April 05, 2020

Breaking News

ఎలాంటి పరిస్థితికి నెట్టబడ్డామో అర్థమవుతోందా?!

మనమంతా ఒక దయనీయ పరిస్థితుల్లోకి నెట్టబడ్డాం. మూక హత్యలను ప్రోత్సహించే హంతకులు ఏకంగా సామూహిక హత్యలు చేయడానికి చట్టాలు చేస్తున్నా మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి నెట్టబడ్డాం. 300లకు పైగా ఉత్తర భారతంలోని ఎంపీ సీట్లను గెలుచుకున్న బిజేపీ తనకు ఇష్టమైన నియంతృత్వ, అమానవీయ సామూహిక హననాలు చేయడానికి సన్నద్ధమై పార్లమెంటు సాక్షిగా తమ అకృత్యాలకు ఆమోద ముద్రలు వేయించుకుంటోంది. అమానవీయ బిల్లులకు వారి మెజారిటీనే సరిపోతుంది కాబట్టి మనమెందుకు వ్యతిరేకం కావాలనో, గత్యంతరం లేకనో వారి బూట్లు నాకడానికి మనోళ్లు సిద్ధమైపోతున్నారు. ఉత్తర భారతంలోని అమానవులైన, నీతి నియ్యతి లేని, క్రూరులైన ఈ నియంతలు చేపట్టిన పనులకు దక్షిణ భారతంలోని మానవీయులైన, నీతి నియ్యతి ఉన్న, ఎంతో అభివృద్ధి చెందిన వాళ్లమంతా సై అనాల్సిన దౌర్భాగ్యమెందుకు?

మోడీ, అమిత్‌ షా అనే అమానవీయుల నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అతి క్రూరమైన నియంతృత్వ చర్యల చిట్టా చూడండి.. దానివల్ల నష్టపోయిన, పోబోతున్న అట్టడుగు బహుజనుల సంఖ్య లెక్కేయండి:

● అస్సాంలో 19 లక్షల మంది ఎన్‌ఆర్‌సీలో రాలేదని రిహాబిలిటేషన్‌ క్యాంపులనే జైళ్లలో పెట్టడం.. క్యాబ్‌ బిల్లు ద్వారా అందులోంచి హిందువులను మినహాయించి ముస్లింలను టార్గెట్‌ చేయబోతుండడం..

● దేశమంతా ఎన్‌ ఆర్‌ సి అని చెప్పి భవిష్యత్తులో ముస్లింలను టార్గెట్‌ చేయడం.. మూక హత్యలకు నెత్తుటి దాహం తీరని మృగాలు ఏకంగా సామూహిక హత్యలకు పూనుకుంటుండడం..

● కశ్మీర్‌లో లక్షల మందితో సహా రాజకీయ నాయకులను సైతం నిర్బంధించడం.. 13000 పైగా పది పన్నెండేండ్ల మగపిల్లల నుంచి యువకుల దాకా ఎత్తుకుపోయి చిత్రహింసలు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం.. మొత్తంగా కశ్మీరునే జైలుగా మార్చడం.. అడిగే వారు లేకుండా చేయడం..

● మొత్తంగా ఈ చర్యల వల్ల ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటే ఇజ్రాయెల్‌ లాగా ముస్లింలను టార్గెట్‌ చేస్తున్న చెడ్డ పేరు మూటగట్టడం.. ఎప్పటికీ చెరగని మచ్చగా మిగిల్చడం..

● జిఎస్టీ ద్వారా కోట్లమంది చిన్న వ్యాపారస్తులను దెబ్బతీయడం..

● గోమాతల పేరు మీద కోట్ల మంది జీవనోపాధిని ధ్వంసం చేయడం..

● స్త్రీలంటే చిన్నచూపుతో, రెండవ తరగతి పౌరులుగా చెప్పకనే చూపెడుతూ వారిపై అత్యాచారాలు పెరగడానికి కారణమవడం..

● మూఢ విశ్వాసాలు, మూఢ భక్తిని పెంచి పోషిస్తుండడం..

● పెద్ద నోట్ల రద్దు ద్వారా ప్రత్యర్థి పార్టీలనే కాక సామాన్య జనాన్ని నానా హింసలు పెట్టడం..

● బడాబాబులకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ సంస్థలను ధ్వంసం చేస్తూ ప్రైవేటీకరణకు పాల్పడుతుండడం..

● దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి నియంతృత్వ పాలనకు దారులు వేసుకుంటుండడం..

● మత రాజ్యాలుగా ఏర్పడ్డ ఏ దేశమూ సుఖంగా లేదు.. అతివాదం అంతకంతకూ పెరిగి తాలిబానిజానికి చేరుకుంటుంది. మన దేశాన్నీ ఆ మార్గంలోకి మలపడం దేశ వినాశనానికి దారితీయొచ్చు..

Related posts