August 20, 2019

Breaking News

వలసలు-వాస్తవాలు

వలసలు-వాస్తవాలు

                   ”భద్రత, గౌరవమర్యాదలు, మెరుగైన భవి ష్యత్తు కోసం మానవ అభిలాషల ఆచరణే వలస. అది సామాజిక బంధంలో, మానవ కుటుంబంలో భాగం. ప్రపంచశాంతి, శ్రేయస్సు, సమానావకా శాలు, గౌరవం కోసం వలసదారుల భద్రత, క్రమబద్ధీకరణ లపై అంతర్జాతీయ సమాజాలు దృష్టి సారించాలి” అని ఐక్య రాజ్యసమితి (ఐరాస) పూర్వ ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ 2016, డిసెంబర్‌ 18 ‘అంత ర్జాతీయ వలసదారుల దినో త్సవం’ రోజున నివేదించారు. శరణార్థులు, వలస దారుల (ప్రత్యేకించి ఏడు ముస్లిం దేశాల)పై జనవరి 27న అమె రికా అధ్యక్షుడు ట్రంప్‌ నిషేధం విధించి తన ట్రంప్‌ (గెలుపు చీటీ)ను అమలు చేశారు. 2017 ఫిబ్రవరి 1న ఐరాస ప్రస్తుత ప్రధాన కార్యదర్శి అంటానియో గుటెరస్‌ ఈ నిషేధాన్ని ఎత్తివేయాలన్నారు.

వలసలు
కష్టాలనధిగమించి సుఖమయ జీవితాలను పొందడానికి మానవుడు అవలంబించిన ధైర్యసాహసాల చరిత్రే వలసలు. సౌకర్యాలున్న చోటే జీవరాశులు నివసిస్తాయి. మనుషులు దీనికి మినహాయింపు కాదు. నాగరి కతలన్నీ నదీ పరీవాహక ప్రాంతాలలో వికసించడానికీ కారణమిదే. దేశ దేశాల పక్షులు అననుకూల వాతావరణ కాలాలలో అనుకూలమైన సుదూ ర ప్రాంతాలకు వలస వచ్చేదిందుకే. శతాబ్దాల నుంచి ఏదో ఒక రూపంలో వలసలు కొనసాగాయి. వేట జీవనాధారంగా జీవించిన దేశదిమ్మరులు, పారిశ్రామిక కార్మికులు, వ్యాపారులు, నావికులు, వలస వాదులు, పీడిత అల్పసంఖ్యాక ప్రజలు అందరూ వలసదారులే. దేశాల సరి హద్దులు వీరిని అడ్డగించలేదు. వలసలకు కొత్త మార్గాలను కనిపె ట్టారు. ప్రపంచీకరణ సమాజంలో సమాచార సాంకేతికతలు, ప్రయాణ సౌకర్యా లు విపరీతంగా పెరిగాయి. పరదేశాలకు ప్రయాణించేవారి సంఖ్య పెరి గింది. ప్రపంచ దేశాలలో వలస, అభివృద్ధి విడదీయరాని సంఘట నలు. వలసలతో వలసదారుల స్వస్థలాల, వలస ప్రాంతాల జమిలి అభివృద్ధి జరుగుతుం దని ప్రజలకు, పాలకులకు తెలుసు. ఇరు ప్రాంతాల సామూ హిక చర్యలు, సహకారం ఇరువురికీ అవసరం. మానవ సంచారాల అపా యాలు, వలస ప్రజల ప్రాణాల, హక్కుల గురించి ప్రభుత్వాలు, అంతర్జా తీయ సంస్థలు, వేదికలు ఇటీవలి కాలంలో అధ్యయనం చేశాయి. సంకు చిత సమాజాలకు ఇది సంక్లిష్టమైన సమస్య. ప్రాంతీయ, జాతి, మతవా దులకు అర్థంకాని మానవత్వ కోణం.
ప్రస్తుత వలసలకు కారణాలు
శక్తిమంతమైన ధనిక దేశాల ఆధునిక ఆర్థికవ్యవస్థలలో అధిక జీతభత్యాల ఉపాధులు, అవుట్‌ సోర్సింగ్‌కు ఇవ్వలేని, తక్కువ భత్యాలకు తమ ప్రజలు చేయని పనులున్నాయి. అభివృద్ధిచెందుతున్న దేశాలలో జనా భాతో పాటు చదువరుల సంఖ్య పెరిగింది. వీరికి ఆయా ఆర్థికవ్యవ స్థలు ఉపాధి కల్పించలేకున్నాయి. అభివృద్ధిచెందిన దేశాలకు ఖర్చులేకుం డా సాంకేతిక నిపుణులు లభిస్తారు. వలస కార్మికులు అతిథి దేశాల, స్వదేశాల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నారు. వీరు ఆతిథ్య దేశాలలో రాజకీయాల జోలికి పోకుండా పొదుపు చర్యలతో ”ఉత్తమ పౌరులుగా” జీవిస్తారు. వీరి బంధుమిత్రులు పర్యాటకులుగా ఆ దేశాల ఆర్థికాన్ని బలోపేతం చేస్తారు. పేదలు ఉపాధికి విదేశాలకు వెళ్ళలేరు. ఇది మధ్య, ఉన్నత మధ్య తరగతి ప్రజలకే సాధ్యం. అవసరమున్న వలస జీవులు పేదలను తమ అనధికార సేవకులుగా తీసుకుపోతారు. ఆ విధంగా కొందరు పేదలకు విదేశ ఉపాధి లభిస్తుంది.
దాడులతో దురవస్థలు
2015లో ఆఫ్రికా దేశాలు ఎక్కువ హింస, ఘర్షణలకు గురయ్యాయి. నైజీరియా, తునీషియా, లిబియాలలో ఇస్లామిక్‌ తీవ్రవాద అల్లర్లు, దక్షిణ సూడాన్‌లో పౌర యుద్ధాలు, బురుందిలో ప్రభుత్వ వ్యతిరేక సాయుధ తిరుగుబాట్లు, దక్షిణాఫ్రికాలో రాజకీయ, విదేశీ భయోత్పాత అలజడులు వాటిలో కొన్ని. ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌, సెర్బియా, లిబియా, సిరియా, యెమెన్‌లు అమెరికా చమురు దాహానికి, దాష్టీకానికి గురయ్యాయి. 25.40 లక్షల మందిని ఆదరించి టర్కీ ఆశ్రయ దేశాలన్నింటిలో ముందుంది. పొరుగు దేశాలలో గొడవల ఫలితంగా శరణార్థులు పెరిగిన దేశం టర్కీ. పాకిస్తాన్‌, లెబనాన్‌, ఇరాన్‌ తర్వాతి స్థానాలలో ఉన్నాయి. సిరియా, ఇరాక్‌ల నుంచి టర్కీ, లెబనాన్‌, జోర్డాన్‌లకు, ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పాకిస్తాన్‌కు శరణార్థులు వచ్చారు. 2015లో ప్రపంచ శరణార్థులలో 23 శాతం సిరియా నుంచి కాగా సిరియా, ఆఫ్ఘనిస్తాన్‌, సోమాలియాల నుంచి 54 శాతం ఉన్నారు. 2015లో ఎప్పుడూ లేనంతగా 24.40 కోట్ల మంది శరణాగతులుగా మారారు. వీరిలో 7.6 కోట్ల మంది ఐరోపా దేశాలలో, 7.5 కోట్ల మంది ఆసియా దేశాలలో ప్రవేశించారు. ప్రతి పది మంది వలసకారులలో ఒకరు 15 ఏళ్ళ లోపువారున్నారు. 2014లో శరణార్థుల మీద 43,600 కోట్ల డాలర్లు (రూ.29,64,800 కోట్లు) ఖర్చయింది. ప్రపంచ జనాభా పెరుగుదల వల్ల అనేక దశాబ్దాల నుంచి పెరుగుతున్న వలసలు 3 శాతం దగ్గర నిలకడగా ఉన్నాయి. గత 19 ఏళ్ళలో బలవంతపు శరణార్థుల సంఖ్య 75 శాతం పెరిగింది. 1996లో వలస కార్మికులు 3.73 కోట్లు. 2015లో 6.53 కోట్ల మంది విదేశాలలో శరణార్థులయ్యారు. వీరిలో 2.13 కోట్లు బలవంతపు శరణార్థులు, 4.08 కోట్లు అంతర్గత అల్లర్లలో నిర్వాసితులు. అనుమతులు, ఆధారాలు, వలస దేశాల డబ్బులు, అపాయకర దారులు, ఆయా దేశాలకు అనుకూలమైన దుస్తులు మొదలగు కారణాల చేత అంతర్జాతీయ బలవంతపు వలసలు చాలా కష్టనష్టాలతో కూడుకొని ఉంటాయి. బలవంతపు శరణార్థులు, అభివృద్ధి చెందుతున్న, అల్లర్లలో మునిగిన దేశాల నుంచి విదేశాలకు స్వచ్ఛందంగా వెళ్ళే వలస కార్మికులు ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటారు. రోగాలు, పోషకాహార లోపాలు మొదలగు ఇబ్బందులు పడతారు. నేరాలకు పాల్పడతారు. సరైన వసతి లేక మహిళా శరణార్థులు లైంగిక దాడులకు, లింగవివక్షతా హింసలకు గురవుతారు. అవమానాలు, నిర్లక్ష్యం, జాతి వివక్షతలు మామూలుగా జరిగే సంఘటనలు. స్థానిక చట్టాలు, భాష, సాంఘిక అవసరాలు, వృత్తి నైపుణ్యతల మీద వీరి ఉపాధి ఆధారపడి ఉంటుంది. ఇవిలేని వలస కార్మికులు నిరుద్యోగులుగానే కొనసాగుతారు. అక్రమ వలసదారులు అనధికార, చట్టరహిత పనులకు కుదురుకుంటారు. ఎక్కువ దోపిడీకి గురవుతారు. అంతర్జాతీయ వలస కార్మికులంతా పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. వీరు తమ ఉపాధిని లాక్కుంటున్నారని స్థానికులు భావిస్తున్నారు. భయపడుతున్నారు. ఇటీవలి కాలంలో అతిమితవాద నాయకులు, రాజకీయ పార్టీలు స్థానిక ప్రజలను వలస కార్మికులకు వ్యతిరేకంగా భావోద్వేగపూరితంగా రెచ్చగొట్టి అధికారానికి వచ్చారు. అమెరికా, కొన్ని ఐరోపా దేశాలు దీనికి మంచి ఉదాహరణ.
భౌగోళిక ధోరణులు
2015 లో 67 శాతం వలస కార్మికులను 20 దేశాలు ఆదరించాయి. అందులో 16 ఆసియా, ఐరోపాలలో ఉన్నాయి. ఆసియా నుంచి 43 శాతం కంటే ఎక్కువ మంది వలస వెళ్ళారు. అందులోనూ భారత్‌ అత్యధిక వలస కార్మికులను ఎగుమతి చేసింది. అమెరికా ఎక్కువ మందికి ఆతిథ్య మిచ్చింది. ఐరోపా ప్రాంతం కూడా చాలా మందినే ఆదరించింది. వలసల ఎగుమతి, దిగుమతి రెండింటిలోనూ ఆసియా ముందుంది. వలసలలో స్వచ్ఛందం, నిర్బంధం రెండూ ఉన్నాయి. సబ్‌ సహారా ఆఫ్రికా ప్రాంతం ఐరోపా ప్రాంతం కంటే ఎక్కువ మందికి ఆశ్రయమిచ్చి మొదటి పది ఆశ్రిత దేశాలలో ఉంది. వలస కార్మికులను ఎక్కువగా తయారు చేసిన పది దేశాలలో ఆరు ఆఫ్రికాలోనే ఉండటం గమనించదగ్గ విషయం.
భారత మేధో వలస
2016 డిసెంబర్‌ నాటికి ప్రవాస భారతీయులు, భారతీయ సంతతి ప్రజలు 3.08 కోట్లు. వివిధ దేశాలలో వీరి సంఖ్య అమెరికాలో 44.60 లక్షలు, సౌదీ అరేబియాలో 30.54 లక్షలు, మలేషియాలో 29.86 లక్షలు, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో 28.04 లక్షలు, మయన్మార్‌లో 20.08 లక్షలు, యుకెలో 18.25 లక్షలు, దక్షిణాఫ్రికాలో 15.60 లక్షలు, శ్రీలంకలో 16.14 లక్షలు, కెనడాలో 10.16 లక్షలుగా ఉంది. వీరు విద్య, సమాచార సాంకేతిక, వైద్య రంగాలలో ఎక్కువగా స్థిరపడ్డారు. గుజరాతీ వ్యాపారులు, పంజాబీ టాక్సీ డ్రైవర్లు కూడా ఎక్కువే. మన దేశంలో అమెరికా, పాశ్చాత్య దేశాలకు అవసరమైన చదువులు చెబుతున్నారు. మన విద్యావంతులను మన దేశంలో ఉపయోగపెట్టుకోలేక పోతున్నాము. ఉన్నత చదువులకు వెళ్ళినవారు తిరిగి రావడంలేదు. ఫలితంగా లక్షల రూపాయల భారతీయుల కష్టార్జితంతో చదివినవారు విదేశాలకు ఉపయోగపడుతున్నారు. భారతీయ బ్యాంకులు కూడా అప్పులిచ్చి వీరికి సహాయ పడుతున్నాయి. కొంత సమయం తర్వాత భారత్‌కు తిరిగి రావాలని, లేనిచో తమ సంపాదనలో కొంత శాతం భారత ప్రభుత్వానికి ఇవ్వాలని నియమముండాలి. ఇదేమీ లేకపోగా ”ఏ దొడ్లోనైనా తినండి. గుడ్లు మాత్రం మన దొడ్లో పెట్టండి” అన్నట్లు మన పాలకులు ప్రవాసీయు లను బుజ్జగిస్తునారు. దేశభక్త ప్రభుత్వాలు కూడా ప్రవాస సామర్థ్యాలకు ఉపాధి కల్పించలేకున్నాయి. సామాజిక స్పృహ కలిగిన కొందరు ప్రవాసీయులు మాత్రం మనదేశంలో అనేక రకాల ప్రజా ప్రయోజన పనులు చేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్‌ తాత్కాలిక ఉపాధి వీసాలపై పరిమితులు విధించడంతో ప్రవాసీయులు బాధల్లో, ఇబ్బందుల్లో పడ్డారు.
పరిష్కార అధ్యయనం
పేలవ పాలన, సామాజిక అసమానతలు, హింసాత్మక ఘర్షణలు, సాంస్కృతిక, రాజకీయ, జాతి, స్థానికతల కవ్వింపులు మొదలగు వాటిని అధ్యయనం చేయాలి. అతిథి దేశవాసుల మనోగతాలను అర్థం చేసు కోవాలి. వలస కార్మికుల, శరణార్థుల మానసిక స్థితిగతులను పరిశీలిం చాలి. పది లక్షల మందికి అభయమిచ్చిన స్వీడన్‌లో శరణార్థులు హింసా ఘటనలకు, ఆస్తి విధ్వంసాలకు పాల్పడుతున్నారు. అతిథుల, శరణార్థుల ఇరువురి సామాజిక భద్రత, శ్రేయస్సు, ఉపాధి మొదలగు అంశాలను సంపూర్ణ మానవత్వ దృష్టితో, మానవహక్కుల నేపథ్యంలో పరిగణించాలి. ఆర్థిక, పర్యావరణ, రాజకీయ, సామాజిక పద్ధతులు, పరిణామాలు వలసలకు దారితీస్తున్నాయి. మూలకారణాల నిరోధానికి, పరిష్కారానికి అంతర్జాతీయ సంస్థలు, వేదికలు ప్రయత్నించాలి. 2016 సెప్టెంబర్‌ 9న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ‘శరణార్థుల, వలస కార్మికుల శిఖరాగ్రసమావేశం’ నిర్వహించి వీరి రక్షణకు, సౌకర్యాల కల్పనకు ‘న్యూయార్క్‌ డిక్లరేషన్‌’ పేరుతో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. శరణార్థుల, వలస కార్మికుల శ్రేయస్సు కోసం సమితి సభ్య దేశాలలో 2018 నాటికి ప్రపంచవ్యాప్త బలోపేత వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐక్యరాజ్యసమితి నిర్ణయాలను సభ్యదేశాలు, ప్రత్యేకించి బలవంతమైన, ధనవంతమైన దేశాలు గౌరవించాలి. ఆచరించాలి.

Related posts