December 11, 2019

Breaking News

ఊడుతున్న లక్షలాది ఉద్యోగాలు

ఊడుతున్న లక్షలాది ఉద్యోగాలు

‘జిఎస్‌టి-నోట్ల రద్దు’ లాంటి రెండు పెనుభూతాల వలన అత్యధికంగా పనులు కల్పించే చిన్న ఉత్పత్తి రంగం కునారిల్లడంతో ఉపాధిపై కోత పడింది.

మన దేశంలో ఆటోమొబైల్‌ పరిశ్రమలో 3.7 కోట్ల కార్మికులు పని చేస్తున్నారు. ఇప్పటికే 3 లక్షల ఉద్యోగాలకు కోత పడిందని, రాబోయే కొద్ది కాలంలో 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని ఆ పరిశ్రమ వర్గాలు ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది.

ఒక పెద్ద పరిశ్రమ ఉంటే దానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు ఉంటాయి. కొన్ని దానికి ముడి సరుకులు ఇచ్చేవి, మరికొన్ని విడి భాగాలను ఇచ్చేవి. పెద్ద పరిశ్రమలో డిమాండ్‌ తగ్గి ఈ అనుబంధ పరిశ్రమలు కూడా ప్రభావం పడి ఉద్యోగాలు పోతాయి. ఆటోమొబైల్‌ పరిశ్రమకు స్టీల్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, విడి భాగాలు, రబ్బర్‌ టైర్లు, ఇతర చిన్న పరిశ్రమలలో కూడా ఉద్యోగాలు పోతాయి.

గనుల తవ్వకాల రంగంలో రాబోయే కొన్ని నెలల్లో 2-3 లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. ఉత్పత్తి అయిన సరుకులు గుట్టలుగా పెరిగిపోతున్నాయి. వాటిని కొనే వారు లేరు.

స్టీల్‌ రంగం
స్టీల్‌, ఆటో రంగాలకు మధ్య వున్న అనుబంధం గురించి తెలిసిందే. స్టీల్‌ రంగం కీలకమైనది. డిమాండ్‌ లేకపోవడంతో ఈ రంగం కూడా సంక్షోభంలో ఇరుక్కున్నది. దాంతోపాటే ఆటో రంగం కూడా మునుగుతున్నది. ఇతర రంగాల పైనా ప్రభావం చూపుతోంది. రైల్వేలు, నిర్మాణ రంగం ఇంజనీరింగ్‌ రంగాలు విరివిగా స్టీల్‌ను వాడుతుంటాయి. ఈ రంగాలు కూడా సంక్షోభం లోనే వున్నాయి. టాటా స్టీల్‌ ప్రైవేటు రంగంలో స్టీల్‌ ఉత్పత్తి చేసే అతి పెద్ద కంపెనీ. రూ.4000 కోట్లతో కంపెనీ విస్తరించాలనుకున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని నిర్ణయించుకున్నది. దాంతో ఇక కొత్త ఉద్యోగాలు ఉండవు. జార్ఖండ్‌, ఒరిస్సాలలో స్టీల్‌ రంగానికి అనుబంధంగా ఉన్న జంషడ్‌పూర్‌ చుట్టుపక్కల చిన్న పరిశ్రమలలో ఇప్పటికే ఒక లక్ష ఉద్యోగాలు పోయాయి.

వస్త్ర పరిశ్రమ
ఇదివరలో లేని విధంగా ఈ రంగంలో భారీ సంక్షోభం నెలకొన్నది. 10 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఇది. ప్రస్తుతం 2/3 వంతు మాత్రమే ఉత్పత్తి జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే కొన్ని లక్షల మందికి ఉపాధి పోయే పరిస్థితి ఏర్పడింది. ‘పత్తి నూలు’కు దేశ, విదేశీ మార్కెట్‌లో డిమాండ్‌ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ఈ సంవత్సరం మంచి పంట వచ్చింది. దాదాపు రూ.80,000 కోట్ల విలువ చేస్తుందని భావిస్తున్న సందర్భంలో…ఈ సంక్షోభం రైతును దివాళ దిశగా నడిపిస్తున్నది. పైగా అనుబంధ పరిశ్రమలు కూడా కునారిల్లుతాయి. దాంతో ఉద్యోగాల కోత కూడా పెద్ద ఎత్తున ఉంటుంది.

రవాణా రంగం
పెద్ద లారీలే కాదు, చిన్న సరుకుల రవాణా వాహనాలు కూడా ఈ రంగంలో ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడంతో వీటి మీద కూడా తీవ్ర ప్రభావం పడింది. కోటి వాహనాలలో 60 శాతం వాహనాలు పని లేక నిలబడి ఉన్నాయని తెలుస్తున్నది. అంటే ఈ రంగంలో పని చేస్తున్న డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్కులు, లోడింగ్‌ అన్‌ లోడింగ్‌ చేసే వారిపై తీవ్ర ప్రభావం పడుతున్నది. దీనికి తోడుగా కొత్త మోటారు వాహన చట్టం పుణ్యమా అని ఏదైనా ట్రాఫిక్‌ చట్టాల ఉల్లంఘన జరిగితే విపరీతమైన పెనాల్టీల వడ్డన జరుగుతున్నది. చిన్న యజమానులను దెబ్బ కొట్టి పెద్ద పరిశ్రమలకు లాభం చేకూర్చేలా ఉన్నాయి.

నిర్మాణ రంగం, రియల్‌ ఎస్టేట్‌
రవాణా రంగంలో పని దొరకని వారికి గతంలో నిర్మాణ, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పని లభించేది. ఇప్పుడు అది కూడా గత కొన్ని సంవత్సరాలుగా సంక్షోభంలో ఉన్నది. నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంటు కౌన్సిల్‌ లెక్కల ప్రకారం ఇప్పటికే లక్ష మందికి ఉద్యోగాలు పోయాయి. రాబోయే కొన్ని నెలలు మరో ఐదు లక్షల మంది ఉద్యోగాలు పోవచ్చని అంచనా కడుతున్నది. ఈ రంగానికి అనుబంధంగా ఉన్న పరిశ్రమలు సిమెంట్‌, స్టీల్‌, పెయింట్లు, ఎలక్ట్రికల్‌ సామగ్రి, ఇందులో రవాణా చేసే వారు కూడా దెబ్బ తింటున్నారు. ఇక్కడ కూడా ఉద్యోగాలు పోతున్నాయి. ఎగుమతి ఆధారిత రంగమైన ఐ.టి మీద కూడా దెబ్బ పడింది. విదేశాల నుండి స్వదేశం నుండి ఆర్డర్లు లేకపోవడంతో ఐ.టి కంపెనీలు, ఐ.టి ఆధారిత సంస్థలు తమ ఉద్యోగులను తొలగించి తమ భారం తగ్గించుకుంటున్నారు.

రికార్డు స్థాయిలో నిరుద్యోగం
తాజా లెక్కల ప్రకారం ఆగస్టు 2019 చివరికి నిరుద్యోగ శాతం 8.7 శాతం చేరుకున్నది. ఇది గత కొన్ని సంవత్సరాల కంటే చాలా ఎక్కువ. కార్మిక శాఖ అధికారికంగా గత మే నెలలో 2017-18లో నిరుద్యోగం 6.1 శాతం ఉన్నట్లు, అది 45 సంవత్సరాలలోనే అత్యధికమని ప్రకటించింది. అంటే నిరుద్యోగం తారా స్థాయికి చేరుకున్నది. పురుషుల కంటే మహిళలలో నిరుద్యోగం, ఉద్యోగాలు పోవడం చాలా ఎక్కువగా ఉన్నది. ఈ వినాశకర విధానాల ప్రభావం మహిళల పైనే ఎక్కువగా పడుతోంది. ఉద్యోగాల కోత ఈ గణాంకాలలో కొంత వరకూ కనబడినా మొత్తం సమస్యను వివరించలేవు. ఎందుకంటే కొంత శాతం నిరుద్యోగం కనబడకుండా ఉండిపోతుంది. ఉదాహరణకు ఒక కార్మికుడిని ఒక నెల రోజులు మీ గ్రామానికి వెళ్లి రమ్మని తప్పుడు హామీ ఇచ్చి పంపితే దాన్ని నిరుద్యోగ జాబితాలో చూపెట్టరు. ఇలాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి.

విష వలయం
ప్రజల కొనుగోలు శక్తి బాగా పడిపోయింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా కాలంగా జీతాలు పెరగక పోవడం, రైతులకు రాబడి తగ్గిపోవడం, గతం నుంచి కొనసాగుతున్న నిరుద్యోగం, ‘జిఎస్‌టి-నోట్ల రద్దు’ లాంటి రెండు పెనుభూతాల వలన అత్యధికంగా పనులు కల్పించే చిన్న ఉత్పత్తి రంగం కునారిల్లడంతో ఉపాధిపై కోత పడింది. పనులు కల్పించి ప్రజల కొనుగోలు శక్తిని పెంచి సమస్యను పరిష్కరించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నించడంలేదు. ప్రజల ఉపాధి కల్పనకు వెచ్చించే మొత్తాన్ని తగ్గించాలని…ప్రయివేటు రంగాన్ని విస్తరించాలని ఒత్తిడి చేసే…నయా ఉదారవాద విధానాలపై దానికి వున్న గుడ్డి నిబద్ధతే అందుకు కారణం.

Related posts