April 05, 2020

Breaking News

అమెరికాలోనూ కీలక పదవుల్లో ముస్లింలు

అమెరికాలోనూ కీలక పదవుల్లో ముస్లింలు

ముస్లిములకు చేరువయ్యేందుకు, వారిని ఆకట్టుకునేందుకు, అగ్రరాజ్యమైన అమెరికా పట్ల వారిలో ఉన్న అపోహలను, దురభిప్రాయాలను తొలగించేందుకు అధ్యక్షుడు ఒబామా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. పదవి చేపట్టినప్పటి నుంచి ఈ విషయమై దృష్టి సారించిన అధ్యక్షుడు ఎంతోకొంత చిత్తశుద్ధిని చాటుతున్నారు. చొరవ చూపుతున్నారు. చేయవలసిందంతా చేస్తున్నారు. నిజాయతీగా వ్యవహరిస్తున్నారు. ఈజిప్టు రాజధాని కైరోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ దిశగా తొలిసారి ముందడుగు వేశారు. 2009 జూన్లో కైరోలో జరిగిన ఓ సదస్సులో చేసిన ప్రసంగం ద్వారా ముస్లిం సమాజాన్ని మెప్పించేందుకు ప్రయత్నించారు. ఇస్లాంకు అమెరికా ఎంతమాత్రం వ్యతిరేకం కాదని ఈ భావన విడనాడి అమెరికా అభివృద్ధిలో, ప్రపంచదేశాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఆ సందర్భంగా ఒబామా కోరారు. నాటి ప్రసంగం అంతర్జాతీయంగా ముస్లిం సమాజంలో కొంతవరకు ఆలోచన కలిగించింది. తాజాగా మరో అడుగు ముందుకు వేశారు. ముస్లింల పట్ల తనకు గల అభిమానాన్ని స్పష్టంగా చాటుకున్నారు. అమెరికా పాలన యంత్రాంగంలోని కీలక పదవులకు ముగ్గురు ముస్లింలను నియమించడం ద్వారా ఒబామా తాను మాటలకే పరిమితమయ్యే వ్యక్తిని కానని, ఆచరణ వాదినని, ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వ్యక్తినని రుజువు చేసుకున్నారు. అధ్యక్షుడు నియమించిన ముగ్గురూ భారత సంతతికి చెందిన వారే కావడం గమనార్హం. ఇప్పటికే పలువురు ఇండియన్-అమెరికన్లను తన పాలకవర్గంలోకి తీసుకున్న ఆయన తాజా నియామకాల ద్వారా పరోక్షంగా భారత్ అంటే తనకు గల అభిమానాన్ని చాటుకున్నారు.

అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన 57 ఇస్లాం దేశాలు సభ్యదేశాలుగా ఉన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఒ.ఐ.సి)కు అమెరికా ప్రత్యేక దూతగా భారత సంతతికి చెందిన రషద్ హుస్సేన్ ను నియమించారు. ప్రస్తుతం ఒబామా పాలకవర్గంలో సహాయకుడిగా ఉన్న హుస్సేన్ తల్లితండ్రులు బీహార్ నుంచి అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. హుస్సేన్ సమర్థుడైన న్యాయవాది. ఒ.ఐ.సి. సభ్యదేశాలతో సత్సంబంధాలను కొనసాగించడం, అపోహలను తొలగించడం, అమెరికాతో ఆయా దేశాలు చేరువయ్యేందుకు మార్గాలను అన్వేషించడం హుస్సే్ బాధ్యతల్లో ముఖ్యమైనవి. హుస్సేన్ ఈ బాధ్యతల నిర్వహణలో ఇప్పటికే తలమునకలవుతున్నారు. అమెరికా పట్ల అరబ్ దేశాలకు గల అపోహలను తొలగించేందుకు శక్తివంచన లేకుండా ప్రయతిస్నానని, తన ప్రయత్నం విజయవంతం కూడా అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. హుస్సేన్ తో పాటు ఫరా పండిట్, ఇస్లామ్ సిద్ధికిని కూడా కీలకస్థానాల్లో ఒబామా నియమించారు. ఫరా పండిట్ ను ముస్లిం సమాజం ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. శ్రీనగర్ లో జన్మించిన ఫరా పండిట్ ఇటీవల భారత్ ను సందర్శించారు. భారత్లో సున్నితమైన, సరిహద్దు రాష్ట్రమైన జమ్ముకాశ్మీర్ కు చెందిన ఆయనకు కాశ్మీర్ సమస్యపై కొత్తగా చెప్పవలసిందేమీ లేదు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడిన డాక్టర్ ఇస్లాం సిద్ధికి వాషింగ్టన్ ముఖ్య వ్యవసాయ సలహాదారుగా నియమితులయ్యారు. వ్యవసాయరంగంలో మరింత ప్రగతిని సాధించేందుకు, నూతన ఆవిష్కరణల నిమిత్తం డాక్టర్ ఇస్లాం సిద్ధికిని ప్రత్యేకంగా తీసుకువచ్చారు. మొత్తం వ్యవసాయరంగం ఆటుపోట్లు ఎదుర్కొంటున్న తరుణంలో సిద్ధికి నియామకం సత్ఫలితాలను ఇస్తుందన్నది అధ్యక్షుడి నమ్మకం. అయితే సిద్ధికి నియామకాన్ని సెనెట్ ఇంకా ఆమోదించాల్సి ఉంది. రషీద్, ఫరా పండిట్, సిద్ధికి నియామకాల ద్వారా అంతర్జాతీయ ముస్లిం సమాజానికి అధ్యక్షుడు ఒబామా సరైన సంకేతాలే పంపించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related posts