September 25, 2018

Breaking News

సికింద్రాబాద్ పార్లమెంట్ బరిలో దానం

సికింద్రాబాద్ పార్లమెంట్ బరిలో దానం

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారం కోసం ఎత్తులు వేస్తున్న కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ (జీహెచ్ సీసీ) మాజీ అధ్యక్షుడు – మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీకి రాజీనామా చేశారు. ఇందుకు కీలక కారణం ఉందని తెలుస్తోంది. మీడియాతో దానం నాగేందర్ మాట్లాడుతూ టీఆర్ ఎస్ పార్టీలో చేరే విషయంపై స్పష్టత ఇచ్చారు. గులాబీ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. కేసీఆర్ పథకాలను చూసి పలువురు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. గొల్లకురుమలకు గొర్రెల పంపిణీ – మత్స్యకారులకు చేపల పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. రైతుబంధు – రైతుబీమాపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందన్నారు. షాదీముబారక్ – కల్యాణలక్ష్మీ పథకాలు బడుగు బలహీన కులాల్లో వెలుగులు నింపుతుందని దానం పేర్కొన్నారు. టీఆర్ ఎస్ పార్టీలో చేరిన తర్వాత పదవులను ఆశించను. ఏ పని అప్పజెప్పినా బీసీల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభకు టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆ మేరకు ఆ పార్టీ నాయకత్వంతో నాగేందర్ మాట్లాడుకునే ఉంటారని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. అప్పుడు సికింద్రాబాద్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ కూడా బరిలో ఉంటారు.

Related posts