April 05, 2020

Breaking News

ఇంద్ర‌ధ‌నుస్సును త‌ల‌పిస్తున్న ఆ ఏడు చిత్రాలు

ఇంద్ర‌ధ‌నుస్సును త‌ల‌పిస్తున్న ఆ ఏడు చిత్రాలు

తెలుగు సినిమా వ్యయం భారీగా పెరిగింది. ప్రేక్షకుల అంచనాలకు చేరువకావడానికి దర్శక, నిర్మాతలు దేనికీ వెనుకాడకుండా ఖర్చు పెడుతున్నారు. ఇతర భాషా చిత్రాలకు పోటీగా తెలుగు సినిమా తీయడానికి దర్శకులు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఆధునిక సాంకేతిక హంగులు చేర్చుకుంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సహకారం తీసుకుంటున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం తెలుగువారి నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకే పరిమితం. ఆ తర్వాత వ్యాపారం విస్తృతంగా పెరిగింది. విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు అక్కడి థియేటర్లలో సినిమాలు తిలకించేలా వ్యాపారాన్ని కొందరు వృద్ధి చేశారు. బాలీవుడ్‌ తర్వాత తమిళ సినిమాలకు విదేశాల్లో మార్కెట్‌ ఉంది. ఇప్పుడు వాటి సరసన టాలీవుడ్‌ చేరింది. స్టార్‌ హీరోలు నటించిన చిత్రాలు విదేశీ మార్కెట్‌లో పది కోట్ల వరకు కలక్ట్‌ చేయగలిగే స్థాయిలో ఉన్నాయంటే మార్కెట్‌ ఏ మేరకు పెరిగిందనేది అర్థం చేసుకోవచ్చు. ఇంకా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో సైతం నేరుగా తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అనువాద, శాటిలైట్‌, రీమేక్‌ హక్కులు ఇలా పలువిధాలుగా సినిమాకు వ్యాపారం జరుగుతోంది. ఇంతటి వ్యాపారం జరగాలంటే సినిమాలకు అనేక హంగులు ఉండాలి. ఎన్నో ప్రత్యేకతలు కనిపించాలి. హీరో పాత్ర పరిచయం మొదలు, యాక్షన్‌ సన్నివేశాలు వాటి చిత్రీకరణ జరిగే లొకేషన్‌, అగ్రనాయికలు, పేరున్న క్యారక్టర్‌ నటులు ఇలా అనేక అంశాల విషయంలో దర్శక, నిర్మాతలు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి కలుగుతుంది. మార్కెట్‌ వర్గాలు సైతం అలాంటి సినిమాలపై పెట్టుబడి పెట్టడానికి ముందుకువస్తారు. ఇప్పుడు తెలుగు సినిమా వ్యాపారం వంద కోట్ల వరకు చేరుకుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వంద కోట్లవ్యయంతో ‘రోబో ‘ తీశారని, 180 కోట్లతో ‘ఐ’ సినిమాలు తీస్తున్నారంటే ఆశ్చర్యపోయే రోజులు పోయాయి. ఎందుకంటే తెలుగు సినిమా నిర్మాణ వ్యయం కూడా వంద కోట్లకు చేరుకుందని నిర్మాతలు అంటున్నారు. కొత్తదనం కోసం చేస్తున్న ఖర్చు పరిమితులు దాటేసింది.అలా నిర్మించే నిర్మాతలకే హీరోలు డేట్స్‌ ఇస్తున్నారు. గతంలో భారీ పారితోషికం హీరోకు మాత్రమే ఇచ్చేవారు కానీ ఇప్పుడు డైరెక్టర్‌, హీరోయిన్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌, ఫైట్‌ మాస్టర్‌, కెమెరామెన్‌ సైతం డిమాండ్‌ చేస్తున్నారు. దర్శకులు ఆరు నుండి పదికోట్లు పారితోషికం డిమాండ్‌ చేస్తున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ ఒక్కో సినిమాకు రెండున్నర కోట్లు తీసుకుంటున్నారట. హీరోయిన్లు ఒకటిన్నర కోటి డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. బ్రహ్మానందం వంటి హాస్య నటుడు సైతం రోజుకు మూడు లక్షలు, సినిమాకు దాదాపు కోటి తీసుకుంటున్నారు. ఇటీవలే విడుదలైన పవర్‌ సినిమా యాక్షన్‌ సన్నివేశాల కోసం రెండు కోట్లు ఖర్చు పెట్టారట. ఇలాంటి ఖర్చులు ప్రేక్షకులను ఆకర్షించడం కోసమే. హీరోలు సైతం గతంలోలాగా ఆడుతూ పాడుతూ నటించడానికి కుదరడం లేదు. ఒక్కో సినిమాపై కోట్లాది రూపాయల పెట్టుబడి, వేలాది మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని వారికి తెలుసు. అలాగే శ్రమించకుంటే విజయం దక్కదని అనుభవపూర్వకంగా తెలుసు. హీరో శ్రమను ప్రేక్షకులు తప్పకుండా గుర్తిస్తారు. అలాంటి వారికే విజయం దక్కుతుంది. హిందీలో వంద, రెండు వందలు, మూడు వందల కోట్లు వసూలు చేస్తున్న సినిమాలున్నాయి. తెలుగు సినిమా కూడా వంద కోట్ల క్లబ్‌లో చేరే సయమం ఇంకా ఎంతోదూరం లేదని అననుభవజ్ఞులుఅంటున్నారు. ఇప్పుడు ఒక స్టార్‌ హీరో సినిమా నిర్మాణానికి వంద కోట్ల వరకు వ్యయం చేయడానికి నిర్మాత వెనుకాడడం లేదు. మార్కెటింగ్‌ గ్యారంటీ ఉంటుంది. విడుదలైన తొలివారంలోనే ఓపనింగ్స్‌తో పెట్టుబడి వచ్చేస్తుందనే నమ్మకం ఉంది. గతవారం విడుదలైన ఆగడు చిత్రం రెండు వేల థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమా కోసం యాభై కోట్ల ఖర్చు పెట్టారని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. నిర్మాణంలో ఉన్న అగ్రహీరోల చిత్రాలు, వాటి కాంబినేషన్స్‌ ఒకసారి పరిశీలిద్దాం.

మహేష్‌బాబు సినిమాకు భారీ బడ్జెట్‌!

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు సినిమా అంటే నిర్మాతలకు కాసులపంట. సినిమా కొనుగోలుదారులు సైతం మహేష్‌ సినిమాను కొనడానికి వెనుకాడరు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే మహేష్‌ నటించిన పోకిరి ఆరోజుల్లో టాప్‌ గ్రాసర్‌. ఆ తర్వాత దూకుడు హిట్‌తో తన రికార్డ్‌ తానే బ్రేక్‌ చేశారు. వాటి తర్వాత వచ్చిన చిత్రాలు సైతం మంచి కలక్షన్లు రాబట్టాయి. ఇటీవలే విడుదలైన ఆగడు సైతం కమర్షియల్‌ హిట్‌ సాధించింది. మహేష్‌ సినిమా అంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానికి తగినట్టు తీయడానికి దర్శకులు ప్లాన్‌ చేస్తుంటారు. ఆగడు తర్వాత మహేష్‌ నటిస్తున్న చిత్రం నిర్మాణంలో ఉంది. మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది రెండవ సినిమా. శ్రుతిహసన్‌ నాయికగా నటిస్తోంది. మైత్రి మూవీస్‌ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఆగడు సినిమాకంటే దీనికిఎక్కువ ఖర్చు అవుతుందని తెలిసింది. మహేష్‌బాబుకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా సుమారు 60 కోట్ల బడ్జెట్‌తో తీసే అవకాశాలున్నాయి. మహేష్‌ ఇమేజ్‌తో పాటుగా మిర్చి వంటి సూపర్‌హిట్‌ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ దర్శకుడు కావడం అదనపు ఆకర్షణ. ఈ కారణంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండేఅవకాశం ఉంది. ఇప్పటికే ప్రాంతాలవారి బిజినెస్‌కు డిమాండ్‌ పెరిగింది.

గోపాల గోపాల కాంబినేషన్‌ క్రేజ్‌

పవన్‌కల్యాణ్‌ అంటే యువతలో క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. గబ్బర్‌సింగ్‌, అత్తారింటికి దారేది చిత్రాల విజయం, జనసేన పార్టీ నేతగా ప్రచారం ఇవన్నీ పవర్‌స్టార్‌ ఇమేజ్‌ను మరింత పెంచాయి. గబ్బర్‌సింగ్‌ 2కు లాంఛనంగా శ్రీకారం జరిగినా రెగ్యులర్‌ షూటింగ్‌ మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. దానికంటే ముందుగానే గోపాల గోపాల షూటింగ్‌ చేస్తున్నారు. దృశ్యం సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన వెంకటేశ్‌, పవన్‌కల్యాణ్‌ కలిసి నటిస్తున్న చిత్రం గోపాల గోపాల. హిందీలో వచ్చిన ఓ మైగాడ్‌ సినిమాకు ఇది రీమేక్‌. ఇది మల్టిdస్టారర్‌ సినిమా కాదు. మల్టిd హీరోల చిత్రం. హీరోల ఇద్దరి అనుభవంలో తేడాఉంది. డి.సురేష్‌బాబు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిషోర్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాంబినేషన్‌ సినిమా కావడం, కథాపరంగా లొకేషన్స్‌ డిమాండ్‌ చేయకపోవడం, యాక్షన్‌ సన్నివేశాలు తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల ఈ చిత్రానికి చేసే వ్యయం తక్కువగానే ఉంటుందని యూనిట్‌ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. సురేష్‌ బాబు నిర్మాత అంటే ఆయన బడ్జెట్‌ విషయంలో కోత విధిస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. కేవలం కాంబినేషన్‌ చూసి బయ్యర్లు కొనుగోలు చేయాల్సిందే. నిర్మాణంలో ఉండి అంచనాలున్న చిత్రాల్లో గోపాల గోపాల కూడా ఉంది.

గోవిందుడు ఖరీదైనవాడే

దాదాపు సగం సినిమా పూర్తయింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఆ తర్వాత చిన్న డౌట్‌. ఒక ప్రధాన పాత్రకు అనుకున్ననటుడి ఎంపికసరైంది కాదని అనుమానం. మరో నటుడితో చేయాలంటే ఖర్చు అవుతుంది. అయినప్పటికీ నిర్మాత వెనుకడుకు వేయలేదు. సై అన్నాడు. ఈ ఉదాహారణ చాలు గోవిందుడు అందరివాడేలే సినిమా కోసం చేస్తున్న బడ్జెట్‌ గురించి చెప్పడానికి. గట్స్‌ ఉన్న నిర్మాత బండ్ల గణష్‌ ఈ చిత్రానికి నిర్మాత. కృష్ణవంశీ దర్శకుడు. రామ్‌చరణ్‌, కాజల్‌ జంటగా నటిస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌, శ్రీకాంత్‌ కూడా ఉన్నారు. కృష్ణవంశీ సినిమా అంటేనే భారీతనం. ఆయన త్వరగా కాంప్రమైజ్‌ అవరు. ఆర్టిస్టుల నుండి పర్‌ఫార్మెన్స్‌ రాబట్టడానికి వారిని హింసిస్తారని కూడా అంటారు. ఇలాంటి హంగులున్న ఈ చిత్రం అక్టోబర్‌ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇంత వరకు చేసిన వ్యయం, రీషూట్‌ అన్నీ కలుపుకుంటే బడ్జెట్‌ యాభై కోట్ల వరకు ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ జరిగిన లొకేషన్స్‌ జాతరని తలపింపజేశాయి. హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న చరణ్‌కు మరో వైవిధ్యమైన చిత్రం అవుతుందని సన్నిహితులు అంచనావేస్తున్నారు. విజయదశమికి వస్తున్న ఈ చిత్రానికి ఫ్యాన్సీ ఫిగర్స్‌తో బిజినెస్‌ జరిగింది.

బాహుబలి భలే

తెలుగులో అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమాలు నిర్మించే దర్శకులు ఉన్నారు. ఇంతవరకు ఇలాంటి సినిమాలు తీయాలంటే అధికవ్యయం అవుతుందనే కారణంతో వెనకడుగువేశారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్‌ విస్తృతం కావడంతో వారికి ధైర్యం వచ్చింది. ఈగ వంటి గ్రాఫిక్‌ చిత్రాన్ని తీసి విదేశీ సినీ పండితుల చేత అభినందనలు అందుకున్న ఎస్‌.ఎస్‌. రాజమౌళి తాజా చిత్రం బాహుబలి. రెండేళ్ళ సుదీర్ఘ నిర్మాణం. రెండు భాగాలుగా విడుదల చేయాలనే ప్రయత్నం. దర్శకుడి మీద ఉన్న పూర్తి విశ్వాసంతో హీరో ప్రభాస్‌ పూర్తి సమయం కేటాయించారు. తన కెరీర్‌లో, తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే చిత్రం అవుతుందనే నమ్మకమే కారణం. బాహుబలి నిజానికి తెలుగు సినిమా అయినప్పటికీ దాదాపు 37 భాషల్లో ఈ సినిమా విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరే ఇతర భాషలో రానటువంటి కాన్సెప్ట్‌తో రాజమౌళి చెక్కుతున్న బాహుబలిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ సినిమా కోసంచేస్తున్న వ్యయం గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. తెలుగులో తొలి వంద కోట్ల బడ్జెట్‌ సినిమా అని అంటున్నారు. అంకెల విషయాన్ని పక్కనబెడితే చరిత్ర సృష్టించే సినిమా ఇది.

జూనియర్‌కు అగ్నిపరీక్ష

జూ.ఎన్టీఆర్‌ హిట్‌కోసం ఎదురుచూస్తున్నారు. అదుర్స్‌ తర్వాత సక్సెస్‌దూరమైంది. కాంబినేషన్‌ సినిమాలు చేసినా కలిసిరావడం లేదు. తాజాగా రభస సైతం నిరాశపరిచింది. ఇప్పుడు జూనియర్‌ చూపు పూరి సినిమాపైనే ఉంది.వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం నిర్మాణంలో ఉంది. పూరి సినిమా అంటే కమర్షియల్‌ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఆయన సినిమాలో హీరో సహజత్వానికి దగ్గరగా కనిపిస్తాడు. ఈ నమ్మకమే ఈ కాంబినేషన్‌కు నాంది పలికింది. జూ.ఎన్టీఆర్‌ గతంలో మాదిరిగా శ్రమించడం లేదనే కామెంట్స్‌ పరిశ్రమలో వినిపిస్తున్నాయి. కెరీర్‌ ప్రారంభంలో చేసి కృషి ఇప్పుడు లేదని వారంటున్నారు. అందుకే సక్సెస్‌కు దూరమయ్యాడని సన్నిహితులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రావాలా తర్వాత జూ.ఎన్టీఆర్‌, పూరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. నాయికగా కాజల్‌ నటిస్తోంది. బృందావనంలో ఈజంట కలిసి నటించింది. అదే సెంటిమెంట్‌ ఈ సినిమాకు రిపీట్‌ అయింది. బాద్‌షా తర్వాత బండ్ల గణష్‌ జూ.ఎన్టీఆర్‌తో తీస్తున్నచిత్రమిది. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ పూరి, కాజల్‌. కాంబినేష్‌ వల్ల బిజినెస్‌ క్రేజ్‌ రావాల్సిందే.

రుద్రమదేవి సాహసం

దర్శకుడు గుణశేఖర్‌ తలకిమించిన భారం ఎత్తుకున్నారు. తానే నిర్మాతగా తీస్తున్న రుద్రమదేవి కోసం చాలా సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. చారిత్రకనేపథ్యం ఉన్న ఈ చిత్ర నిర్మాణం కోసం భారీవ్యయం చేస్తున్నారు. టైటిల్‌ పాత్రని అనుష్క పోషిస్తోంది. కాకతీయ సామ్రాజ్యం నేపథ్యంలో తీస్తున్న స్టీరియోఫోనిట్‌ త్రిడి చిత్రమిది. విదేశీ సాంకేతికనిపుణులు పనిచేస్తున్నారు. దీనికోసం భారీ సెట్స్‌ వేశారు. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన దుస్తులు, సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితంనాటి జీవనవిధానం ఈ చిత్రానికి ప్రత్యేకం. గుణశేఖర్‌ మీద ఉన్న అభిమానంతో ఆర్టిస్టులు, సాంకేతికనిపుణులు పూర్తి సహకారాన్ని అందించారు. అల్లు అర్జున్‌ గోన గన్నారెడ్డి పాత్రని పోషించారు. ఆయన పారితోషికం తీసుకోకుండా నటించారని అంటున్నారు. తెలుగుతో పాటుగా అన్ని భాషల్లో విడుదల చేయడానికి అవకాశం ఉన్నటువంటి చిత్రమిది. అందుకోసం వ్యయం భారీగానే చేస్తున్నారు. యూనిట్‌ వర్గాల తెలిసిన సమాచారం ప్రకారం వ్యయం యాభై కోట్లు దాటిందని అంటున్నారు. ఇందులో సింహభాగం పారితోషికాలు, సెట్స్‌, దుస్తులు, ఆర్నమెంట్స్‌, సాంకేతికనిపుణులకే చెందుతాయి. తెలుగులో నిర్మాణంలో ఉన్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో రుద్రమదేవి కూడా ఉంది.

జులాయి రీపీట్‌

సినిమా హిట్‌ అయినా రికవరి కాలేదని బయ్యర్లు జులాయి చిత్రం గురించి చెప్పారు. సరదా సినిమాను చక్కగా తీశారు. ప్రేక్షకులు ఎంజాయ్‌ చేశారు. అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ తొలి చిత్రమిది. మళ్లిd ఈ కాంబినేషన్‌ కలిసింది. రేసుగుర్రం హిట్‌తో జోరు మీదున్న అల్లు అర్జున్‌ నటిస్తున్న ఒకే ఒక చిత్రమిది. లాంఛనంగా షూటింగ్‌ ప్రారంభించినా రెగ్యులర్‌ షూటింగ్‌ కోసం చాలాకాలం ఆగింది. అర్జున్‌ను ఎలా చూపించాలో త్రివిక్రమ్‌కు బాగా తెలుసు. సక్సెస్‌ గ్యారంటీ అని అందరి నమ్మకం. ఇందులో ముగ్గురు నాయికలు నటిస్తారు. అంచనాల మధ్య రూపొందే ఈ చిత్రం కోసం భారీగానే ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే అంటే ప్రాధమికంగానే భారీ బడ్జెట్‌ సినిమా అవుతుందని తేలిందని యూనిట్‌ అంటోంది. కనీసం ఆరు నెలలు నిర్మాణం జరుపుకుంటుంది.

 

Related posts