April 05, 2020

Breaking News

ఇది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కానేకాదు

ఇది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కానేకాదు

గౌతమీపుత్ర శాతకర్ణితోనే శాలివాహన శకం ప్రారంభమైందని, అప్పటి నుంచే తెలుగువారు ఉగాది పండుగను జరపుకోవడం మొదలైందని ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చిత్రంలో ఉన్నట్లు సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. అదే నిజమైతే చరిత్రను పూర్తిగా వక్రీకరించినట్లే. చరిత్రను హృద్యంగా, అందంగా తెరకెక్కించడానికి వాస్తవానికి కాల్పనికతను జోడించవచ్చు. కానీ వాస్తవాన్ని వక్రీకరించేలా అభూత కల్పనలు ఉండరాదు.

గౌతమీపుత్ర శాతకర్ణితోనే శాలివాహన శకం ప్రారంభం అయిందనడం చారిత్రక తప్పిదం. అసలు గౌతమీపుత్ర శాతకర్ణికి, శాలివాహనుడికి సంబంధమే లేదు. ఆంధ్ర శాతవాహనుల వంశానికి చెందిన 25వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి, శాలివాహనుల వంశానికి చెందిన రాజు శాలివాహనుడు.

శాతకర్ణి కలియుగంలో 2,669 నుంచి 2,694 వరకు అంటే క్రీస్తు పూర్వం 433 నుంచి 408 వరకు అంటే, దాదాపు పాతికేళ్లు ‘గిరి వ్రజం’ను రాజధాని చేసుకొని భారత దేశాన్ని పరిపాలించారు.

ఆ తర్వాత శాతకర్ణి చనిపోయాక దాదాపు 485 ఏళ్ల తర్వాత, అంటే క్రీస్తు శకం 78లో ప్రమర వంశానికి చెందిన శాలివాహనుడితో శాలివాహన శకం ప్రారంభమైంది. ఆయన ఉజ్జయనిని రాజధానిగా చేసుకొని భారత్‌ను పాలించారు. గిరివ్రజం ప్రస్తుతం బీహార్‌లో ఉండగా, ఉజ్జయిని మధ్యప్రదేశ్‌లో ఉంది. భారత్‌ను పాలించిన రాజవంశాల్లో శాతకర్ణిది ఎనిమిదవ వంశంకాగా, శాలివాహనుడిది పదవ వంశం. అలాంటప్పుడు శాతకర్ణితోనే శాలివాహనుల శకం ప్రారంభమైందని ఎలా చెబుతారు?

ఇక ఉగాది పండుగను దేశంలో ఒక్క తెలుగువారే జరుపుకోరు. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారు కూడా జరుపుకుంటారు. కలియుగం ప్రారంభానికే ముందు నుంచి ఉగాది పండుగను మనం జరుపుకుంటున్నట్లు చారిత్రక, ఇతిహాసక ఆధారాలు ఉన్నాయి. కలియగం నుంచి లెక్కేసుకున్నా చంద్రమానం ప్రకారం ఈ దుర్ముఖి నామ సంవత్సరానికి కలియుగం ప్రారంభమై 5,118 సంవత్సరాలు. గౌతమీపుత్ర శాతకర్ణి పాలన కలియుగంలో 2,669 ఏళ్లనాడు ప్రారంభమైనదంటే, ఆయన పాలనకన్నా దాదాపు 2,500 సంవత్సరాలకు పూర్వం నుంచే ఉగాది పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు. అలాంటప్పుడు శాతకర్ణితో ఉగాది పండుగ ఎలా ప్రారంభమవుతుంది?
గౌతమీపుత్ర శాతకర్ణి, శాలివాహనుడు వేర్వేరు కాలానికి చెందిన రాజులే అయినప్పటికీ దేశభక్తి కలిగిన వీరులు. వీరిద్దరికి వీరోచిత చరిత్ర ఉంది. వీరిద్దరిపైనా వేర్వేరుగా చారిత్రక సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంది. ఇద్దరి చరిత్రను కలిపినట్లయితే అది చరిత్రను వక్రీకరించినట్లే అవుతుంది.

సంస్కృతంలో బాస మహాకవి రాసిన ‘చారుదత్తా’కు శూద్రుడు రాసిన ‘మృత్య్సకటికం’ నాటకంలోని ఓ భాగాన్ని జోడించి ప్రముఖ దర్శకుడు గిరీష్‌ కర్ణాడ్‌ ‘ఉత్సవ్‌’ పేరిట నాటి సంస్కతిని కళ్లకు కట్టినట్లు తీశారు. చరిత్రను వక్రీకరించకుండా అలాంటి ప్రయోగం చేయవచ్చు. చరిత్రేదో, కల్పనేదే ప్రేక్షకులకు తెలిసేలా ఉండాలి. తప్పుదారి పట్టించేలా ఉండరాదు.

గౌతమీపుత్ర శాతకర్ణితోనే శాలివాహన శకం ప్రారంభమైందని, ఉగాది పండుగ ప్రారంభమైందని చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో అలా చెప్పారు. వారికి రాసిచ్చిన స్క్రిప్టులో లోపం వుండవచ్చు. కానీ సినిమాకు రాసిన స్క్రిప్టులో కూడా లోపం ఉంటే అది ఎంతమాత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కాదు.

శాతవాహనులు నిజానికి తెలుగువారు కాదు, వాళ్లు మహారాష్ట్రీయులు… తెలుగు ప్రాంతాలను కూడా పాలించిన మహారాష్ట్రీయులు శాతవాహన రాజుల క్రమంలో శాతకర్ణి 23వ వాడు… తన రాజధాని కోటిలింగాల కాదు, పైథాన్… శాతకర్ణి నాసిక్‌లో వేయించిన శాసనమే దానికి రుజువు…
ఈ సినిమాలో శాతకర్ణి గుర్రానికి జీనులు, రికాబులు ఉన్నాయి… కానీ శాతకర్ణి పాలనకాలానికి గుర్రాలకు జీనులు, రికాబుల వాడకమే ఆరంభం కాలేదు… సాంచీస్థూప అశ్వవాహనులు, అలెగ్జాండర్ నాణేలు చూసినా ఈ విషయం అర్థమవుతుంది…
నహాపన అనేవాడు ఓ శక వంశానికి చెందిన పాలకుడు… తను శాతవాహనులను ఓడించి, భరోచీ అనే ప్రఖ్యాత నౌకాశ్రయం సహా అన్ని విదేశీ వ్యాపారమార్గాలను స్వాధీనం చేసుకున్నాడు… తరువాత శాతకర్ణి నహాపనను తిరిగి ఓడించి, నహాపన నాణేలపై తన పేరు కొట్టించాడు… ఇవి కొన్ని కడలూరులో దొరికాయి…
ఈజిప్టుకు చెందిన పొలేమీ కొడుకు డెమిట్రస్… తను క్రీస్తుపూర్వం 312 కాలం వాడు… శాతకర్ణి క్రీస్తుశకం 78 కాలం వాడు… అసలు ఇద్దరికీ సంబంధం ఏముంది? తగాదా ఏముంది? ఇరువురు జీవించిన కాలంలో తేడా దాదాపు 400 ఏళ్లు…
క్రీస్తుశకం 78 నుంచి శకుల శకం ఆరంభమైందే తప్ప, అది శాతవాహన శకం కాదు… (మరి ఉగాదికీ, శాతకర్ణికీ సంబంధం ఏముంది..?)
శకరాజు రుద్రరామన్ పులమావిని ఓడించాడు… దీంతో శాతవాహనులు పశ్చిమ దక్కనుపై పట్టు కోల్పోయి, కోస్తాంధ్రకు పరిమితం కావల్సి వచ్చింది… అప్పుడు పులమావి ధరణికోటను తన రాజధానిగా చేసుకున్నాడు… అమరావతిలో దొరికిన శాసనం ఇదే చెబుతున్నది… అంటే పులమావి ఆంధ్రాకు ఓ రాజ్యవిస్తారకుడిలా కాదు, ఓ యోధుడిలా కాదు… శకుల ధాటికి పారిపోయి వచ్చినట్టే లెక్క…
శాతకర్ణి మగధను జయించి, డెక్కనులో కలిపేశాడు అనటానికి కూడా ఆధారాలు లేవు… ఒకవేళ నిజంగా అదే జరిగితే శాతకర్ణి తల్లి బాలశ్రీ నాసిక్ శాసనంలో గొప్పగా ప్రస్తావించేది… నిజానికి శాతవాహన సామ్రాజ్యం ఉత్తరాదికి విస్తరించలేదు… పైగా కేరళ, తమిళనాడు ప్రాంతాల్లోకి కూడా విస్తరించలేదు… ఆసేతు హిమాచలం అనేది పూర్తిగా అబద్ధం…

 

Related posts