February 26, 2020

ఉగాదిలోగా తరలింపు?

ఉగాదిలోగా తరలింపు?

పరిపాలనా రాజధానిని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలన్న జిఎన్‌రావు కమిటీ సిఫార్సుల అమలులో భాగంగా అమరావతి నుండి రాష్ట్ర సచివాలయాన్ని ఉగాదిలోగానే తరలించే అవకాశాలు ఉన్నాయి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డే ఈ దిశలో సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. తనకు సన్నిహితులైన ఒకరిద్దరు అధికారులతో ఆయన మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా తరలింపు ప్రక్రియను ప్రారంభించి, ఉగాది నాటికి పూర్తి చేయ‌డం మంచిదని అన్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితునిగా పేరున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు. సిఎం సూచనలతో ఇప్పటికే విశాఖలో కొన్ని భవనాలను గుర్తించారని, ఇతర ఏర్పాట్లు కూడా చకచకా జరుగతున్నాయని ఆయన చెప్పారు. తమకు కూడా ఇదే రకమైన సంకేతాలు ముఖ్యమంత్రి నుండి అందాయని మరో ఒకరిద్దరు ఉన్నతస్థాయి అధికారులు కూడా తెలిపారు. వీరిలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి కూడా ఉన్నారు. అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖకు తరలించడమే జగన్‌ ధ్యేయమని ఆయన అన్నారు. జిఎన్‌ రావు కమిటీ నివేదిక సమర్పించ డానికి ముందే శాసనసభ వేదికగా జగన్‌ ఈ విషయాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. అప్పట్లో తరలింపు అనివార్యమైతే జూన్ నుంచి ప్రారంభమయ్యే విద్యాసంవత్సరం లేదా, 2020 డిసెంబర్‌ నాటికి ఆ ప్రక్రియ ఉంటుందని అధికారులు భావించారు.
కానీ, శాసనసభలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అనంతర పరిణామాల నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగానే ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి శనివారం నాడు విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో పార్లమెరట్‌ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో పాటు ఒకేసారి విశాఖకు వందల కోట్ల రూపాయల పథకాలను ప్రకటించడం కూడా దీనినే ధృవీకరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శుక్రవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఇదే అంశంపై చర్చ జరగనుంది. తరలింపుతోపాటు, ప్రస్తుతం అమరావతిలో ఉన్న రైతుల నుంచి తీసుకున్న భూములను ఏమిచేయాలి, వారికి ఎలా నచ్చచెప్పాలన్న అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. ఇప్పటికే అమరావతిలో స్థలాలకు పాతిక లక్షల చొప్పున నగదు చెల్లించిన అఖిల భారత సర్వీసు అధికారులకు ఆ మొత్తాన్ని వెనక్కి ఇచ్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శనివారం నిర్వహించనున్న విశాఖ పర్యటనలో అనేక పథకాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులతో తరలింపు ఏర్పాట్లు, అందుబాటులో ఉన్న భవనాలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి.

Related posts