November 17, 2018

Breaking News

సర్రోగసి ఆడపిల్లల సంఖ్య తగ్గడానికి ఓ కారణమా

సర్రోగసి ఆడపిల్లల సంఖ్య తగ్గడానికి ఓ కారణమా

8amma kadupuసర్రోగసి కూడా ఓ కారణంగా నిలుస్తోందని నిపుణులు విశే్లషిస్తున్నారు. బిడ్డలను కని ఇస్తే- భారీగా డబ్బు ఇస్తామని నమ్మించి మహిళలను అక్రమంగా తరలిస్తున్న ఉదంతాలు సైతం చోటు
చేసుకుంటున్నాయి. బిడ్డలను కని ఇస్తున్న మహిళల వివరాలను ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదు చేయడం లేదు.
సంతాన లేమితో బాధపడే వారి కోసం ‘అద్దె గర్భం’ (సర్రోగసి) పద్ధతిలో శిశువులను కంటున్న మహిళల ఆరోగ్య హక్కులను పట్టించుకునే నాథుడే లేడని తాజా అధ్యయనంలో తేటతెల్లమైంది. ‘అద్దె గర్భం’ ద్వారా పిల్లలు కనడం చివరకు ఓ వ్యాపార సంస్కృతిగా విషమిస్తోందని దేశ వ్యాప్తంగా సామాజిక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అవయవ దానానికి నిర్ధిష్టమైన చట్టాలున్నా, ‘సర్రోగసి’కి సంబంధించి స్పష్టమైన విధానం లేకపోవడంతో పలు విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముంబై, ఢిల్లీ, ఆనంద్ , సూరత్ వంటి నగరాల్లో ఎంతోమంది పేద మహిళలు ‘సర్రోగసి’ ద్వారా శిశువులను కనేందుకు సిద్ధపడుతున్నారని సర్వేలో వెల్లడైంది. సంతానం లేని దంపతులు పిల్లల కోసం ఎంత డబ్బయినా ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నందున పలు ప్రైవేటు ఆసుపత్రులకు, దళారులకు ‘సర్రోగసి’ విధానం కాసుల వర్షం కురిపిస్తోంది. పిల్లలను కనేందుకు సుముఖత చూపే పేద మహిళల కోసం దళారులు గ్రామాల్లో గాలిస్తూ, వారికి డబ్బు ఎరవేసి ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు ఢిల్లీకి చెందిన ‘సామాజిక అధ్యయన కేంద్రం’ జరిపిన అధ్యయనంలో తేలింది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సౌజన్యంతో దేశంలోని పలు నగరాల్లో ఈ సర్వే నిర్వహించగా పలు ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. ‘సర్రోగసి’ పద్ధతిలో పిల్లలను కనడం నేడు ఓ పరిశ్రమగా విస్తరించిందని, డబ్బు కోసం శిశువులను కంటున్న మహిళల ఆరోగ్య పరిస్థితులు, వారి హక్కుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని సామాజిక అధ్యయన కేంద్రం ప్రతినిధులు చెబుతున్నారు. ఓ గ్రామీణ మహిళ ‘సర్రోగసి’ ద్వారా ఇప్పటికే అయిదుగురు బిడ్డలకు వరసగా జన్మనిచ్చిందని, ఆమెకు ఇదివరకే నలుగురు పిల్లలున్నారని అధ్యయన కేంద్రం డైరెక్టర్ రంజనా కుమారి చెబుతున్నారు. మొత్తం తొమ్మిది మంది పిల్లలను కన్న ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా ఉందని ఆమె వివరించారు.
‘అద్దె గర్భం’ ద్వారా మగ పిల్లలను పొందేందుకు ఎంతోమంది దంపతులు ఇష్టపడుతున్నారు. దీంతో ‘సర్రోగసి’కి సిద్ధపడిన మహిళలు గర్భం దాల్చితే- లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడం, ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే అక్రమ పద్ధతుల్లో గర్భస్రావాలు చేయించడం పరిపాటిగా మారింది. ప్రమాదకర గర్భస్రావాల ఫలితంగా ఎంతోమంది మహిళలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆడపిల్లల సంఖ్య తగ్గడానికి ‘సర్రోగసి’ కూడా ఓ కారణంగా నిలుస్తోందని నిపుణులు విశే్లషిస్తున్నారు. బిడ్డలను కని ఇస్తే- భారీగా డబ్బు ఇస్తామని నమ్మించి మహిళలను అక్రమంగా తరలిస్తున్న ఉదంతాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. బిడ్డలను కని ఇస్తున్న మహిళల వివరాలను ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదు చేయడం లేదు. కింది నుంచి పైదాకా అన్నీ అక్రమాలే కావడంతో మహిళలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంచడం లేదు. ఎంతమంది మహిళలు ఎన్నిసార్లు గర్భం దాలుస్తున్నారో వంటి వివరాలను ఏ ఆసుపత్రుల్లోనూ నమోదు చేయడం లేదు. దళారులు ఇచ్చే డబ్బు కోసం ఆరాటపడుతున్న వైద్యులు అన్ని విషయాలను గోప్యంగానే ఉంచుతున్నారు. సరైన నిబంధనలు లేనందున ఆరోగ్య శాఖ అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. అధికారుల నిస్సహాయత ఫలితంగా లింగ నిర్థారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లు, గర్భస్రావాలు చేసే ఆసుపత్రుల్లో అక్రమాలకు అంతులేకుండా పోతోందని సర్వేలో తేలింది.
పేదరికమే కారణం..
‘సర్రోగసి’ ద్వారా బిడ్డలను కని ఇతరులకు ఇచ్చేందుకు ఎంతోమంది మహిళలు సిద్ధపడుతున్నారంటే- పేదరికమే ఓ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆరోగ్య విషయాలపై అవగాహన లేకుండానే గర్భం దాల్చినట్లు ఆనంద్ (గుజరాత్)లో ‘సర్రోగసి’కి సిద్ధపడిన వారిలో 51.7 శాతం మంది మహిళలు సర్వేలో తెలిపారు. పేదరికం వల్ల తాము పిల్లలను కని ఇచ్చేందుకు సుముఖత చూపామని సూరత్‌లో 88.6 శాతం మంది, ఆనంద్‌లో 86.7 శాతం మంది, ముంబైలో 46.9 శాతం మంది చెప్పారు. ఏ ఉపాధి లేక ఈ పద్ధతిని ఆశ్రయించినట్లు సూరత్‌లో 91.4 శాతం మంది, ఢిల్లీలో 32 శాతం మంది వివరించారు. తమ పిల్లల చదువు కోసం ఇందుకు సిద్ధపడినట్లు ఢిల్లీలో 15.82 శాతం మంది, ముంబైలో 23.46 శాతం మంది తెలిపారు. దళారుల ద్వారా ‘సర్రోగసి’కి అంగీకరించినట్లు ఢిల్లీలో 26.56 శాతం మంది, ముంబైలో 17.,2 శాతం మంది చెప్పారు. కాగా, బిడ్డలను కని ఇచ్చేందుకు చట్టపరమైన ఒప్పందాలు చేసుకుంటున్న వారి సంఖ్య చాలా స్వల్పమే. గర్భం దాల్చినప్పటి నుంచి శిశువును కని ఇచ్చేంత వరకూ తాము అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నా దళారులు డబ్బు సరిగా చెల్లించడం లేదని కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం డబ్బు చెల్లించకుండా కొందరు దళారులు మోసం చేస్తున్నట్లు కూడా అధ్యయనంలో తేలింది. వంచించిన దళారులపై ఫిర్యాదు చేసే అవకాశం లేనందున చాలామంది మహిళలు వౌనంగా ఉండిపోతున్నారు. చట్టపరమైన ఒప్పందం చేసుకోవాలనే విషయమై చాలామంది మహిళల్లో ఎలాంటి అవగాహన లేనందున దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చట్టపరమైన విషయాలు తమకు తెలియని ఢిల్లీలో 88 శాతం మంది, ముంబైలో 76 శాతం మంది తెలిపారు. ఢిల్లీ, ముంబైల్లో జరిపిన సర్వే ప్రకారం- వివాహిత మహిళల్లో 82 శాతం మంది, విడాకులు తీసుకున్న వారిలో 12 శాతం మంది, ఒంటరి మహిళల్లో 14 శాతం మంది, భర్తకు దూరంగా ఉంటున్న వారిలో 6 శాతం మంది మహిళలు ఆర్థిక అవసరాల కోసం ‘సర్రోగసి’కి సుముఖత చూపుతున్నట్లు తేలింది. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఇదొక మార్గమని దళారులు ప్రచారం చేస్తూ పేద మహిళలకు ఎర వేస్తున్నారు. డబ్బు సంపాదించేందుకు ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం విచారకరమని సామాజిక ఉద్యమకారులు ‘సర్రోగసి’ ధోరణులను నిరసిస్తున్నారు. పిల్లల భవిష్యత్ బాగుండాలంటే ఈ పద్ధతిని ఆశ్రయించడంలో తప్పులేదని కొన్ని చోట్ల కుటుంబ సభ్యులే మహిళలను ప్రోత్సహిస్తున్నారు.
పేదరికం, అవిద్య, కుటుంబ పరిస్థితుల వల్ల ఇతరుల కోసం పిల్లలను కనేందుకు సిద్ధపడుతున్న మహిళల ఆరోగ్య పరిస్థితులు విషమిస్తున్నా చట్టపరంగా ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళారీ వ్యవస్థను అంతం చేసేందుకు, ఆసుపత్రులపై నిఘా ఉంచేందుకు ‘సర్రోగసి’ చట్టాన్ని సవరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Related posts