ళూ,చేతులూ నరికి,తర్వాత ఆయన్ని సజీవం చేశారు. తర్వాత ఆయన ఇంట్లో తలదాచుకుంటున్న 97 మందిని, స్త్రీలు, పిల్లలను కత్తులతో నరికి చంపారు.

ఈ లిస్ట్ చాలా పెద్దది. ఇవన్నీ ఎక్కడో మారుమూలప్రాంతాల్లో జరిగినవి కాదు. గుజరాత్ లోని పట్టణాలు, నగరాల్లో పట్టపగలే జరిగాయి. చాలా చోట్ల పోలీసుల పహారాలోనే జరిగాయి.
ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ మాహానేత దేశ ప్రధాని.

ఇవి జరిగిన చాన్నాల్లకు ఆయనకు వీటి గురించి తెలిసి వలవలా ఏడ్చారు. రాజధర్మం గురించి లెక్చర్లు దంచారు. మన పత్రికలు వాటిగురించి గొప్పగా రాశాయి. అసలైనోల్లు ఆ లెక్చర్లు విని నవ్వుకున్నారు. ఆనక ఆ మహానేత కవితలు రాసుకుని స్వాంతన పొందారు.

*******

దేశంలో లౌకికవాదం ఓ బూతుపదంలా, మైనారిటీల జీవితాలు గాలిలో దీపంలా మారడం ఏ ఒక్కరోజులోనో జరిగింది కాదు. అది వివిధ దశల్లో జరుగుతూ వచ్చింది. వాటిలో రెండు ప్రధాన దశలు
1. బాబ్రీ మసీదు విధ్వంసం.
2. గుజరాత్ మారణకాండ.

ఈ రెండు దారుణమైన, భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన ఘటనలు జరిగి కూడా బీజేపీ ఎక్కువమందికి ఆమోదయోగ్యమైన పార్టీగా మారడం వెనుక ఆ మహానేత పాత్రే కీలకం. ఎలాగోలా అధికారంలోకి రావాలనుకునే దేశంలోని అనేక ప్రాంతీయపార్టీల అవకాశవాద రాజకీయనాయకులకు – ఆయన కవితలు, చిలకపలుకులు ఓ ముసుగుగా పనికొచ్చాయి.

ముసుగు ఎప్పటికైనా ఎవరికి ఉపయోగపడుతుంది? దాని ద్వారా కప్పబడిన వారికా, లేక బయటి వారికా? ఆ రకంగా, ఆ ముసుగు అనేక దారుణాల్ని కప్పిపుచ్చుకోవడానికి, అధికారం మాటున క్లీన్ చిట్ లు పొందడానికి, సాక్ష్యాలు కనుమరుగు చేసుకోవడానికీ కొందరికి బాగానే పనికొచ్చింది. అలాంటి వారు రిప్పు మెసేజీలు రాసుకున్నా, శ్రద్ధాంజలులూ, గీతాంజలులూ అర్పించుకున్నా అర్థం చేసుకోవచ్చు.

Related posts