November 17, 2018

Breaking News

దుబాయిలో 3 నెలల క్షమాభిక్ష!

దుబాయిలో 3 నెలల క్షమాభిక్ష!

 

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న విదేశీయులకు శుభవార్త. వీసా నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు యూఏఈ సర్కారు క్షమాభిక్ష పథకాన్ని ప్రవేశపెడుతోంది. అక్రమంగా ఉంటున్నవారు ఎలాంటి జైలు శిక్షలు, జరిమానాలు చెల్లించకుండా స్వచ్ఛందంగా స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవడానికి, నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న ఉద్యోగాలను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం మూడు నెలల పాటు ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఆగస్టు 1 నుంచి అక్టోబరు 31 వరకు క్షమాభిక్ష పథకం అమల్లో ఉంటుందని అధికార వర్గాలను ఉటంకిస్తూ స్థానిక మీడియా వెల్లడించింది.

ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు దుబాయ్‌, అబుధాబిల్లోని భారత దౌత్య కార్యాలయాలకు యూఏఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇటీవల జరిగిన యూఏఈ మంత్రివర్గ సమావేశంలో వీసా నిబంధనలను సరళీకృతం చేస్తూ నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో క్షమాభిక్ష పథకం చిగురుతొడిగింది. వీసా నిబంధనలు, వాటిపై భద్రత డిపాజిట్ల కారణంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో యూఏఈ ప్రభుత్వం వీసా నిబంధనలను సరళీకృతం చేస్తూ ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

పర్యాటకుల సంఖ్యను పెంచడానికి ఉచితంగా 48 గంటల ట్రాన్సిట్‌ వీసా ఇవ్వడం, గడువు ముగిసినా ఉద్యోగాలు చేయాలనుకొంటున్న విదేశీయులకు 6 నెలల తాత్కాలిక వీసా వంటి వెసులుబాట్లను కల్పించింది. చివరిసారిగా 2013లో యూఏఈ క్షమాభిక్ష అమలు చేసినప్పుడు 61,826 మంది విదేశీయులు స్వచ్ఛందంగా తిరిగి వెళ్లారు. అప్పట్లో యూఏఈలో అక్రమంగా ఉంటున్న వారిలో సింహభాగం భారతీయులది కాగా.. అందులోనూ తెలంగాణవారే అధికంగా ఉన్నారు. కానీ, ఇటీవలి కాలంలో వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. దుబాయి, షార్జా నగరాల్లో గతంలోలాగా ఇప్పుడు తెలంగాణ ఖల్లీవళ్లీలు (అక్రమంగా ఉంటున్న వారు) లేరు.

Related posts